ది అడ్వాన్స్‌డ్‌ ఆక్సిడేషన్‌ టెక్నాలజీ.. తక్కువ ఖర్చుతో నీరు పునర్వినియోగం

24 Jan, 2023 17:53 IST|Sakshi

నీటి కొరత పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా నీటి పునర్వినియోగం అవసరం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. వ్యర్థజలాలను శుద్ధిచేసి, పునర్వినియోగానికి అనువుగా మార్చే పద్ధతులు కొన్ని అందుబాటులోకి వచ్చినా, అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పెద్దపెద్ద పరిశ్రమలు మాత్రమే వాటిని భరించగలుగుతున్నాయి. ఇప్పుడు ఎంత చిన్న పరిశ్రమ అయినా సులువుగా భరించగలిగేలా, తక్కువ ఖర్చుతో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని అందిస్తోంది ‘టడాక్స్‌’ (ది అడ్వాన్స్‌డ్‌ ఆక్సిడేషన్‌ టెక్నాలజీ). ఈ పద్ధతిని న్యూఢిల్లీకి చెందిన ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. కేవలం యూవీ–ఫొటో కాటాలిసిస్‌ సాంకేతికత ఉపయోగించి మునిసిపల్, మురుగునీరు, కలుషిత పారిశ్రామిక నీటి ప్రవాహాలను శుద్ధి చేసి, పునర్వినియోగానికి తగిన విధంగా మంచినీటిని అందిస్తుంది.  అంతేకాదు, ఈ అధునాతన సాంకేతికత పారిశ్రామిక మురుగునీటి శుద్ధికి జరిగే మూలధన వ్యయాన్ని 25 నుంచి 30 శాతం, నిర్వాహణ వ్యయాన్ని 30 నుంచి 40 శాతం వరకు తగ్గిస్తుంది. 

ఎలా పనిచేస్తుంది?  
టడాక్స్‌ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో యూవీ ఫొటో క్యాటాలిసిన్‌ పద్ధతి ఉపయోగించి కాంతిని రసాయనికశక్తిగా మారుస్తుంది. రెండో దశలో అధునాతన ఆక్సీకరణ ప్రక్రియ ఉంటుంది. ఇది ఆక్సీకరణ క్షీణత, కాలుష్య కారకాల ఖనిజీకరణ చేసి, బయో–డీగ్రేడబిలిటీని మెరుగుపరుస్తుంది, పొరల బయో ఫౌలింగ్‌ను నివారిస్తుంది. దీంతో నీటిలోని ఘన మలినాలను పీల్చుకుని వడగొట్టే ఆర్‌ఓ (రివర్స్‌ అస్మాసిస్‌)ల జీవితకాలం, సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మల్టిఫుల్‌ ఎఫెక్ట్‌ ఎవాపరేటర్లు, మెకానికల్‌ ఆవిరి రీకంప్రెషన్‌లపై భారాన్ని పెంచి, కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీఓడీ), బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ), వ్యాధికారకాలు, నిరంతర జీవ కాలుష్య కారకాలు, సూక్ష్మ కాలుష్య కారకాలను తగ్గిస్తుంది. తృతీయ దశలో నాణ్యత స్థాయిని గుర్తించి, పునర్వినియోగానికి అనువైన పరిశుభ్రమైన నీటిని అందిస్తుంది. 

త్వరలోనే అమలు.. 
టడాక్స్‌ను ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ ‘నమామి గంగే’ కార్యక్రమం కింద కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఇది 2021 ఏప్రిల్లోనే ఫీల్డ్‌ ఇంప్లిమెంటేషన్‌లు, టెక్నాలజీ అండ్‌ ట్రేడ్‌ మార్క్‌ లైసెన్స్‌ ఒప్పందం ద్వారా వాణిజ్యీకరణకు సిద్ధమైంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయి కార్యాచరణలోకి రావచ్చు. 
∙దీపిక కొండి 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు