Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే!

4 Sep, 2021 05:32 IST|Sakshi

భవిష్యత్తుపై ఆశలేదు. రేపటి కోసం ఆలోచన చెయ్యడం లేదు.  బెంగంతా ఈ రోజు పైనే. మరుక్షణంలో ఏమి జరుగుతుందో! ఇదీ అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి. మనదేశానికి విద్యార్థులుగా వచ్చిన ముగ్గురు మహిళల మనోగతం.

‘‘అఫ్గానిస్తాన్‌లో సామాన్యుల జీవితం కకావికలమైపోయింది. ఉపాధి కరువైన బ్రతుకులు... మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని పాలకులు... ప్రాణాలకు విలువివ్వని ఆటవికరాజ్యంలో  జీవనం దినదిన గండం కాదు, క్షణక్షణ గండం.  సూక్ష్మంగా ఇవే అక్కడ ఉన్న మా వాళ్ల జీవితాలు’’ అంటూ అఫ్గానిస్తాన్‌ నుంచి విశాఖపట్నం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందరం చదువుకున్నాం!
ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానిస్తాన్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయ విద్య అభ్యసిస్తున్న అవాస్తా బకాష్‌ తెలిపారు. జూలై మాసంలో ఆమె కాబూల్‌లో తన కుటుంబంతో గడిపి వచ్చారు. గతంలో తాలిబాన్‌ల పాలను గుర్తుచేసుకుంటూ...  తొమ్మిది సంవత్సరాల వయసులో పాఠశాలలో 4వ తరగతిలో చేరినట్లు తెలిపారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం అప్పటి తాలిబాన్‌ పాలన ముగిసిన తరువాత ప్రాధమిక విద్య నుంచి న్యాయ విద్యలో డిగ్రీ వరకు కాబూల్‌లో పూర్తిచేశాను. మా నాన్న ఆర్మీ అధికారిగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మేము మొత్తం ఏడుగురు సంతానం. ఇద్దరమ్మాయిలం. మా సోదరులు కనస్ట్రక్షన్‌ ఇంజనీరింగ్, ఎంబిఏ, బీటెక్, జర్నలిజం చేశారు. మా సోదరి వివాహం చేసుకుని నార్వేలో నివస్తోంది’’ అని చెప్పారు అవాస్తా బకాష్‌.

రోజులు వెళ్లదీస్తున్నాం!
‘‘మా కుటుంబం కాబూల్‌లో నివసిస్తోంది. తాలిబాన్‌ల రాకతో అందరూ ఉపాధిని కోల్పోయారు. దాచుకున్న డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆఫ్గనిస్తాన్‌ వెళ్తే వాళ్లకు భారం కావడం తప్ప ప్రయోజనం లేదు. గతంలో నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత అఫ్గానిస్తాన్‌ కార్మిక మంత్రిత్వ శాఖలో లెజిస్లేటర్‌గా, రెండేళ్లు జెండర్‌ ఆఫీసర్‌గా, ప్రధాని కార్యాలయంలో అవినీతి నిరోధక అధికారిగా రెండేళ్లు పనిచేశాను. న్యాయవిద్యపై ఆసక్తితో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరాను. ప్రసుతం ఎల్‌ఎల్‌ఎమ్‌ ఫైనల్‌లో ఉన్నాను.

ఇప్పట్లో వెళ్లలేం!
ప్రస్తుత తరుణంలో భారత్‌ను విడిచి అఫ్గానిస్తాన్‌కు వెళ్లలేను. అనుమతిస్తే భారత్‌లో శరణార్థిగా ఉండిపోతాను. తాలిబాన్‌లు ఇటీవల చంపేసిన వాళ్లలో అప్పట్లో నాతో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మేము ఎవ్వరికీ హాని చేయమని చెబుతున్నప్పటికీ తాలిబన్‌ల ధోరణిలో మార్పు రావడం లేదు, పాత పంథాలోనే వెళుతున్నారు. ఇప్పటికే తాలిబాన్‌లు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన వారిని వదిలి పెట్టమని, వారు అమెరికాకు బానిసలుగా పనిచేసిన వారని బహిరంగంగా ప్రకటించారు. మా దేశానికి వెళితే నా ప్రాణాలకు ముప్పు తప్పుదు.

