Covid: ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తున్నారా? అయితే ఓసీడే

14 Jun, 2021 18:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగ్జైటీ అండ్‌ డిప్రెషన్‌

కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగ్జైటీ, డిప్రెషన్‌ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్‌ కొనసాగుతూ ఉండగా... ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగై్జటీ అండ్‌ డిప్రెషన్‌’. దాని గురించి తెలుసుకుందాం.

గత ఏడాది మొదటి కరోనా వేవ్‌ సీజన్‌లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్‌ స్ట్రెస్‌ రియాక్షన్‌’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్‌ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. 

అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్‌లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియాగా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు.

ఇలాంటి ఆందోళనతో టెన్షన్‌ పడటాన్ని ‘జనరలైజ్‌డ్‌ యాంగై్జటీ డిజార్డర్‌ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్‌ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్‌ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్‌ డిజార్డర్‌’గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్‌ పూసుకోవడం, చేతులు అదేపనిగా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్‌ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. 

సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగ్జైటీ అండ్‌ డిప్రెషన్‌
మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్‌ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగ్జైటీ అండ్‌ డిప్రెషన్‌’’ మానసిక సమస్యతో  బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు.

 

ఈ సమస్య తాలూకు కొన్ని కేస్‌ స్టడీలు 
కేస్‌ స్టడీ 1: డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొటుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. 
కేస్‌ స్టడీ 2: మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. 
వీళ్లంతా ‘‘అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగై్జటీ అండ్‌ డిప్రెషన్‌’’ గురైనట్లు తేలింది.

అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగ్జైటీ అండ్‌ డిప్రెషన్‌ అంటే... 
అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్‌పోజ్‌ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగై్జటీ అండ్‌ డిప్రెషన్‌’’గా పేర్కొనవచ్చు. 

లక్షణాలు: అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌ విత్‌ యాంగ్జైటీ అండ్‌ డిప్రెషన్‌’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... 

∙ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా  ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్‌ హార్ట్‌ బీట్‌ ∙ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్‌ అటాక్‌)  ∙విపరీతంగా చెమటలు పట్టడం ∙ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట ∙శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం  ∙నోరు తడారిపోవడం ∙ఒళ్లు జలదరించడం  ∙అయోమయం  ∙కడుపులో గాభరా కడుపులో మంట ∙ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం ∙చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం ∙నిత్యం అలజడిగా ఉండటం ∙తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్‌ స్లీప్‌ పాట్రన్స్‌), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం... 

పై లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్‌ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్‌ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్‌ టెండెన్సిస్‌) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. 

దీని నుంచి బయటపడటం ఎలా? 
► మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్‌ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ...  ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. 

► మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్‌ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి.  

► మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్‌ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్‌ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు.

► మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి.

► మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్‌ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్‌ చేసుకోవడమూ అవసరం.  

► గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి.  ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి.  

► ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్‌మెంట్‌ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు  తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్‌ నుంచి వేగంగా బయటపడేస్తాయి.

► ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్‌ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి  డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. 


ఇవి కూడా చేయండి: 
► రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి.

► టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి.

► మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి.

► ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు.

► బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ఫాలో అవ్వండి.

► ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. 
ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్‌లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్‌ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. 


- డాక్టర్‌ చరణ్‌ తేజ కోగంటి
కన్సల్టెంట్‌ న్యూరోసైకియాట్రిస్ట్‌ 

మరిన్ని వార్తలు