నాన్నను.. డూడ్‌ అంటూ క్లోజ్‌గా..

27 Sep, 2020 08:16 IST|Sakshi

 సమకాలమ్‌

‘నాన్నా.. ఇక్కడ కొన్నాళ్లుంటాను’ అంటూ లగేజ్‌తో ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన కూతురిని సాదరంగా ఆహ్వానిస్తాడు తండ్రి. ‘అంతాబాగే కదా’, ‘అల్లుడు రాలేదేం’ వంటి ఆరా తీసే, ఇంటారాగేషన్‌ చేసే ప్రశ్నలు అడగకుండానే. కొన్నాళ్లున్నాక  ‘నా భర్తను వదిలేశాను నాన్నా.. నన్ను చెంప దెబ్బ కొట్టినందుకు’ అని చెప్తుంది. ఆమె స్వాభిమానాన్ని అర్థం చేసుకుంటాడు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే కూతురి పోరాటానికి మద్దతునిస్తాడు. 
ఇది ‘థప్పడ్‌’ సినిమాలో సన్నివేశం. 
∙∙ 
‘నీ చిన్నప్పటి ఫ్రెండ్స్‌ని కలవాలి అంతే కదా.. డన్‌’ అని తన అత్తగారికి అభయమివ్వడమే కాదు చెన్నైలోని తన అత్తగారిని, ఆగ్రాలో, ఆంధ్రలో ఉంటున్న ఆమె ప్రాణస్నేహితురాళ్లతో కలుపుతుంది. ఆ ముగ్గురిని ఒక్క మూడు రోజులు ఇల్లు, కుటుంబ బాధ్యతల నుంచి తప్పించి చిత్రకూట్‌కు తీసుకెళ్తుంది. ఆ ప్రయాణం ఆ  ఫ్రెండ్స్‌లో జీవనోత్సాహాన్ని నింపడమే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యుల ఆలోచనా తీరునూ మార్చేస్తుంది. ఈ ముగ్గురి పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ‘ఆడవాళ్లకు మాత్రమే’ అనే సినిమా కథ. 
∙∙ 
‘అమ్మా.. అతను నాతో బ్రేకప్‌ చేసుకున్నందుకు బాధ లేదు. కాని వాళ్లమ్మతో నా ఫ్రెండ్‌షిప్‌ కట్‌ అయిపోయి ఓ మంచి ఫ్రెండ్‌ను కోల్పోయానన్న దిగులు వెంటాడుతోంది’ అని చెప్తుంది కూతురు. ‘బ్రేకప్‌ అయింది అతనితో.. వాళ్లమ్మతో కాదుకదా’ అంటూ తన కూతురి ఫోన్‌లోంచి ఆ అబ్బాయి తల్లికి ఫోన్‌ కలిపి మాట్లాడిస్తుంది. ఆ స్నేహం కొనసాగేలా ప్రోత్సహిస్తుంది ఆ అమ్మ.  ఇది ‘వరనే ఆవశ్యముండ్‌’ అనే మలయాళ సినిమాలోని ఒక లేయర్‌. 

ఇవన్నీ కథలే. కాని అనుబంధాల్లో వచ్చిన మార్పులకు అద్దం పడ్తున్న చిత్రాలు.  ఇదివరకున్న కుటుంబ బంధాలు వేరు. నవ్వును బలవంతంగా మీసాల చాటున దాచేసి, లేని కోపాన్ని కళ్లల్లో ప్రదర్శించే గంభీరమైన నాన్న, ఇంటెడు చాకిరీని ఒంటిచేత్తో సవరిస్తూ.. నాన్న నియమాలను ఇంటిల్లిపాది తుచతప్పకుండా పాటించేలా చూసుకునే అమ్మ, ఆ పాలనలో పెరగడం తప్ప తల్లిదండ్రులు పంచే స్నేహ మాధుర్యాన్ని ఆ తరం పిల్లలందరూ అనలేం కాని చాలామందైతే అందుకోలేదు. కుటుంబ పెద్ద ఎప్పుడూ చూపులతో కాఠిన్యాన్ని కురిపించాలనే భావన వల్ల కావచ్చు.. ఆలోచనా సారూపత్య లేమీ కారణం కావచ్చు..  ఆ అంతరం అలా ఉండిపోవడానికి.