అవకాశం వచ్చినట్టే వచ్చి...
అఫ్గానిస్తాన్‌లో 1990 నుంచి మోడరనైజేషన్‌ ప్రారంభం అయ్యింది. గత ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన ఉద్యోగాలు కల్పించింది. మహిళలు విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అడుగు పెట్టగలిగారు. రాజకీయరంగంలో సైతం రాణించారు. కొన్ని పరిమితులకు లోబడి పురుషులతో సమాన స్థాయిలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు వచ్చాయి. నేడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది.  ఇప్పుడు అఫ్గాన్‌లో పురుషుడి సహాయం లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.

మూసివేత దిశగా బ్యాంకులు
తాలిబాన్‌లు తమ హవాను కొనసాగించడం అంత సులభం కాదు. విదేశీ బ్యాంకులు ఇప్పటికే తమ శాఖలను మూసివేయాయి. నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌ సైతం మూతబడింది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. సమాజం సైతం తాలిబాన్‌ పాలనను స్వాగతించడం లేదు. అంతర్గతంగా వీరిపై పోరు ప్రారంభమవుతోంది.  ప్రపంచ దేశాల నుంచి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేప«థ్యంలో తాలిబాన్‌లు తాత్కాలికంగా కొంత సంయమనం పాటిస్తున్నారంతే.

కోవిడ్‌ కంటే ప్రమాదకరం
వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళలు విధులకు హాజరు కావచ్చని తాలిబాన్‌లు చెప్పారు. అయినప్పటికీ వారు విధులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ కంటే తాలిబాన్‌లే ప్రమాదకరమని నమ్ముతున్నాను. గత 15 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి నేడు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితి నెలకొంది. డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్‌ వంటి కళారంగాలను పూర్తిగా నిషేధించారు. దీంతో ఆయా కళాకారులు తమ వృత్తిని మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో వస్తాయని చెబుతున్నారు, కానీ ఆ మాటను నమ్మే పరిస్థితి మాత్రం లేదు’’ అని వివరించారు అవాస్తా బకాష్‌.

ఒక్క రోజులో జీవితాలు మారిపోయాయి
అఫ్గానిస్తాన్‌లో మా జీవితాలు కేవలం ఒక్క రోజులోనే తలకిందులయ్యాయి. తాలిబన్‌లు మొదటగా మహిళలపైనే ఉక్కుపాదం మోపారు. తాలిబాన్‌లను ఆణచివేస్తామన్న ప్రభుత్వం ఒక్కరోజులోనే వారికి సరెండర్‌ అవడం అంతా కలగా జరిగిపోయింది. అక్కడ మహిళలు మాత్రమే కాదు, పురుషుల జీవితాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. గడ్డం పెంచడం, సంప్రదాయ వస్త్రధారణ, టోపీ పెట్టుకోవడం వంటి ఆచారాలను తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది.
– ముబారకా, బీసీఏ స్టూడెంట్‌

ఇస్లాం పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు...
తాలిబాన్‌ల సంఖ్య పెరగడానికి కారణం నిరక్షరాస్యత, పేదరికమే. 14 సంవత్సరాల పిల్లలను మదర్సాలకు పంపిస్తారు. అక్కడ వారి మనసులను ముల్లాలు మార్చివేస్తారు. ముల్లాలు చెప్పిందే వేదంగా భావించిన పిల్లలు తాలిబాన్‌ వైపు అడుగులు వేస్తున్నారు. తాలిబన్‌ల విస్తరణ ఇస్లాం అనే పవిత్రమైన పదాన్ని దుర్వినియోగం చేస్తూనే జరిగింది. నిరక్షరాస్యులైన తాలిబాన్‌లు పరిపాలన చేయడం, విధులను ఎలా నిర్వహిస్తారు?
– పేరు చెప్పడానికి ఇష్టపడలేదు

– వేదుల వి.ఎస్‌.వి నరసింహం సాక్షి, విశాఖపట్నం

మరిన్ని వార్తలు