దివ్యస్థలి ఆళ్వారు తిరునగరి

4 Jan, 2021 06:47 IST|Sakshi

నమ్మాళ్వారులు జన్మించిన పరమ పుణ్య క్షేత్రం గా వైష్ణవ తత్వానికి మూలాధార నాడిగా ఖ్యాతిగాంచిన క్షేత్రం ఆళ్వారు తిరునగరిగా వాసికెక్కిన తిరుగురుక్కుర్‌. తమిళనాడులో ఉన్న నవ తిరుపతులలో అత్యంత విశిష్టమైన ధామంగా పేర్గాంచింది. శ్రీ ఆదినాథుడిగా పెరుమాళ్ళు పూజలందుకునే ఈ అతిపురాతన దివ్యాలయం తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి తిరుచందూరు మార్గంలో, శ్రీ వైకుంఠానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది. విశిష్టమైన వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన ఈ క్షేత్రం నమ్మాళ్వారు అవతరించిన స్థలంగా, మధురకవి ఆళ్వారు నడయాడిన పవిత్ర క్షేత్రంగా, రామానుజులు, మనవాళ్ళ మామూర్‌ అవతరించిన పుణ్యస్థలిగా ప్రసిద్ధి.  శ్రీ ఆదినాథ పెరుమాళ్ళ దేవాలయంతోపాటు నమ్మాళ్వారు సన్నిధినీ ఇక్కడ దర్శించుకోగలం. ఆలయానికి అర కిలోమీటరు దూరంలోనే తామ్రపర్ణీనది ప్రకృతి అందాలతో అలరారుతోంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తొలుత తామ్రపర్ణి నదిలో స్నానాలు చేస్తారు.      ఆదినాథ పెరుమాళ్ల ఆలయం విశాల ప్రాంగణంతో, రాతి ముఖ ద్వారంతో శిల్పసంపదతో అలరారుతూ ఉంటుంది. ఆలయ గోపురం ధవళ వర్ణ కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. శంఖ చక్రాలు, నడుమ తిరునామాలతో ప్రధానాలయ ద్వారంపై భాగం భాసిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో రాతి శిల్పాలుగా పాండవుల మూర్తులు హనుమంతుడు, విష్వక్సేనుడి ప్రత్యేక స్థావరాలు, నమ్మాళ్వారు ప్రత్యేక సన్నిధి తప్పక దర్శించదగిన స్థలాలు. 

ఆలయ మండపాలన్నీ శిల్పకళా శోభితమై అలరారుతూ ఉంటాయి. ఎటు చూసినా  కానవచ్చే ఈ అద్భుత శిల్ప సంపద పాండ్యరాజుల కాలం నాటిదని చెబుతారు. మూల విరాట్టు శ్రీ ఆదినాథ పెరుమాళ్ళు కాగా, ఉత్సవ మూర్తులలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఆదినాయకి, కురునరనాయకి తదితర ఐదుగురు నాయికలతో స్వామి ఉండడం ఇక్కడి విశిష్టత. ఆదినాథ పెరుమాళ్ళ మూర్తి స్వయం వ్యక్తం అంటారు. లక్ష్మీదేవి ఆదినాథ నాయికగా వశించి ఉంటుంది. ఇక్కడి చింతచెట్టు ఆదిశేషుని ప్రతిరూపుగా పూజలందుకుంటోంది. ఈ చెట్టు కిందనే నమ్మాళ్వారు 35 సంవత్సరాలు నివసించాడు. నాలుగు వేదాల సారాన్ని పాశురాలుగా పలికాడు. శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో గరుడ వాహనంపై విచ్చేసి నమ్మాళ్వారుకు ఇక్కడే దర్శనమిచ్చాడు. అంతేకాదు, సకల దేవతలు నమ్మాళ్వారు సందర్శన చేసుకున్నారు. 
ఆలయ అధిష్టానంపై గుర్రాలను తీసుకొచ్చే వర్తకులు, ఏనుగులు, హంసల వరుసలు, చిత్ర విచిత్రాలైన అలంకరణ రీతులు, దశావతార మూర్తులు, అరుదైన పౌరాణిక గాథలలోని వ్యక్తుల రూపాలను మనం చూడవచ్చు. ఆయా శిలా మూర్తులను దర్శించుకున్న భక్తులు వరుసలో ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు.   

గర్భాలయ ప్రాంగణంలో నమ్మాళ్వారు ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది. ఆ స్వామిని సేవించిన భక్తులు అనంతరం గర్భాలయంలో నమ్మాళ్వారు దివ్యమంగళ మూర్తిని దర్శించుకుని భక్తితో కైమోడ్పులర్పిస్తారు. గరుడాళ్వారు పేరున ప్రసిద్ధుడైన ఈ క్షేత్రాన గరుడాళ్వారు ఈశాన్యంగా దర్శనమిస్తారు. వేంకటేశ్వరుడు ఇక్కడ ఒకచోటే ఆదినాథ పెరుమాళ్ళుగా గర్భాలయాన, సన్నిధిలో పడమటివైపున, దాటి దక్షిణాన ఆలయం వెలుపల తూర్పున పెరుమాళ్లు దర్శనమిచ్చే దివ్య క్షేత్రమిది. ఆళ్వారు తిరునగరిగా ఖ్యాతికెక్కిన ఈ క్షేత్రంలో ప్రతి ఏటా   నవగరుడ సేవోత్సవం ఘనంగా జరుగుతుంది. మూలమూర్తులైన  ఆదినాథుడు, కురుగురు నాయికల ఆరాధన ఏటా ఆళ్వారులకు మొదటగా తిరుమంజనం చేసిన తరువాత జరగడం ఇక్కడి విశేషం. పెరుమాళ్ళ శేషమాలను ఆళ్వారులకు పల్లకీలో పంపుతారు. ఇక్కడి ఆళ్వారులు మూడుసార్లు బయటకు వెళతారు. తిరుపతి, రెట్ట తిరుపతి, శ్రీవైకుంఠాలకు ఆళ్వారులు పల్లకీలో వెళ్లినపుడు, ఆళ్వారులు తిరిగి వచ్చేవరకు ఈ ఆలయంలో పెరుమాళ్ళకు దర్శనం లేదు. గుడి తలుపులు మూసి ఉంచుతారు. శ్రీరంగంలో ఉత్సవాలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడా  నిర్వహిస్తారు.  
– దాసరి దుర్గా ప్రసాద్‌, పర్యాటక రంగ నిపుణులు

మరిన్ని వార్తలు