ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా కనిస్తారు..

5 Sep, 2021 10:38 IST|Sakshi

చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా త్వరగా పెరగాలనుకుంటారు. కాని పెద్దయ్యాక ఎప్పటికీ పాతికేళ్లవారిగానే ఉండిపోవాలనుకుంటారు. ఇది సహజం. ఎంతగా పెరిగినా కొందరిలో వయసు అంతగా కనిపించదు. అందరిలోనూ అలాగే జరగడానికి ఈ కింది పేర్కొన్న సూచనలు చాలావరకు ఉపకరిస్తాయి. పాటించి చూస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్యనిపుణులు. 

వృద్ధాప్య లక్షణాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనది జన్యు సంబంధమైన కారణాలు. ఇది తప్పించలేని కారణం. అయితే మిగతా కారణాలను ఈ కింది విధంగా చెప్పుకోవచ్చు. అవి... 
♦ సాంక్రమిక రోగాలు (ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌)
♦ ఆహార లోపాలు (న్యూట్రిషనల్‌ డెఫిషియెన్సీస్‌)
♦ హార్మోన్లలో మార్పులు. 
ఈ కారణాల్లోని చాలావాటిని మనం చక్కదిద్దుకోగలం. ఇదెలాగో చూద్దాం. 

► ఆహారం : ఆహారం అనగానే మనం రోజూ రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం తినే ఏది పడితే అది కాదు. అన్ని పోషకాలూ సమపాళ్లలో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. అందునా మరీ ఎక్కువ కారాలూ, మసాలాలూ, ఉప్పు లేని బ్లాండ్‌ డైట్‌. ఇలాంటి ఆహారం తీసుకునేవారు చాలాకాలం పాటు యౌవనంగా ఉంటారు. 
ఛదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! 

►ఆకుపచ్చని ఆకుకూరలు : మనం తీసుకునే ఆహారంలో ముదురాకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు కాస్తంత ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. వీటన్నింటిలోనూ చాలాకాలం పాటు దేహాన్ని ఆరోగ్యంగా ఉంచగల అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల్లాంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి కణపు ఆరోగ్యాన్ని చిరకాలం కొనసాగేలా చేయగలవు. అంతేకాదు.. ఎముకలను పటిష్టపరచడం, రక్తనాళాల్లో రక్తం సాఫీగా పయనించేలా చేయడం, మంచి చూపు, కొలస్ట్రాల్‌ తగ్గేలా చేయడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇవన్నీ యౌవనాన్ని నిలుపుకునేందుకు దోహదపడేవే.
చదవండి: ఆడ దోమలు మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా?!

►మంచి కొవ్వులు : చాలామంది కొవ్వులు అనగానే వాటిని నిరసించేలా చూస్తారు. కానీ కొవ్వులు చాలా కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దేహానికి హానిచేసే జంతుసంబంధిత కొవ్వులైన ట్రాన్స్‌ఫ్యాట్స్‌ కాకుండా బాదం, అవకాడో వంటి నట్స్‌ నుంచి లభ్యమయ్యే కొవ్వులన్నీ కీలకమైన జీవక్రియల్లో పాలుపంచుకుంటాయి. అంతేకాదు... కీలకమైన అవయవాలన్నింటిపైనా ఆరోగ్యకరమైన రీతిలో అలముకుని, వాటిని రక్షిస్తూ చాలాకాలం పాటు అవి దెబ్బతినకుండా చూస్తాయి. అవెంతకాలం నిరాటంకంగా పనిచేస్తాయో మన దేహం కూడా అంతేకాలం యౌవనంగా కనిపిస్తుంటుంది. 

►నిద్ర : రోజులో కనీసం ఏడు నుంచి ఎమినిది గంటల పాటు మంచి ఆరోగ్యకరమైన నిద్రతో యౌవనంగా కనిపిస్తుంటారు. 

►సానుకూలమైన ఆలోచనలు (పాజిటివ్‌ థాట్స్‌) : ప్రతి విషయాన్నీ సానుకూలమైన దృక్పథంలో చూడటం అన్నది చాలా రకాల ఒత్తిళ్లను నివారిస్తుంది. ఆశాభావంతో ఉన్నప్పుడు చాలా పనులు కూడా సానుకూలంగానే జరుగుతాయి. దాంతో సంతోషం చేకూరి ఒత్తిడి తొలగుతుంది. సరిగ్గా ఈ అంశమే ఏజింగ్‌ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తుంది. 

►ప్రోబయాటిక్‌ ఫుడ్‌ : అన్ని రకాల ఆహారాలను మన శరీరానికి అందించి, ఆరోగ్యాన్ని కాపాడేది మన జీర్ణవ్యవస్థ. ఆ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుంటే దేహమంతా బాగున్నట్టే. దాని ఆరోగ్యంగా ఉంచే ఆహారమే ‘ప్రోబయాటిక్‌ ఫుడ్‌’. మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళం స్థలంలో మనకు మేలు చేసే కోటాను కోట్ల మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణప్రక్రియ నిర్వహణకు తోడ్పడతాయి. ఆ ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉండటానికి పెరుగు, మజ్జిగ, పులిసేందుకు అవకాశమున్న ఇడ్లీ, దోసె వంటివి ఉపయోగపడతాయి. 

