కొత్త ప్రక్రియలతో ఆస్తమాను ఇలా అధిగమించవచ్చు..! 

15 May, 2022 14:00 IST|Sakshi

మెడిటిప్స్‌

ఆస్తమా అదుపు చేయడానికి మందులు, స్టెరాయిడ్స్, ఇన్‌హేలర్స్‌ వంటి సంప్రదాయ మందులు వాడటం మామూలే. ఇప్పటికీ ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే మరికొన్ని కొత్త కొత్త ప్రక్రియల ద్వారా ఆస్తమాను అదుపు చేయడం ఇప్పుడు మరింత తేలికగా మారింది. ఈ కొత్త ప్రక్రియలను తెలుసుకుందాం. 

తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ, బయలాజిక్‌ మెడిసిన్‌ అనే రెండు ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో ఆస్తమా కాస్తంత తీవ్రమైన సమస్యగా ఉన్నవారు కూడా సాధారణ  జీవితం గడపడం సాధ్యమవుతుంది. బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో శ్వాసనాళపు గోడల్ని వేడి చేస్తారు. ప్రోబ్‌ అనే  పరికరాన్ని బ్రాంకోస్కోప్‌ సహాయంతో లోపలికి పంపుతారు. అది అక్కడ వేడిమిని వెలువరిస్తుంది.

ఆ వేడిమి తో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్‌ను తొలగిస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకునే నాళం విశాలంగా తెరుచుకుంటుంది. దాంతో హాయిగా శ్వాస పీల్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియను మూడు వారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు దఫాల చికిత్స పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. మంచి ఉపశమనం దొరుకుతుంది.  జీవననాణ్యత గణనీయంగా పెరగడంతో పాటు, ఆస్తమా అటాక్స్‌ తగ్గుతాయి.

దాంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాలూ తగ్గుతాయి. ఈ చికిత్స ఫలితాలు చాలా కాలం... అంటే దాదాపుగా ఎనిమిదేళ్లు ఉంటాయి. ఇన్‌హేలర్స్‌ వాడినప్పటికీ పెద్దగా  ప్రయోజనం కనిపించని, పద్ధెమినిమిదేళ్లు పైబడిన యుక్తవయస్కులైన బాధితులకు ఎవరికైనా ఈ చికిత్స అందించవచ్చు. అలాగే ఇప్పుడు బయోలాజిక్‌ మెడిసిన్స్‌ అనే కొత్తరకం మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో శ్వాసనాళాల వాపు కారణంగా ఆ నాళాలు సన్నబడతాయి. ఆ వాపును ఈ మందులు తగ్గించడం ద్వారా ఆస్తమాను అదుపు చేస్తాయి.  


 

మరిన్ని వార్తలు