Alka Mittal: డాక్టర్‌ అల్కా మిట్టల్‌... ఈ పేరే ఓ రికార్డు... తొలి మహిళగా

5 Jan, 2022 11:51 IST|Sakshi

అలవోకగా సాధించింది

Alka Mittal Successful Journey: అది 1956. భారత ప్రభుత్వం ఓఎన్‌జీసీకి రూపకల్పన చేసింది. ఆ సంస్థ 65 ఏళ్ల మహోన్నత చరిత్రను రాసుకుంది. ఇప్పుడు... ఆ చరిత్రను ఓ మహిళ తిరగరాసింది. ఇప్పుడు దేశమంతా ఆమెనే చూస్తోంది. ఆమె ఓఎన్‌జీసీ సీఎండీ డాక్టర్‌ అల్కా మిట్టల్‌

డాక్టర్‌ అల్కా మిట్టల్‌... ఈ పేరే ఓ రికార్డు. ప్రసిద్ధ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)కు సీఎండీగా నియమితులయ్యారామె. ఓఎన్‌జీసీ చరిత్రలో ఒక మహిళ సీఎండీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా వార్తల్లో ప్రధానవ్యక్తిగా నిలిచారామె. ఎవరీ అల్కా మిట్టల్‌ అని, ఆమె వయసెంత అని, ఇంత పెద్ద బాధ్యతలు చేపట్టగలగడానికి ఆమె ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు  గూగుల్‌ని శోధిస్తున్నాయి.

ఆమె ఈ నెల ఒకటవ తేదీన అల్కా మిట్టల్‌ను సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించినట్లు సోమవారం ఆ సంస్థ ట్విటర్‌లో ప్రకటించింది. అదేరోజు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆ బాధ్యతల్లో ఆరునెలల పాటు ఉంటారు. ఒకవేళ ఈలోపు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరిగినట్లయితే అప్పటి వరకు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. 

చదవడం హాబీ
డాక్టర్‌ అల్కా మిట్టల్‌ వయసు 56. పర్యటనలు, పుస్తక పఠనం, రాయడం అల్కామిట్టల్‌ హాబీలు. అలా హాబీగా చాలా చదివేశారామె. డెహ్రాడూన్‌లోని ఎంకేపీ పీజీ కాలేజ్‌ నుంచి 1983లో ఎకనమిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. రాజ్‌గురు మహావిద్యాలయ నుంచి ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుంచి బిజినెస్, కామర్స్, కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో 2001లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

అదీ రికార్డే
ప్రస్తుతం ఓఎన్‌జీసీ సంస్థ చైర్‌పర్సన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా కొత్త బాధ్యతలు చేపట్టడానికి మునుపు 2018 నుంచి ఆమె ఆ సంస్థలో హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ రంగంలో ప్రసిద్ధ సంస్థ ఓఎన్‌జీసీకి సీఎండీగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ స్థాయి ఆమెకు ఏ ఒక్కరోజులోనో వచ్చి వాలిన హోదా కాదు. గ్రాడ్యుయేట్‌ ట్రైనీగా 1985లో ఓఎన్‌జీసీలో చేరిన అల్కామిట్టల్‌ మూడున్నర దశాబ్దాలుగా రకరకాల విధులు నిర్వర్తించారు. ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్‌జీసీ మంగుళూరు పెట్రో కెమికల్స్‌లో బోర్డు మెంబర్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారు.

అల్కా మిట్టల్‌ ఉత్తరాది రీజియన్‌కు చెందిన ‘ఫోరమ్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ద పబ్లిక్‌ సెక్టార్‌’ ప్రెసిడెంట్‌గా మహిళలకు క్షేమకరమైన పని వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలు చేశారు. వడోదర, ముంబయి, ఢిల్లీ, జోర్హాత్‌లలో హెచ్‌ఆర్‌ విధులు నిర్వర్తించి ఉన్నారు. ఓఎన్‌జీసీలో ఆమె చీఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (సీఎస్‌డీ)గా అత్యంత క్రియాశీలకంగా పని చేశారు.

దేశవ్యాప్తంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ‘నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌’ ద్వారా స్కిల్‌ ట్రైనింగ్‌ ఇప్పించారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్‌జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేశారు. ఆఫ్‌షోర్‌ (చమురు నిక్షేపాలను తవ్వి వెలికి తీయడానికి సముద్ర గర్భంలోకి వెళ్లడం) బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారామె.

తొలి తరం మహిళ
అల్కా మిట్టల్‌ను సీఎండీగా నియమించడానికి ముందు ఆ సంస్థ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇద్దరు విధుల్లో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉండడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో విశేషమైన సేవలందిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. కానీ కంపెనీ హెడ్‌ హోదాలో మాత్రం నూటికి తొంబై కంపెనీల్లో మగవాళ్లే ఉంటున్నారనేది కాదనలేని సత్యం. మహిళలు ఉద్యోగులుగా సేవలందించడానికే పరిమితమవుతున్నారనే నివేదికలను కాదనలేం.

అయితే గ్లాస్‌ సీలింగ్‌ను బ్రేక్‌ చేసిన అతికొద్ది మంది మహిళల జాబితాలో చేరారు అల్కామిట్టల్‌. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో అడుగుపెట్టిన తొలితరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అలాగే  సీఎండీగా అల్కా మిట్టల్‌ నియామకం ద్వారా ఆ కంపెనీ మహిళలు, మగవాళ్లకు సమాన అవకాశాలు కల్పించే ‘ఈక్వల్‌ ఆపర్చునిటీ ఎంప్లాయర్‌’ అనే గౌరవాన్ని దక్కించుకుంది.  
 
ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో...తొలి మహిళలు
విక్కీ హోలబ్, సీఈవో, యూఎస్‌లోని ఆక్సిడెంటల్‌ పెట్రోలియమ్‌ ఆయిల్‌ కంపెనీ
లిండా కుక్, సీఈవో, నార్త్‌ సీ ఆయిల్‌.. ప్రొడ్యూసర్‌ ప్రీమియర్‌ ఆయిల్‌ క్రెసోర్‌ హోల్డింగ్‌
కేథరీన్‌ రో, సీఈవో, వెంట్‌వర్త్‌ రీసోర్సెస్, టాంజానియా
మారియానా జార్జ్, సీఈవో, దక్షిణ, తూర్పు యూరప్‌లో అతి పెద్ద ఎనర్జీ కంపెనీ ఓఎమ్‌వీ పెట్రోమ్‌ ఆఫ్‌ ఆస్ట్రియా
మనదేశంలో అల్కామిట్టల్‌కంటే ముందు ఈ రంగంలో నిషి వాసుదేవ రికార్డు సృష్టించారు. ఆమె 2014 మార్చిలో హిందూస్థాన్‌ పెట్రోలియమ్‌ కంపెనీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. 

చదవండి: మంచు ఖండంలో మెరిసిన వజ్రం

మరిన్ని వార్తలు