Akshali Shah: విజయంలో సగపాలు

1 Jun, 2023 00:29 IST|Sakshi

‘పాడి రంగంలో మన దేశంలో మూడొంతుల మంది స్త్రీలే పని చేసి విజయం సాధిస్తున్నారు’ అని గత సంవత్సరం ‘వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌’లో ప్రధాని నరేంద్రమోడి అన్నారు. పశు పోషణ చేసి, పాలు పితికి, ఆదాయ మార్గాలు వెతికి విజయం సాధిస్తున్న మహిళలు ఎందరో నేడు ఆ మాటను నిజం చేస్తున్నారు. నేడు ‘వరల్డ్‌ మిల్క్‌ డే’ ‘ఎంజాయ్‌ డెయిరీ ప్రాడక్ట్‌’ అనేది థీమ్‌. ‘పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌’ పేరుతో డెయిరీ ప్రాడక్ట్స్‌ దేశంలోనే అగ్రశ్రేణిగా నిలిచింది అక్షాలి షా.

32 ఏళ్ల అక్షాలి షా నేడొక దేశంలో ఉంటే రేపు మరో దేశంలో ఉంటుంది. ఏ దేశంలో పాడి రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో, పాడి ఉత్పత్తులలో ఎలాంటి సాంకేతికత చోటు చేసుకుంటున్నదో  నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆ మార్పులను తాను అధినాయకత్వం వహిస్తున్న ‘పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌’ సంస్థలో ప్రవేశపెడుతూ ఉంటుంది. అందుకే ఇవాళ ప్యాకేజ్డ్‌ పాల రంగంలో, డెయిరీ ఉత్పత్తుల రంగంలో పరాగ్‌ సంస్థ అగ్రగామిగా ఉంది. అందుకు పూర్తి క్రెడిట్‌ అక్షాలి షాకు దక్కుతుంది.

2010లో పగ్గాలు చేపట్టి
ఎం.బి.ఏ.లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివిన అక్షాలి షా తన తండ్రి దేవేంద్ర షా స్థాపించి నిర్వహిస్తున్న పాడి పరిశ్రమ రంగంలో 2010లో అడుగుపెట్టింది. అయితే తండ్రి ఆమెకు వెంటనే సంస్థ పగ్గాలు అప్పగించకుండా పెరుగు తయారు చేసే ఒక చిన్న ప్లాంట్‌ను ఇచ్చి దానిని డెవలప్‌ చేయమన్నాడు. అక్షాలి విజయం సాధించేసరికి మెల్ల మెల్లగా సంస్థలో ఆమె స్థానం, స్థాయి పెరుగుతూ పోయాయి. ‘భారతీయుల సంస్కృతిలో పాలు, గోవు చాలా విశిష్టమైన స్థానంలో ఉంటాయి. మన పురాణాల్లో క్షీరం ప్రస్తావన ప్రముఖంగా ఉంటుంది. అందుకే నేను ఈ రంగాన్ని ఆషామాషీగా నిర్వహించదలుచుకోలేదు. నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగలిగితే కనుక సెంటిమెంట్‌ కనెక్ట్‌ అవుతుందనుకున్నాను’ అంటుంది అక్షాలి.

ప్రొటీన్‌ ఉత్పత్తులు
శాకాహారంలో 84 శాతం, మాంసాహారంలో 65 శాతం ప్రొటీన్‌ లోపం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ‘ఆరోగ్య, క్రీడా రంగంలో ప్రొటీన్‌ ప్రాడక్ట్స్‌కు నేడు దేశంలో ఏటా 2000 కోట్ల మార్కెట్‌ ఉంది. ప్రొటీన్‌ పౌడర్లు తీసుకునే ఫిట్‌నెస్‌ ప్రియులు చాలామంది ఉంటారు. అందుకే పాల నుంచి సేకరించిన ప్రొటీన్‌ ప్రాడక్ట్‌లను తయారు చేసి విక్రయిస్తున్నాం. అవతార్, గో ప్రొటీన్‌ పేరుతో మా ప్రాడక్ట్‌లు ఉన్నాయి’ అంటుంది అక్షాలి. పరాగ్‌ సంస్థ నుంచి ‘గోవర్థన్‌’ పేరుతో నెయ్యి దొరుకుతోంది. ఇక చీజ్‌ అమ్మకాల్లో అక్షాలి సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఫ్లేవర్డ్‌ మిల్క్, పెరుగు... ఈ అన్ని ఉత్పత్తుల్లో సంస్థ మంచి అమ్మకాలు సాధిస్తోంది. పూర్వం పాలు, పెరుగు స్త్రీలే అమ్మేవారు. వారికి పాలను ఎలా ఆదాయవనరుగా చేసుకోవాలో తెలుసు. అక్షాలి లాంటి నవతరం డెయిరీ లీడర్లు అదే నిరూపిస్తున్నారు.
 

గడప చెంతకు ఆవుపాలు
అక్షాలికి పూణెలో గోక్షేత్రం ఉంది. 2011 నాటికి అక్కడి ఆవుల నుంచి పాలు పితికి, కేవలం ఆవుపాలు కోరే 172 మంది ఖాతాదారులకు అందించేవారు. అక్షాలి రంగంలోకి దిగాక శ్రేష్టమైన ఆవు పాల కోసం దేశంలో కోట్ల మంది ఖాతాదారులు ప్రయత్నిస్తుంటారని అర్థం చేసుకుంది. ‘ప్రైడ్‌ ఆఫ్‌ కౌస్‌’ పేరుతో ప్రీమియమ్‌ ఆవుపాలను అందించడానికి ముందుకు వచ్చింది. మానవ రహితంగా ఆవుల నుంచి పాలను పితికి, ప్యాక్‌ చేసి, విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చి తాజాగా ఖాతాదారుల గడప దగ్గరకు ప్యాకెట్టు పడేలా నెట్‌వర్క్‌ సిద్దం చేసింది. ఇంత శ్రేష్టత పాటించడం వల్ల మార్కెట్‌లో ఆవు పాల కంటే ఈ పాలు రెట్టింపు ధర ఉంటాయి. అయినా సరే కస్టమర్లు తండోప తండాలుగా ఈ పాలను కోరుకున్నారు. ఇవాళ అక్షాలి సరఫరా చేస్తున్న ఆవుపాలు ఢిల్లీ, ముంబై, పూణె, సూరత్‌లలో విశేషంగా అమ్ముడు పోతున్నాయి. 2027 నాటికి కేవలం ఈ ఆవుపాల టర్నోవర్‌ 400 కోట్లకు చేరుకుంటుందని అక్షాలి అంచనా.

మరిన్ని వార్తలు