అతని బుల్లెట్‌ గాయం..వికలాంగ విద్యార్థులకు వరం!

30 Mar, 2021 22:06 IST|Sakshi

జీవితం అందరికీ పూలపాన్పులా ఉండదు. మనం వెళ్లే దారిలో ముళ్లు, రాళ్లు గుచ్చుకుంటాయి. వాటిని తీసేస్తూ..గాయాలు చిత్రవధ చేస్తున్నా ముందుకుసాగాల్సిన గడ్డు పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని జీవితాన్ని నిలబెట్టుకునే వారు మన సమాజం లో ఎందరో ఉన్నారు. ఈ కోవకు చెందినవారే కశ్మీర్‌కు చెందిన జావేద్‌ అహ్మద్‌ తక్‌. ఉగ్రదాడి లో తన జీవితాన్నీ కోల్పోయినప్పటికీ నిరాశా నిస్పృహలలో కూరుకుపోకుండా తన జీవితాన్నీ నిలబెట్టుకుని.. తనలాగా అంగవైకల్యంతో బాధపడుతోన్న పిల్లలకు చదువు చెబుతూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు జావేద్‌.
అది 1997 జావేద్‌ బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

అనంతనాగ్‌లో తన అంకుల్‌ ఇంట్లో జావేద్‌ ఉండగా అర్ధరాత్రి ఆ ఇంటిపై ముష్కరులు దాడిచేశారు. ఆ సమయంలో తన కజిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన జావేద్‌కు బుల్లెట్‌ తగిలింది. బుల్లెట్‌ వెన్నుపూసకు తగలడంతో మూత్రపిండాలు, క్లోమం, పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆసుపత్రిలో ఒక సంత్సరంపాటు చికిత్స తీసుకున్న తరువాత 1998లో జావేద్‌ డిశ్చార్జ్‌ అయ్యాడు. ఆ తరువాత కూడా కదలలేని పరిస్థితుల్లో మరో మూడేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అలా మంచం మీద ఉన్న జావేద్‌కు తన ఇంటిపక్కన పిల్లలు అరుస్తూ ఆడుకుంటున్న శబ్దాలు వినపడేవి. అలా వింటూ 2000 సంవత్సరంలో ఆ పిల్లలందరికి ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి తనను తాను మోటివేట్‌ చేసుకుంటూ..పిల్లలకు ఎలా చదువు చెప్పాలి వంటి అంశాలపై ఆలోచించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలనుకున్నాడు.

జెబాఅపా..
2006లో అంగవైకల్యంతో బాధపడే పిల్లల కోసం ఒక అద్దె భవనంలో  ‘జెబాఅపా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌’ పేరిట స్కూలును ప్రారంభించాడు జావేద్‌. తన బంధువులు, స్నేహితులు చుట్టపక్కల ఊళ్లలోని అంగవైకల్యం కలిగిన పిల్లలను జెబాఅపాలో చేర్చేవారు. జావేద్‌ మరికొంతమంది టీచర్లను నియమించుకుని స్కూలును నడపడం ప్రారంభించాడు. స్కూల్‌తోపాటు తనూ.. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2007లో కశ్మీర్‌ యూనివర్సిటీలో సోషల్‌ వర్క్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. 

మొదట్లో ప్రాథమిక తరగతులకే పరిమితమైన జెబా స్కూలు తరువాత ఎనిమిదో తరగతివరకు పొడిగించారు. 120 మంది వికలాంగ విద్యార్థులు 25 మంది టీచర్లతో స్కూలును విజయవంతంగా నడిపిస్తున్నారు. స్పెషల్లీ ఏబుల్డ్‌ (వికలాంగులు) విద్యార్థులు కావడం తో వారికి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చదువు చెప్పడంతోపాటు, స్పీచ్‌ థెరపిస్టులతో పాఠాలు నేర్పిస్తున్నారు. సిలబస్‌ను ప్రత్యేకంగా రూపొందించి, పిల్లలకే కాకుండా టీచర్లకు కూడా జావేద్‌ శిక్షణ ఇస్తున్నాడు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ దాతలు ఇచ్చిన విరాళాలు, ఎన్జీవోల సాయంతో స్కూల్‌ను నడుపుతున్నట్లు జావేద్‌ చెప్పాడు. జావేద్‌ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదవడంతోపాటు, క్రీడల్లోనూ రాణిస్తూ పతకాలను సాధిస్తున్నారు.

హ్యుమానిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌
జావేద్‌ ఒక్క స్కూలేగాక హ్యుమానిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ను కూడా సంస్థను స్థాపించి వైద్యం కొనుక్కోలేని నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్యాన్నీ అందిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ వంటి వాటిని సేకరించి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఆర్గనైజేషన్‌ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టారు. తన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద విషాద ఘటనను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని.. సమాజానికి మేలు చేసేందుకు కృషి చేస్తోన్న జావేద్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

జావేద్‌ మాట్లాడుతూ...‘‘ప్రారంభంలో మా స్కూలుకు బాలికలను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. తర్వాత వారితో నేను మాట్లాడి ఒప్పించడంతో ఎంతో ధైర్యంగా అమ్మాయిలను స్కూలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికోసం రెండు బస్సులు కొనుగోలు చేశాం. అవి సరిపోవడం లేదు. అందువల్ల కొంతమంది పిల్లలకి స్కూల్‌ వద్ద వసతి కల్పిస్తున్నాం. అనేక అవరోధాలు ఎదుర్కొంటూ ఒక్కో వసతిని స్కూలుకు సమకూరుస్తున్నాం.

హయ్యర్‌ సెకండరీ లెవల్‌కు స్కూలు ఎదుగుతుంది’’ అని ఆశిస్తున్నట్లు జావేద్‌ చెప్పాడు. ‘‘బుల్లెట్‌ గాయం వల్ల నేను జీవితాన్నే కోల్పోయాను. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కింద కేవలం 75 వేల రూపాయలను ఇచ్చింది. కానీ ఆ సమయంలో నా చికిత్సకు లక్షల్లో ఖర్చయింది. ఆ విషాదం జరగాలని రాసి ఉంటే ఏం చేయగలం. అది జరిగిపోయింది. అక్కడే ఆగిపోతే మిగతా జీవితం కూడా చీకటైపోతుంది. అందుకే నాలాగా ఇబ్బంది పడే వికలాంగులకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నాను’’ అని జావేద్‌ చెప్పాడు.            

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు