సబ్యసాచి చీరలో త్రిష సొగసులు.. చీర ధర లక్షల్లోనే..: త్రిష

7 Nov, 2021 10:28 IST|Sakshi

ఆచి తూచి అడుగులు వేయకుంటే.. బోల్తా కొట్టడం ఎవరికైనా తప్పదు. కెరీర్‌లో అలాంటి జాగ్రత్తలు పాటించింది కాబట్టే.. ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతోంది త్రిష. ఆ ప్రేక్షకాదరణకు ఆమె అభినయంతో పాటు అందమూ ఓ కారణమే. ఆ అందానికి అద్దం పడుతున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే.. 

సబ్యసాచి.. 

పేరుకే ఇండియన్‌ బ్రాండ్‌ కానీ,  ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ కంటే గొప్పది, ఖరీదైనది. దాదాపు బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్‌ కొహ్లీ, అనుష్కశర్మల పెళ్లి బట్టలు ఫేమస్‌. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్‌ వేర్‌ ధరించాలని, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్‌ చేశారు. ఇదే ఈ బ్రాండ్‌ చీపెస్ట్‌ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు.

పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్‌ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన సబ్యసాచి కెరీర్‌ ఆరంభించిన అనతి కాలంలోనే  ఫేమస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగాడు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్‌ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్‌ అయ్యాడు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ సబ్యసాచి డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. 

చీర బ్రాండ్‌: సబ్యసాచి
ధర: రూ. 1,79,500

మంజుల జ్యూయెల్స్‌...
ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయట పడుతుందంటారు. ఈ మాట మంజుల విషయంలో అక్షరాల నిజం. కుటుంబం గడవటం కోసం భర్తతో కలసి మైనింగ్‌ పరిశ్రమలో పనిచేసి, బంగారంతోపాటు తనలోని ప్రతిభను కూడా వెలికి తీసింది మంజుల. అప్పటివరకూ బంగారం అంటే ఇష్టం మ్రాతమే. ఆ ఇష్టాన్ని ఆసక్తిగానూ.. ఆ తర్వాత ఉపాధి అవకాశంగానూ మార్చుకుంది.

జెమాలజీలో పీజీ చేసి, ఆభరణాల రూపకల్పన నేర్చుకుంది. మొదట బంధువులు, తెలిసిన వారి వివాహాది శుభకార్యాలకు డిజైన్‌ చేసింది. వాటికి మంచి పేరు రావడంతో 2010లో ‘మంజుల జ్యూయెల్స్‌’ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా మంజుల తన డిజైన్స్‌ను అందిస్తోంది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్‌ ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్‌ మెయిన్‌ బ్రాంచ్‌గా ఉన్న మంజుల జ్యూయెల్స్‌ను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. 

జ్యూయెలరీ బ్రాండ్‌: మంజుల జ్యూయెల్స్‌ 
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. 

- దీపిక కొండి 

చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!

మరిన్ని వార్తలు