అందరం మనమే ఆనందం మనదే

17 Nov, 2020 09:35 IST|Sakshi

ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందాం పద అని బయలుదేరారు ఇండోర్‌ స్త్రీలు. అక్కడి ‘అడ్వంచరస్‌ ఉమెన్‌ గ్రూప్‌’ కోవిడ్‌ వల్ల గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి వేళ పండగ పర్యటనకు బయలుదేరారు. ఇండోర్‌ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్‌ ఈ గ్రూప్‌ను నడుపుతారు. స్త్రీలను విహారాలు, పర్యటనలు, యాత్రలు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు.

సెప్టెంబర్‌ 20, 2020న ఇండోర్‌లో ఒక ఈవెంట్‌ జరిగింది. దానిని ఆర్గనైజ్‌ చేసింది ఆ నగరంలో ఉన్న ‘అడ్వంచరస్‌ ఉమెన్‌ గ్రూప్‌’. దాని స్థాపకురాలు శ్రేష్టా గోయల్‌. ఆ ఈవెంట్‌ పేరు ‘డ్రైవింగ్‌ ఈజ్‌ మై పేషన్‌’. ఇండియాలో కార్లున్న లక్షలాది ఇళ్లల్లో స్త్రీలకు ఆ ఇళ్లలోని వంట గదులో, వరండాలో అప్పజెబుతుంటారు డ్రైవింగ్‌ చేయడానికి కారు మాత్రం ఇవ్వరు. ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కారులో కూచోబెట్టి ఊరికో, ఉద్యోగానికో తీసుకెళ్లి దింపుతారు కాని స్టీరింగ్‌ అప్పజెప్పరు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేల ప్రకారం పురుషుల కంటే స్త్రీలే సేఫ్‌ డ్రైవర్లని తేలింది. అయినా సరే స్త్రీలకు కారు డ్రైవింగ్‌ ఇంకా నిరాకరింపబడే విషయంగానే ఉంది. అందుకే శ్రేష్టా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్‌ చేసింది.

10 రోజులు 200 మంది
సెప్టెంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకూ దేశంలోని ఐదారు రాష్ట్రాలు, కేరళతో సహా కార్లు డ్రైవ్‌ చేసే స్త్రీలు వారు గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్‌లో తమ వాహనాలతో తిరిగారు. ‘డ్రైవింగ్‌ ఈజ్‌ మై పేషన్‌’ అని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఇతరరాష్ట్రాలలో వివిధ శాఖలలో పని చేస్తున్న స్త్రీలు.. ముఖ్యంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు స్త్రీలను ఉత్సాహపరచడానికి వీడియోలు విడుదల చేశారు. ‘జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనాన్ని నడపడం తెలియాలి. ఈ స్కిల్‌ స్త్రీలకు చాలా ముఖ్యం. కారు నడపడం లగ్జరీ కాదు. అవసరం. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఒంటరి కారు ప్రయాణాలు చేయగలరు. అడ్వంచర్లు చేయగలరు.

నేనైతే కారులో జైపూర్‌ నుంచి బద్రీనాథ్‌కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాను. రాక్‌ ది రోడ్స్‌’ అంటూ ఇండోర్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ డైరెక్టర్‌ అర్యామా సన్యాల్‌ ఒక వీడియో విడుదల చేశారు. ‘డ్రైవింగ్‌ చేస్తే ఫోకస్‌ తెలుస్తుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కంట్రోల్‌ చేయడం కూడా తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ ఒక వీడియో విడుదల చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్‌ విజయవంతమైంది. స్త్రీలు తమ డ్రైవింగ్‌ అనుభవాలు పంచుకుని స్త్రీలను ఉత్సాహపరిచారు. దీని కారకులలో ముఖ్యురాలు శ్రేష్టా గోయల్‌.

అడ్వెం‘టూర్‌’
ఇండోర్‌లో ఒక ఫార్మాసూటికల్‌ కంపెనీ సి.ఇ.ఓ అయిన శ్రేష్టా గోయల్‌ తనకు అత్యంత ఇష్టమైన విషయం తన జిప్సీని డ్రైవ్‌ చేయడమే అని చెప్పుకుంటారు.‘జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అని చెబుతారామె. అందుకనే ఇండోర్‌లో ఆమె ‘అడ్వంచరస్‌ ఉమెన్‌ గ్రూప్‌’ అనే సంస్థను స్థాపించారు. కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలు ఈ గ్రూప్‌లో సభ్యులు. ఇంటికి, ఉపాధికి సమయం ఇస్తూనే తమదంటూ జీవితాన్ని లోకం చూడటం ద్వారా గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్‌ ద్వారా ఒక చోట చేరారు. ‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ఈ టూర్లను అడ్వెంటూర్లని అంటారు. రెండు మూడు నెలలకోసారి వీరో పర్యటనను ప్లాన్‌ చేస్తారు.

‘అందరం మనమే ఆనందం మనదే’ అన్నట్టు తిరుగుతారు. నదులు, పర్వతాలు, అడవులు వీరి పర్యటనా స్థానాలు. అడపాదడపా ఇంటికి వచ్చే బంధువులు, వెళ్లే బంధువులు పిండివంటలు ఇంటి అలంకరణలు... ఈ పని ఎలాగూ తప్పదు. దానికి సిద్ధమయ్యే ముందు ఈ లాక్‌డౌన్‌ ఇచ్చిన వొత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఒక విహారం అవసరం అని అక్టోబర్‌ 9న ‘అడ్వంచరస్‌ ఉమెన్‌ గ్రూప్‌’ సభ్యులు ఇండోర్‌ నుంచి కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు. చాలా బాగా అనిపించింది’ అంది శ్రేష్టా గోయల్‌. ఇండోర్‌లోనే కాదు దేశంలోని ప్రతి చిన్న పట్టణంలో ఇలాంటి బృందాలు అవసరం అనిపిస్తుంది వీరిని చూస్తుంటే. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా