చీర కట్టును ప్రపంచానికి చుట్టింది

8 Nov, 2020 05:12 IST|Sakshi

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ హాండిల్‌ పేరు ‘ది ట్రావెలింగ్‌ శారీ’. ఆమె ప్రపంచాన్ని తాను మాత్రమే చుట్టేయాలనుకోలేదు.భారతీయతను కూడా కట్టు, బొట్టుతో చూపెట్టాలనుకుంది. చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు తిరిగే హాబీ ఉన్న అజంతా మహాపాత్ర చీరకట్టుతో తిరిగే సోలో ట్రావెలర్‌గా ఎన్నో అవరోధాలు అధిగమించింది.ఎన్నో అనుభవాలుమూటగట్టుకుంది. ఆమె పరిచయం.

చీర కట్టుకొని ఆమె ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ముక్కూ ముహం ఎరగని వారి నుంచి వచ్చే పలకరింపు ‘నమస్తే’, ‘హలో ఇండియా’. భారతీయ స్త్రీలు ఒంటరిగా అలా కొత్త దేశాల్లో ప్రయాణించడం తక్కువ. అందునా చీర కట్టుతో కనిపించడం తక్కువ. మన దేశంలో పక్కూరికి రైలు ప్రయాణం అంటే పంజాబీ డ్రస్సును సౌకర్యంగా భావిస్తారు చాలా మంది స్త్రీలు. ఇక దేశాలు, కొత్త పర్యాటక ప్రాంతాలు అన్నప్పుడు ప్యాంట్స్‌తో సమానమైన దుస్తులే సౌకర్యం. కాని అజంతా మహాపాత్ర పెట్టుకున్న నియమం వేరు. ‘నేను ఎక్కడికి వెళ్లినా చీర కట్టులోనే వెళ్లాలి’ అని అనుకుందామె. తద్వారా భారతదేశానికి అనధికార పర్యాటక రాయబారిగా మారింది.

ఒరిస్సా అమ్మాయి
అజంతా మహాపాత్ర సొంత ప్రాంతం ఒరిస్సా. తండ్రి ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో చిన్న ఉద్యోగిగా అస్సాంలో పని చేసేవాడు. అలా దేశ దేశాల సాంస్కృతిక ఔన్నత్యం అతని ద్వారా కొద్దో గొప్పో తెలిసి అజంతాలో కొత్త ప్రాంతాల పట్ల కుతూహలం రేగేది. ‘వరల్డ్‌ మేప్‌ చిన్నప్పుడు నాకు ఎక్కువగా నచ్చిన ఆట వస్తువు’ అనే అజంతా టీనేజ్‌లో ఉండగా చిరపుంజి, షిల్లాంగ్‌లకు కుటుంబంతో విహారానికి వెళ్లింది. ఇల్లు, స్కూలు మాత్రమే కాకుండా బయట ఒక పెద్ద ప్రపంచం, అందమైన ప్రపంచం ఉంటుందనిపించింది. కాని ప్రపంచం చూడటం అందరి వల్లా కాదు. స్త్రీల వల్ల కానే కాదు. అందునా భారతీయ స్త్రీలకు అసాధ్యం... ఆ రోజుల్లో ఆమెకు వినిపించిన మాటలు అవి.

అంత సులువు కాదు
అస్సాంలో చదువు పూర్తయ్యాక ఒరిస్సా తిరిగి వచ్చేశాక ఉద్యోగమా, తిరగడమా అనే మీమాంస వచ్చింది అజంతాకి. ఒక మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి తగిన ఆర్థిక స్తోమత లేకపోతే దేశం కాదు కదా పక్కూరికీ వెళ్లలేదు అని తెలుసుకుంది. అందుకని మొదట కెరీర్‌లో పైకి రావాలనుకుంది. లండన్‌ వెళ్లి చదువుకోవడానికి కావాల్సిన డబ్బు కోసం నోయిడాలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత లండన్‌ వెళ్లి చదువుకుంది. అక్కడి నుంచి న్యూజెర్సీలో ఒక కార్పొరెట్‌ సంస్థలో పెద్ద ఉద్యోగిని అయ్యింది. ఆరు నెలలు పని చేశాక తన అకౌంట్‌లో తగినంత డబ్బు ఉందనగానే ఆమె చేసిన మొదటి పని బ్యాగ్‌లో నాలుగు చీరలు సర్దుకొని ప్రయాణానికి తయారు కావడమే.