కాని ఇప్పుడు ..
నాన్నను.. డూడ్‌ అంటూ స్నేహితుడి కన్నా క్లోజ్‌ చేసుకుంటున్నారు. అమ్మ... ఏ కాలంలోనైనా పిల్లల ఆప్తురాలే. ఈ కాలంలో ఐడెంటిటీ ఉన్న మహిళగానూ గౌరవం ఇస్తున్నారు. అందుకే ‘మసాబా మసాబా’లో అడుగుతుంది మసాబా తన తల్లి నీనా గుప్తాను ‘నీలా నేనెందుకు లేను?’అని. తల్లిదండ్రులూ పిల్లలకు అంతే దగ్గరగా ఉంటున్నారు. సంకోచాలు, బిడియాలు లేకుండా భేషజాలకు పోకుండా మెదులుతున్నారు. అమ్మ, నాన్న కాకపోతే పిల్లలకు ఇంకెవరు ఇస్తారు ఆసరా అనుకుంటున్నారు. పిల్లల ప్రేమకు రాయబారులగా మారుతున్నారు. వాళ్ల తొందరపాటు తప్పటడుగా మారకుండా అనుభవాన్ని చెలిమిగా మార్చి పంచుతున్నారు. బ్రేకప్‌లు, ఫెయిల్యూర్‌లు జీవితంలో భాగమని సంభాళించుకుని ముందుకు నడిచేలా వెన్ను తడుతున్నారు. కాబట్టే మసాబాకు సలహా ఇవ్వగలిగింది నీనా.. ‘యాంత్రికంగా మూడు ముళ్లను భరించే కంటే ఇష్టంగా లివిన్‌ రిలేషన్‌ను ఆస్వాదించడం మేలు’ అని.

ఉద్యోగం మానేస్తాను అని పిల్లలు చెబితే గాబరా పడి మెలోడ్రామాను పండిచట్లేదు పెద్దలు. వాట్‌ నెక్స్‌›్ట అంటూ వాళ్ల ఐడియాలకు పదును పెడ్తున్నారు. పిల్లల నోట డైవోర్స్‌ అనే మాట విని మిన్ను విరిగి మీదపడ్డట్టుగా కుంగిపోవట్లేదు. భార్య, భర్తగా విడిపోతేనేం స్నేహితులుగా కొనసాగుతామనే పిల్లల పాజిటివ్‌ యాటిట్యూడ్‌ను చూసి విరిగిన వియ్యంతో నెయ్యం నెరపుతున్నారు. ఏదైనా పేరెంట్స్‌కు చెప్పొచ్చు అనే భరోసానిస్తున్నారు. కాబట్టే అమ్మానాన్నలకు తెలియకుండా జరిగే ఆర్యసమాజ్‌ పెళ్లిళ్లకన్నా అమానాన్నలను ఒప్పించి చేసుకుంటున్న పెళ్లిళ్లే ఎక్కువవుతున్నాయి. కులం, మతం కన్నా వధూవరుల మధ్య అవగాహన ముఖ్యమనుకుంటున్న పెద్దలూ ఉంటున్నారు. మిలేనియల్స్‌ హ్యాంగవుట్స్‌లో భాగమవుతున్నారు, వాళ్ల హ్యాంగోవర్‌నూ షేర్‌ చేసుకుంటు న్నారు. అచ్చంగా స్నేహితుల్లానే మెదులు తున్నారు. నిజజీవితంలోని ఈ దశ్యాలే న్యూ వేవ్‌గా తెరకెక్కుతున్నాయి. 

ఒక్కటవ్వడానికి..
అభిప్రాయలు, అభిరుచులే కాదు ప్యాషన్, ఫ్యాషన్‌నూ ఎక్స్‌చేంజ్‌ చేసుకునేంతగా తరాల అంతరం తగ్గడానికి కారణం సాంకేతిక విప్లవమే. నీనా గుప్తా అంటుంది ఓ ఇంటర్వ్యూలో ‘థాంక్‌ గాడ్‌... నా కూతురి చెప్పుల సైజ్, నా చెప్పుల సైజ్‌ ఒకటే’ అని. కాలాలు మాత్రమే కాదు ప్రాంతాలను ఒక్కటి చేసింది. పల్లె, పట్టణానికున్న దూరాన్ని చెరిపేసింది. కనుక ఈ పరిణామం అన్నిచోట్లా ఒకేలా ఉంది. మంచి, చెడుల ప్రస్తావనే లేదు. కుటుంబాలు చిన్నవైనా ఆలోచనా పరిధి విస్తృతం కావాలి... క్రమశిక్షణ కన్నా కలుపుగోలుతనానికే విలువ పెరగాలి. ఈ మార్పు కుటుంబంలోని హిపోక్రసీ ని గేటు బయటకు పంపిస్తుంటే ఇంతకన్నా ఆరోగ్యం ఏంటుంది! మహిళల సలహాలు, పిల్లల అభిప్రాయాలతో ఫ్యామిలీ పాలసీ తయారవుతుంటే అంతకు మించిన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది!!
-శరాది 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా