వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్‌

17 Jul, 2021 02:42 IST|Sakshi

ఒకరికి ‘సమస్య’ పరిచయం అయింది. ఒకరికి ‘ఉత్సాహం’ తోడైంది. ఒకరికి ‘ఓటమి’ ఎదురైంది. ఒకరికి తన అనుభవమే పాఠం అయింది. ‘సమస్య’ ‘ఉత్సాహం’ ‘ఓటమి’ ‘పాఠం’... ఈ నాలుగు పదాల ప్రయోగశాలలో పుట్టిందే ఆరా హెల్త్‌కేర్‌. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్యనందా ఈ స్టార్టప్‌ కంపెనీకి సూత్రధారులు. ‘ఆరా’ అనే ఉమెన్‌–సెంట్రిక్‌ హెల్త్‌టెక్‌ కంపెనీ ద్వారా నాణ్యమైన హెల్త్‌కేర్‌–ప్రొడక్ట్స్, సేవలను మహిళలకు చేరువ చేస్తున్నారు....

సమాచారం తక్కువైతే జరిగే నష్టం మాట ఎలా ఉన్నా, అతి అయితే మాత్రం గందరగోళం ఏర్పడుతుంది. ‘ఏది వాస్తవం?’ ‘ఏది అవాస్తవం?’ అని తేల్చుకోవడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈ సమస్యతో పాటు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్య సమస్యల గురించి గత సంవత్సరం లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలో చర్చించుకున్నారు అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్య నందా. వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్‌ కంపెనీ.

శాన్‌ఫ్రాన్సిస్కో(యూఎస్‌)లో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేసిన అహిల్య మెహతా స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆన్‌లైన్‌ పర్సనల్‌ స్టైలింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘స్టైల్‌క్రాకర్‌’లో అసోసియేట్‌ ప్రొడక్ట్స్‌ మేనేజర్‌గా పనిచేసింది. ఒక స్వచ్ఛందసేవా సంస్థతో కలిసి రాజస్థాన్‌లోని ట్రైబల్‌ విలేజ్‌ కొట్రాలో పని చేస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్యసమస్యలను దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం వచ్చింది.

యూఎస్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన మల్లిక సాహ్నికి ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ అంటే అనురక్తి. ఎంటర్‌ ప్రెన్యూర్‌గా విజయబావుటా ఎగరేయాలనే ఆమె కలకు ‘ఆరా’తో అంకురార్పణ జరిగింది. ‘తరగతి గదిలో బిజినెస్‌ పాఠాలు వినడం వేరు, ఆచరణ వేరు’ అంటున్న మల్లిక ‘ఆరా’ స్టార్టప్‌ ద్వారా కొత్త విషయాలెన్నో నేర్చుకుంది.

ఇంజనీరింగ్‌ చేసిన ప్రగ్యా సాబు హెల్త్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ ‘ఆస్కార్‌ హెల్త్‌’లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసింది. ఆ తరువాత కొన్ని స్టార్టప్‌ కంపెనీలు మొదలుపెట్టింది కాని అవేమీ సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే ‘మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే పట్టుదల తప్ప నిరాశను ఎక్కడా దరి చేరనివ్వలేదు.

‘మన హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి ఒకప్పటి నా ఉద్యోగం ఉపకరించింది’ అంటుంది ప్రగ్యా.

ఈ బృందంలో అందరికంటే చిన్నవయసు ఉన్న అమ్మాయి నవ్య నందా. నటదిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు ఈ నవ్య. డిజిటల్‌ టెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది.


‘ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ గర్భనిరోధకం, లైంగిక ఆరోగ్యం... మొదలైన విషయాలు మాట్లాడుకోవడానికి, సమస్య గురించి చర్చించడానికి సంకోచించే వారు, ఇబ్బందికి గురయ్యేవారు  మన సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు తమ సమస్యను చెప్పుకోవడానికి, పరిష్కారానికి ఆరా ఒక ఆత్మీయనేస్తంలా ఉండాలనుకున్నాం’ అంటుంది నందా.

ఒకప్పుడు నందా కొన్ని మానసిక సమస్యలకు గురైంది. వాటి నుంచి త్వరగానే బయటపడింది. తన అనుభవాలనే పాఠాలుగా ఉపయోగించుకుంది.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఆరా’లో వైద్యనిపుణులు ధృవీకరించిన సమాచారం ఉంటుంది. మహిళలు తమకు సంబంధించిన ఆరోగ్యసమస్యల గురించి స్వేచ్ఛాయుతంగా చర్చించుకోవడానికి, వైద్యసలహాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, జూమ్‌...వేదికల ద్వారా కమ్యూనిటీ మీటప్స్‌ నిర్వహిస్తున్న ఆరా ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌’ అనే అరోగ్యసూత్రాన్ని ఆచరణ లో చూపడానికి ప్రయత్నిస్తుంది. ప్రతివారం సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తుంటారు. ‘షాప్‌’ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 140మంది నిపుణులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఈ స్టార్టప్‌.

కాస్త సరదాగా
‘కరోనా మాకు మేలే చేసింది’ అంటున్నారు నలుగురు మిత్రులు.
‘అదెలా?’ అంటే –
‘కరోనా వల్లే లాక్‌డౌన్‌ వచ్చింది. లాక్‌డౌన్‌ వల్లే మేము సమావేశం అయ్యాం. దీనివల్లే  ‘ఆరా’కు అంకురార్పణ జరిగింది’ అంటున్నారు!

మరిన్ని వార్తలు