Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల

1 Jan, 2022 10:08 IST|Sakshi

ఏ విద్యలో అయినా ఫలానా వారు బాగా నిష్ణాతులు  అని చెప్పడానికి వారికి అది కరతలామలకం అని అనడం  తెలుసు కదా... ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలం అంటే అరచేయి. అంటే అరచేతిలో ఉసిరికాయలా అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అరచేతిలో ఉసిరికాయ ఉంటే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుందని. అవేమిటో చూద్దాం.

ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదని అనుభవజ్ఞులు చెబుతుంటారు.
రోజూ ఓ ఉసిరికాయని తింటే శ్లేష్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకి ఉసిరి చాలా మంచిది.


ఉసిరికాయల్ని ముద్దగా చేసి తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట.
ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది.
ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ కూడా ఉసిరిని ఔషధ సిరి అని కొనియాడుతుంది. ఎందుకంటే ఉసిరిలోని యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్‌ గుణాల వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచడం ద్వారా చక్కెర నిల్వల్ని తగ్గించి హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందనీ తేలింది. కొన్నిరకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయి.
రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మన దేశంలో అధికంగా పండే ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు.

కురులకు ఉ‘సిరి’
కురుల సంరక్షణకు ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో బాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.  ఉసిరితో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి బాల నెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. అలాగే ఇందులోని సి–విటమిన్‌ ఎండ నుంచీ, చర్మరోగాల నుంచీ కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపునీ ఇస్తుంది. 

రోజూ ఓ ఉసిరికాయని తింటే కాల్షియం ఒంటికి పట్టడం పెరుగుతుంది. దాంతో ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి... తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్‌గా లేదా పొడి రూపంలో–ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్నీ ఆరోగ్యాన్నీ సంరక్షించే అద్భుత ఔషధ సిరి.

చదవండి: Health Tips: షుగర్‌, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...

మరిన్ని వార్తలు