షీ ఈజ్‌ అన్‌స్టాపబుల్‌

25 Feb, 2023 01:59 IST|Sakshi

నేవీ వెల్‌నెస్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని, నౌకాదళానికి చెందిన వివిధ విభాగాల మహిళలు ‘షీ ఈజ్‌ అన్‌స్టాపబుల్‌’ నినాదంతో ఈ నెల 14న దిల్లీలోని వార్‌ మెమోరియల్‌ నుంచి కారు యాత్ర చేపట్టారు. వివిధ నగరాల గుండా సాగిన ఈ  కారు యాత్ర మహిళా యోధుల విజయాలను ప్రచారం చేస్తోంది.

జైపూర్‌లోని ఒక కళాశాలలో...
నావికా దళానికి చెందిన పాయల్‌ గుప్తా  వికాస్‌ శ్రేయాన్, కుషాల్‌ పండేకర్‌లు గోవా నుంచి పోర్ట్‌ లూయిస్‌ (ఈస్ట్‌ ఆఫ్రికా) వరకు చేసిన సంచలన సముద్ర యాత్ర గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొని 21 రోజుల పాటు 4.500 కి.మీ నాస్‌స్టాప్‌గా సాగిన ఈ సాహస సముద్రయాత్ర గురించి విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు నేవీలో చేరడానికి అవసరమైన విద్యార్హతల గురించి ఆసక్తిగా అడిగారు.

బికనేర్‌లోని ఒక స్కూల్‌లో...
లెఫ్టినెంట్‌ కమాండర్‌ వర్తికా జోషి నేతృత్వంలో లెఫ్టినెంట్‌ కమాండర్‌లు ప్రతిభ జమ్వాల్, స్వాతి, విజయాదేవి, ఐశ్వర్య, పాయల్‌గుప్తాలు దేశీయంగా తయారుచేసిన ఐఎన్‌ఎస్‌వీ తరిణి నౌక ద్వారా వివిధ దేశాలు చుట్టి వచ్చిన ‘నావికా సాగర్‌ పరిక్రమ’ గురించి ‘షీ ఈజ్‌ అన్‌స్టాపబుల్‌’ బృందం చెప్పింది విన్న తరువాత విద్యార్థులు చప్పట్లు కొట్టారు. తమకు కూడా అలాంటి సాహసాలు చేయాలని ఉందని మనసులో మాట చె΄్పారు.

నావికాదళానికి సంబంధించి మహిళల సాహసగాథలు మాత్రమే కాకుండా అలనాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను చెప్పి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గుర్తు తెచ్చుకుంది ఈ బృందం. ఇలా ఎన్నో పట్టణాలలో స్కూల్, కాలేజీ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి నావికాదళ ప్రాముఖ్యత, నావికాదళంలో ఉద్యోగావకాశాల గురించి తెలియజేయడం మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస కోణంలో ఈ బృందం సభ్యులు స్ఫూర్తిదాయకమై ఉపన్యాసాలు ఇచ్చారు. లైఫ్‌స్కిల్స్‌ గురించి వారికి అర్థమయ్యే భాషలో వివరించారు.

వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలను సందర్శించి అక్కడ ఉంటున్న వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళల సముద్ర సాహసయాత్రలు ఆయా కాలాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ఆ యాత్రలలో ఎన్నో కథలు దాగున్నాయి. శక్తిమంతమైన స్ఫూర్తి ఉంది. వీటిని ప్రజలకు చేరువ చేయడం ‘షీ ఈజ్‌ అస్‌స్టాపబుల్‌’ యాత్ర ముఖ్య ఉద్దేశం. వచ్చిన స్పందన చూస్తే యాత్ర ఉద్దేశం నెరవేరిందని చెప్పవచ్చు.

‘నారీశక్తి స్ఫూర్తిని ప్రజల చెంతకు తీసుకువెళ్లడానికి, నావికాదళంలో చేరాలనే ఉత్సాహాన్ని యువతలో కలిగించడానికి ఈ యాత్ర ఉపయోగపడింది’ అంటున్నారు వైస్‌ అడ్మిరల్‌ దినేష్‌ త్రిపాఠి. 2,300 కి.మీల ఈ ఆల్‌–ఉమెన్‌ కారు యాత్ర ఈరోజు దిల్లీలో ముగుస్తుంది.

మరిన్ని వార్తలు