► దానిమ్మ వంటి మంచి పండ్లు: పండ్లలో దానిమ్మను ‘సూపర్‌ఫుడ్‌’గా చెప్పవచ్చు. హానికరం కాని రీతిలో తగినంత పాళ్లలోనే చక్కెర, మంచి రుచి, ఇతరత్రా అన్ని రకాల ఖనిజలవణాలు వంటి వాటితో హైబీపీని నివారిస్తూ, గుండెను చాలాకాలం పాటు ఆరోగ్యకరమైన రీతిలో కాపాడుతుంది. చక్కెరపాళ్లు ఒకింత తక్కువగా ఉండే జామ, బొప్పాయి, నేరేడు వంటి పండ్లన్నీ మంచివే. వీటిని కాస్తంత ఎక్కువగా తీసుకుంటూ... వాటితోపాటు కేవలం అప్పుడప్పుడు మాత్రమే చక్కెరలు ఒకింత ఎక్కువగా ఉండే మామిడి, సపోటా వంటివి రుచికోసమే పరిమితంగా తీసుకుంటూ రుచుల సమతౌల్యం పాటిస్తే యౌవనం చాలాకాలం పాటు నిలకడగా ఉంటుంది. 

► విటమిన్‌ డి : దీన్ని కేవలం ఓ విటమిన్‌లా చూడటానికి వీల్లేదు. ఎముకల ఆరోగ్యం మొదలుకొని, వ్యాధి నిరోధక శక్తి వరకు ప్రతి అంశంలోనూ దీని ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. ఇది స్వాభావికంగా సూర్యరశ్మిలో దొరుకుతుందన్నది తెలిసిందే. అందుకే ఆరుబయట లేత ఎండలో ఉండటం వల్ల విటమిన్‌–డి దొరకడంతో పాటు ఆ వాతావరణంలో కాలుష్యం లేని వాయువులు పీల్చడం, ఆహ్లాదకరమైన రీతిలో ప్రకృతిని ఆస్వాదించడం.. ఇవన్నీ బహుముఖమైన ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా మనిషిని యౌవనంగా ఉంచుతాయి. 

► మంచి వ్యాయామం : మరీ అంతగా శారీరక శ్రమ పడకుండా ఉండేలా... అలాగే దేహం అలసిపోయేలా మంచి వ్యాయామాలు చేయడం వల్ల ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్‌ అందుతుంది. దాంతో కణాలన్నీ చాలాకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. అది జరగడం వల్ల మనిషి పూర్తిగా ఆరోగ్యంగా కనపడుతూ చాలాకాలం పాటు యౌవనంగా ఉండగలుగుతాడు. 

► మంచి స్నానం : మంచి వ్యాయామం తర్వాత అవసరమైనది మంచి స్నానం. అంటే ఆహ్లాదకరమైన రీతిలో ప్రతి అవయవం శుభ్రమయ్యేలాంటి స్నానం అన్నమాట. ఇలాంటి స్నాన ప్రక్రియలో మన చర్మంపైన, దేహంపైన ఉన్న మృతకణాలన్నీ తొలగిపోతాయి. దాంతో బయటకు కనిపించేవన్నీ ఆరోగ్యకరమైన తాజా కణాలు మాత్రమే. అందుకే స్నానం తర్వాత వ్యక్తులు పరిశుభ్రంగా మాత్రమే కాదు... కొద్దిసేపు తేజోవంతంగా కూడా కనిపిస్తుంటారు. 

►ఒత్తిడిని నివారించడం: ఇటు దేహంలో, అటు మనసుపైనా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది శారీరకంగా ప్రభావం చూపెడుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఎలాంటి ఒత్తిడీ లేని కొందరిని పరిశీలించినప్పుడు ఇది చాలావరకు వాస్తవమన్నది మనలో చాలామందికి తెలిసిన విషయమే. అందుకే ఒత్తిడికి ఎంతగా నివారిస్తే దేహం కూడా అంతే యౌవనంతో ఉంటుంది.

► ధ్యానం (మెడిటేషన్‌) : ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం (మెడిటేషన్‌)  చేయడం వల్ల శరీరంలోని చాలా వ్యవస్థలు తేలిగ్గా మారతాయి. దాంతోపాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవక్రియల వేగం తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత, జీవక్రియల వేగం తగ్గడం... ఈ రెండు అంశాలు వయసుకు కళ్లెం వేయడానికి ఉపకరిస్తాయి. 

పరిహరించాల్సినవి : పైన పేర్కొన్నవన్నీ పాటించాల్సినవి. అయితే పరిహరించాల్సినవీ కొన్ని ఉన్నాయి.  అవే... చక్కెరలు, పొగతాగడం, ఆల్కహాల్‌... ఇతరత్రా వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవన్నీ చర్మాన్ని బిగుతుగా ఉంచే కణాలను వదులుగా అయ్యేలా చేసేవే. దాంతో వృద్ధాప్య చిహ్నాలైన ముడుతలు, రింకిల్స్‌ వంటివన్నీ వయసు కంటే చాలా ముందుగానే వచ్చేస్తాయి. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు