Alia Farooq: ఆలియా జిమ్‌.. అమ్మాయిలకు మాత్రమే.. ఎక్కడంటే! 

28 Sep, 2021 08:47 IST|Sakshi

అనేక రంగాల్లో మహిళలు రాణిస్తూ మగవారితో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కానీ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతాల్లోని మహిళలు అనేక కట్టుబాట్లు, నిబంధనల మధ్య నిర్భయంగా ఇంటి నుంచి బయటకు రావడమే కష్టం. అటువంటిది ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో ఎప్పుడూ ఉగ్రమూకల దాడులతో దద్దరిల్లుతూ అశాంతిగా ఉండేది. ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో.. అక్కడి పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే కశ్మీర్‌కు చెందిన ఆలియా ఫారుఖ్‌ ఎనిమిదేళ్ల కిందటే మూసపద్ధతులకు విభిన్నంగా ఆలోచించి, ఫిట్‌నెస్‌ను సరికొత్త కెరియర్‌గా మార్చుకుని మహిళా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా రాణిస్తోంది. 

శ్రీనగర్‌లోని ఖన్యార్‌కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లలకు తల్లి. పిల్లలు పుట్టిన తరువాత హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడంతో ఒక్కసారిగా అధికంగా బరువు పెరిగి, తన పనులు తానే సరిగా చేసుకోలేక నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. సరిగ్గా అప్పుడే వెకేషన్‌లో భాగంగా ఆలియా కుటుంబం ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆలియా తల్లి ఆమెను డాక్టర్‌కు చూపించి ఆమె బరువు పెరగడం, నిరాశకు లోనవడం వంటి సమస్యల గురించి డాక్టర్‌కు చెప్పింది.


Photo: Facebook

డాక్టర్‌ జిమ్‌లో చేరి బరువు తగ్గమని సూచించడంతోపాటు ఢిల్లీలో.. పెళ్లి అయ్యి, పిల్లలున్న మహిళలు తమ శరీరాన్ని ఎంత ఫిట్‌గా ఉంచుకుంటున్నారో చూపిస్తూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాంతో ఆలియా ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఈ క్రమంలోనే భర్త ప్రోత్సాహంతో జిమ్‌లో చేరింది. కానీ మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వారి శారీరక తత్వం గురించి పురుష ట్రైనర్‌లకు పెద్దగా అర్థం కాదు అనుకునేది. అలా అనుమానం ఉన్నప్పటికీ, ఎలాగైనా బరువు తగ్గాలన్న దృఢనిశ్చయంతో.. జిమ్‌లో చేరిన కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 28 కేజీల బరువు తగ్గింది.  

ఫిట్‌నెస్‌ సొల్యూషన్‌ 
ఆలియా భర్త 2010లో ఖన్యార్‌లో ‘ఫిట్‌నెస్‌ సొల్యూషన్‌ జిమ్‌’ పేరిట జిమ్‌ను ప్రారంభించాడు. కానీ దానిని సరిగా నిర్వహించలేకపోవడం చూసిన ఆలియా అతని జిమ్‌ను తీసుకుని తనే ఒక ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా మారాలనుకుంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఉన్న బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌లో చేరి ఫిట్‌నెస్‌లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని 2012లో జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. శ్రీనగర్‌లో మహిళా ట్రైనర్‌ నిర్వహిస్తోన్న తొలి జిమ్‌ కావడంతో అమ్మాయిలంతా తన జిమ్‌లో చేరడానికి ఆసక్తి కనబరిచారు.


Photo: Facebook

దీంతో ఈ తొమ్మిదేళ్లలో ఆలియా కశ్మీర్‌ లోయలోని 20 వేల మందికిపైగా అమ్మాయిలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చింది. ప్రారంభంలో మహిళ జిమ్‌ నడపడం ఏమిటీ? అని అనేక విమర్శలు, ఈమె ఏమాత్రం నడుపుతుందో చూద్దాం వంటి సవాళ్లు అనేకం ఎదురయ్యాయి. వాటిని సీరియస్‌గా తీసుకోని ఆలియా తన భర్త, అత్తమామల ప్రోత్సాహంతో జిమ్‌ను ధైర్యంగా నిర్వహించేది. దీంతో కశ్మీర్‌లో తొలి మహిళా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఆలియాకు గుర్తింపు రావడమేగాక, అనేక అవార్డులు వరించాయి. అంతేగాక జాతీయ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. 

జిల్లాకో సెంటర్‌ 
‘మహిళలకు ఉమన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అవసరం చాలా ఉంది. అది నేను ప్రత్యక్షంగా ఫీల్‌ అయ్యాను. అందుకే స్త్రీలకోసం ప్రత్యేకంగా జిమ్‌ను నిర్వహిస్తున్నాను. హైబీపీ, కొలె్రస్టాల్‌ స్థాయులు, సంతానలేమితో బాధపడుతోన్న మహిళలకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ సమస్యలున్న మహిళలంతా జిమ్‌లో చేరి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా జిమ్‌కు స్పందన బావుండడంతో ప్రభుత్వాన్ని సంప్రదించి జిల్లాకో ‘మహిళా ఫిట్‌నెస్‌ సెంటర్‌’ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ఆలియా చెప్పింది.  

చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?

మరిన్ని వార్తలు