Amarnath Vasireddy: యంత్రాన్ని ప్రేమించు...  మనిషిని ద్వేషించు! కోపం వస్తోందా?

13 Sep, 2022 15:58 IST|Sakshi

వచ్చేసింది.. కృత్రిమ మేధ , మరమనుషుల ఉపయోగం , డిజిటలైజేషన్, ఆటోమేషన్ యుగం! రానున్న 15 ఏళ్ళల్లో భారీగా తగ్గిపోనున్న ఉద్యోగాలు/ వృత్తులు.. డ్రైవర్ , వ్యవసాయదారుడు , ప్రింటర్, పబ్లిషర్ , క్యాషియర్, ట్రావెల్ ఏజెంట్ , వైటర్స్ , డిస్పాచ్ క్లర్క్, ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు, మిలిటరీ పైలట్, సోల్జర్..

టెలిమార్కెటర్, అకౌంటెంట్, టాక్స్ సలహాదారుడు , స్పోర్ట్స్ రిఫరీ / అంపైర్ , చేనేత కార్మికుడు, పెయింటర్, ప్లంబర్, స్టాక్ ట్రేడర్, నిర్మాణ కార్మికుడు.. భయమేస్తోందా? చర్చించండి . తప్పులేదు . తప్పదు. చిన్న చితకా వ్యాపారాలు అంతరించిపోతాయి. బహుళ జాతి సంస్థలు మరింత బలపడతాయి.

ఒక పక్క కోట్ల ఆస్తులు కలిగిన వారు, మరో పక్క బతుకు తెరువు కోసం కష్టపడేవారు .
ధనికులు మరింత ధనికులు అవుతారు, మధ్య తరగతి బీదరికంలోకి నెట్టబడతారు. సుమారుగా ఎనభై శాతం కష్టపడతారు.
ధనికుల ఇళ్లల్లో వంటపనికి, ఇంటిపనికి రోబోలు, ఫ్రెండ్స్‌గా లివ్ ఇన్ పార్టనర్లుగా రోబోలు వస్తారు.
ప్రతి ఆఫీస్‌లో మనుష్యుల కంటే రోబోలు, లేదా యంత్రాలు కనిపిస్తాయి.
ఉద్యోగాలు తక్కువ; ధనిక బీద తారతమ్యం.. దీనితో తారా స్థాయిలో సామాజిక అసమానతలు, సామాజిక వైరుధ్యాలు, విద్వేషాలు.
బాగా డెవలప్‌ అయ్యామనుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో జాతి విద్వేషం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రతి దేశం రక్షిత విధానాలను అనుసరిస్తుంది. వలసలను తగ్గిస్తుంది లేదా పూర్తిగా అనుమతించదు 

ఈ మెసేజ్ చదివితే నా పై కోపం వస్తోందా ? ఇది నిజం కాకూడదు అనిపిస్తోందా? 
సాంకేతికత జ్యామితీయ నిష్పత్తి వేగంతో దాన్ని ఆపలేము. ఆపాల్సిన అవసరం లేదు. సాంకేతికతను మానవ కల్యాణానికి వాడాలి. కానీ అది కొన్ని బహుళ జాతీయ కంపెనీల చేతిలో బందీ. వారి అధిపత్యానికి తిరుగు లేదు. సామాజిక శాస్త్రాలను చదవని సాధారణ ప్రజానీకానికి ఇది అవగాహన అయ్యే అవకాశం లేదు . అయినా కన్ఫ్యూజ్ చేస్తారు. ఆటలు సాగనివ్వరు .

నిరాశావాదం అనిపిస్తోందా ? నిజం నిష్టూరంగానే ఉంటుంది . మెసేజ్ సేవ్ చేసుకొని ఒక నాలుగేళ్ళ తరువాత చెక్ చేసుకోండి.


-వాసిరెడ్డి అమర్‌నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు

మరిన్ని వార్తలు