మందుబాబులు జర భద్రం.. గతేడాది 7.4 లక్షల మందికి క్యాన్సర్‌

14 Jul, 2021 20:09 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: ఆల్క‌హాల్ వినియోగానానికి, ప్రాణాంత‌క క్యాన్స‌ర్ వ్యాధికి చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉందన్న విషయం తాజాగా ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2020వ సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా న‌మోదైన క్యాన్స‌ర్‌ కేసుల‌లో 7.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులకు మద్యం వినియోగంతో సంబంధం ఉందని ఈ అధ్య‌య‌నంలో స్ప‌ష్టమైంది. ఈ అధ్య‌య‌న ఫ‌లితాలు తాజాగా 'ద లాన్సెట్ ఆంకాల‌జీ' అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. గతేడాది  కొత్త‌గా బ‌య‌ట‌ప‌డ్డ క్యాన్సర్‌ కేసులలో 4 శాతం కేసులు ఆల్క‌హాల్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధం ఉందని తేలింది.

దీంతో క్యాన్స‌ర్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్న దేశాల్లో ప్రాణాంతక వ్యాధికి, అల్క‌హాల్‌కు ఉన్న సంబంధం గురించి ప్ర‌జ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఇందుకు ప్ర‌భుత్వాల జోక్యాలు పెరగాల‌ని వారు సూచించారు. ఇక గతేడాది న‌మోదైన ఆల్క‌హాల్ అసోషియేటెట్ క్యాన్స‌ర్ కేసుల‌లో మ‌హిళ‌లతో(23 శాతం) పోల్చుకుంటే పురుషులు(77 శాతం) చాలా ఎక్కువ శాతంలో ఉన్నార‌ని అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఇక క్యాన్స‌ర్ ర‌కాల విష‌యానికి వ‌స్తే ఆల్క‌హాల్ అసోషియేటెడ్ క్యాన్స‌ర్ కేసుల‌లో అన్నవాహిక, లివ‌ర్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తేలింది. 

మరిన్ని వార్తలు