పెళ్లిదండలు ఎప్పటికీ గుర్తుండేలా..రెజిన్‌ ఆర్ట్‌లో పదిలంగా దాచుకోవచ్చు..

29 Nov, 2023 10:32 IST|Sakshi

మనకు నచ్చిన రంగు రంగుల చాక్లెట్‌ రేపర్స్‌ నుంచి మనం ఇష్టపడే వారు ఇచ్చిన పువ్వులు, నెమలీకల వరకు ప్రతి చిన్న వస్తువును పుస్తకాల్లో అపురూపంగా దాచుకునేవాళ్లం. అప్పుడప్పుడు వాటిని చూసుకుని తెగ మురిసిపోయిన సందర్భాలు ఎన్నో. ఇవి కొన్నేళ్ల పాటు ఉన్నప్పటికీ తర్వాత ఆ పుస్తకాలను దాచుకునే ప్లేసు లేక వాటన్నింటిని కోల్పోయి బాధపడుతుంటాము. ‘‘ఇక ముందు మీరు దిగులు పడాల్సిన పనిలేదు. మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని రెజిన్‌ ఆర్ట్‌లో ఎప్పటికీ దాచుకోవచ్చు’’ అని చెబుతోంది 31 ఏళ్ల ఆకాంక్ష సెహగల్‌. గులాబీ రేకులను సైతం ఏళ్ల పాటు దాచుకునేలా అందమైన ఆకృతిలో రెజిన్‌ క్రాఫ్ట్స్‌ను రూపొందిస్తోంది. రెజిన్‌ ఆర్టిస్ట్‌ అయ్యేందుకు ఇండిగో ఉద్యోగాన్నే వదిలేసింది ఆకాంక్ష. 

నాగపూర్‌కు చెందిన ఆకాంక్ష సెహగల్‌ అనుకున్నది సాధించేవరకు కష్టపడుతుంది. ఆ మనస్తత్వమే ఆమెని రెజిన్‌ క్రాఫ్ట్స్‌ ఆర్టిస్ట్‌గా మార్చింది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తయ్యాక రేడియో మిర్చిలో సెలబ్రెటీ మేనేజర్‌గా చేరింది. ఎందుకో గానీ ఆ ఉద్యోగం ఆమెకు తృప్తినివ్వలేదు. దాంతో విమానంలో ఎగరాలని చిన్నప్పటినుంచి తాను కంటున్న కలలను నెరవేర్చుకునేందుకు విమానంలో ఉద్యోగం చేయాలనుకుంది. అందుకు తగ్గట్టుగా కష్టపడి ఇండిగోలో క్యాబిన్‌ క్రూ ఉద్యోగాన్ని సాధించింది.

కల నిజమైనప్పటికీ...
క్యాబిన్‌ క్రూగా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆకాంక్షకు క్రూగా కొంతకాలం మాత్రమే పనిచేస్తామని ఆ తరువాత పేపర్‌ వర్క్‌ పనిచేయాల్సి ఉంటుంది అని తెలిసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఆవిరైంది. కొంతకాలం పనిచేసిన తరువాత నేను క్రూ గా ఉండలేను. పేపర్‌ వర్క్‌ చేయడం ఇష్టం లేదు. దీంతో తనకు నచ్చిన, ఎప్పటికీ ఉండే వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుని మళ్లీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒకపక్క క్యాబిన్‌ క్రూగా బాధ్యతలు నిర్వహిస్తూనే తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.

యునిక్‌ రెజిన్‌ క్రియేషన్స్‌..
చిన్నప్పటి నుంచి ఆర్ట్స్‌పై మక్కువ ఉన్న ఆకాంక్ష.. తనకి కాబోయే భర్తకు రెజిన్‌ క్రాఫ్ట్‌ తయారు చేసి బహుమతిగా ఇచ్చింది. అది చూసిన ఆకాంక్ష కాబోయే భర్త చాలా బావుంది. రెజిన్‌ క్రాఫ్ట్స్‌ తయారీలో నీకు మంచి నైపుణ్యం ఉంది. క్రాఫ్ట్స్‌ కోర్సు చెయ్యి అని ప్రోత్సహించాడు. దీంతో ఇండిగోలో ఉద్యోగం చేస్తూనే చిన్నచిన్న రెజిన్‌ క్రాఫ్ట్స్‌ తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా తయారు చేసేందుకు ఇండిగో ఉద్యోగాన్ని వదిలేసి యూనిక్‌ రెజిన్‌ క్రియేషన్స్‌ పేరిట బ్రాండ్‌ను ప్రారంభించింది. తడిసినా పాడవకుండా ఉండే రెజిన్‌ పదార్థానికి రంగులు జోడించి అందమైన ఆకృతుల్లో ప్రత్యేకంగా ఉండే గిఫ్ట్స్‌ తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ కుటుంబం సహాయంతో తన బ్రాండ్‌ను చక్కగా నిర్వహిస్తోంది ఆకాంక్ష. 

మరింత ప్రత్యేకంగా...
మిగతా బహుమతులకంటే రెజిన్‌క్రాఫ్ట్స్‌ ద్వారా అపురూప జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. పెళ్లిదండలు, ఇష్టమైన వారు ఇచ్చిన పూలు, వాటి తాలుకా రేకులు, పుష్పగుచ్ఛాలు, శిశువు బొడ్డు తాడు వంటి వాటిని మరింత ప్రత్యేకంగా దాచుకునేలా రూపొందిస్తోంది. ఈ క్రాఫ్ట్స్‌ ఆకర్షణీయంగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి మరీ ఆర్డర్లు ఇస్తున్నారు ఆకాంక్షకు ఇంత చిన్నవయసులో రెండు ఉద్యోగాలను అవలీలగా సాధించి, తనని తాను నిరూపించుకుంది. చివరికి తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తూ రెజిన్‌ క్రాఫ్ట్‌ ఆర్టిస్ట్‌గా మారి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు