బ్రష్‌ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే..

28 Nov, 2022 09:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు మెడికల్‌:  ఆధునిక జీవన శైలి వల్ల మతిమరుపు బాధితుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు రావటం సహజంగా జరుగుతోంది. దీనినే అల్జీమర్స్‌ వ్యాధి అంటారు. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం ప్రతి 32 సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం 1983 నుంచి ప్రతి ఏడాది నవంబర్‌ నెలను అల్జీమర్స్‌  అవగాహన నెలగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

నియంత్రణే తప్ప నివారణ లేని వ్యాధి..   
ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్లాక ఇంటి అడ్రస్‌ మర్చిపోవడం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవడం ఈ జబ్బు లక్షణం. ఆధునిక జీవనశైలి వల్ల ప్రతి విషయాన్ని కూడా స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్స్‌లో ఆన్‌లైన్‌లోనే వెతుకుతూ మెదడును ఏ మాత్రం వాడకుండా వదిలివేయడంతో వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందస్తుగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఉత్తమం. నియంత్రణే తప్పా నివారణ లేనిది ఈ వ్యాధి.

వ్యాధి లక్షణాలు..  
అల్జీమర్స్‌ వ్యాధి సోకిన వారు తమ పేరు కూడా మర్చిపోతారు.  బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోవడంతో పాటుగా  వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 40 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

వ్యాధి రావటానికి కారణాలు  
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి రావడానికి జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు, నిద్రలేమి, ఒత్తిడికి గురవ్వడంతో పాటుగా బీపీ, షుగర్, గుండెజబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితులు సైతం వ్యాధి బారిన పడుతున్నారు.

రోజువారి పనులు సైతం మర్చిపోతారు..   
వ్యాధిగ్రస్తులు రోజు వారి కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయడం, బ్రష్‌ చేయడం, తిండితినటం కూడా మర్చిపోతారు.  వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, వస్తువుల పేర్లు మర్చిపోవడం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందుకు కోసం వినియోగించాలో అనే అంశాలను సైతం మర్చిపోవడం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయడం, కూరలో ఉప్పువేయడం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి.

జీజీహెచ్‌లో మెమరీ క్లినిక్‌..    
అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తులకు జీజీహెచ్‌ న్యూరాలజీ ఓపీ వైద్య విభాగంలో మంగళ, గురు, శనివారాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజూ 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధిని పెరగనీయకుండా చేయడం తప్పా పూర్తిగా తగ్గించేందుకు మందు లేదు. జిల్లాలో 25 మంది న్యూరాలజిస్టులు ఉండగా ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్దకు ఇద్దరు అల్జీమర్స్‌ చికిత్స కోసం సంప్రదిస్తున్నారు.
చదవండి: కృష్ణ బిలం వినిపించింది! వైరల్‌ వీడియో.. సముద్ర అలల ధ్వనిలా   

మరిన్ని వార్తలు