బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఇది

8 Apr, 2021 00:25 IST|Sakshi

ఇటీవల కొంతమంది బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ ద్వారా శరీరంలోని క్యాలరీస్‌ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రీతింగ్‌ వ్యాయామాలు మంచివే అయినా... బరువు తగ్గించడానికి మాత్రం ఇది సరికాదు. దానివల్ల మన శరీరంలోకి ఆక్సిజన్‌ ఎక్కువగా వెళ్లడం వల్ల కొంత ఉపయోగం ఉండవచ్చు గాని... బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం కూడా అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్‌ అంటారు. 

మన శరీరంలో పేరుకొని ఉండే శక్తినిల్వల్లో ప్రధానమైనది కొవ్వు.  దాన్ని కరిగించి శక్తి రూపంలోకి మార్చడానికి ఒక యాంత్రిక చర్య (మెకానికల్‌ యాక్షన్‌ అంటే ఉదాహరణకు ఏరోబిక్స్‌) అవసరం. అందుకు వ్యాయామం ఉపకరిస్తుంది. ఇక్కడ కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకోవడం అవసరం.
ఊపిరితిత్తులు – శ్వాసించడం ద్వారా ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరుతుంది. సరిగా శ్వాసించడం వల్ల బయటి వాయువుల నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ గ్రహించగలుగుతాం.
గుండె, రక్తనాళాలు  – గుండె, రక్తనాళాలు ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను  శరీరంలోని కణజాలలకు అందచేస్తాయి. ఎరోబిక్‌ ద్వారా (ఓ నిర్ణీత పరిమితిలో) ఎంతగా గుండె కొట్టుకునేలా చేయగలిగితే అంత సమర్థంగా ఆక్సిజన్, పోషకాల అందజేత ప్రక్రియను మెరుగుపరచవచ్చు.
పనిచేసే కండరాలు – ఇవి ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. చక్కగా శ్వాసించడం, గుండె అధికంగా కొట్టుకోవటం, కండరాల పనితీరు– ఇవన్నీ శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయి. పై మూడు ప్రక్రియలను  సమన్వయపరుస్తున్నప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది. అందుకు బాగా ఉపయోగపడే వ్యాయామాలే ఏరోబిక్‌! అంటే... ఉదా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌ లాంటి వ్యాయామాలు కొవ్వుని తగ్గించటంలో బాగా ఉపయోగపడతాయి. 

మరిన్ని వార్తలు