ఒంటరి ప్రయాణికురాలు
‘గుంపుగా ప్రయాణిస్తే వినోదం ఉంటుంది. ఒంటరిగా ప్రయాణిస్తే మన గురించి మనకు తెలుస్తుంది’ అంటుంది అజంతా మహాపాత్ర. ఆమె అత్యంత సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లింది. అత్యంత ప్రమాదకరమైన తావుల్లోనూ తిరుగాడింది. ఎక్కడకు వెళ్లినా చీరలోనే ఒక భారతీయ వనిత అనే గుర్తింపుతోనే తిరిగింది. అన్ని చోట్లా ఆమెకు సాదర ఆహ్వానం అందింది. ‘అలస్కాలో టెంపరేచర్‌ మైనస్‌లలో ఉంటుంది. తప్పని సరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. కాని ఆ మంచు దిబ్బల మీద చీరలో ఫొటో దిగాలని నేను ప్రయత్నిస్తుంటే సరిగ్గా రావడం లేదు. ఇంతలో ఆ దారిన వెళుతున్న వ్యక్తి ఆగి ‘ఆర్‌ యూ యాన్‌ ఇండియన్‌’ అని అడిగి ఆగి నాకు ఫోటోలు తీసి పెట్టాడు. అతడు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌ అని తర్వాత తెలిసింది’ అని తన అనుభవం చెప్పింది అజంతా. ఆమె పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌కు కూడా వెళ్లింది. ‘అత్యంత సెక్యూరిటీ ఉన్న ఆ ప్రాంతంలో భారతీయ స్త్రీలు అతి తక్కువగా వెళ్లే ఆ ప్రాంతంలో చీరతోనే నేను తిరిగాను. నన్ను వారంతా తమ మనిషిగానే ఆదరించారు’ అంటుంది అజంతా. ‘చిన్నప్పుడు నేను అబ్బాయిలాంటి బట్టల్లో తిరగడానికి ఇష్టపడే దాన్ని. మా అమ్మ ఏమో ఒకనాడు నువ్వు తప్పక చీరను ఇష్టపడతావు చూడు అనేది. ఆమె మాటలు నిజమయ్యాయి. కాని ఇదంతా చూడటానికి ఆమె లేదు’ అని మరణించిన తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది అజంతా. బెత్లెహామ్‌లో గులాబీరంగు చీరలో తాను దిగిన ఫొటోలను మురిపెంగా చూసుకుంటుంది. 

68 దేశాలు చుట్టేసింది
అజంతా మహాపాత్ర ఇప్పటి వరకు 68 దేశాలు తిరిగింది. సౌత్‌ కొరియా, ఈజిప్ట్, అరబ్‌ దేశాలు, చైనా, వియత్నాం, యూరోపియన్‌ దేశాలు ఎన్నో ఉన్నాయి. ‘అన్ని దేశాల్లోనూ మనకు భాష రానప్పుడు పనికొచ్చే భాష ఒకటి ఉంది. అదే సంజ్ఞాభాష. సైగలతో మనకు కావాల్సింది ఎదుటివాళ్లకు చెప్పగలం’ అంటుంది అజంతా. మరో విషయం ఏమిటంటే ఆమె శాకాహారి. ‘కొన్ని దేశాల్లో శాకాహారం అస్సలు దొరకదు. వియత్నాంలో బాగా ఇబ్బంది పడ్డాను. ఇక బసకు ఇబ్బంది ఉండదు. మన ఖర్చుకు సరిపడా పొదుపైన హోటల్స్‌ అన్ని చోట్లా ఉంటాయి’ అంటుంది అజంతా. అజంతా తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో రాస్తుంది. ఆమెకు ప్రత్యేకమైన ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఏదో ఒక కొత్త దేశంలో ఎత్తయిన పర్వత సానువుల మీద మూడురంగుల జండాను చేబూని ఒక భారతీయ వనిత నిలుచుని ఉండటం మనకు కూడా గర్వకారణమే కదూ.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు