Potlakaya Health Benefits: పొట్లకాయ తింటున్నారా... అయితే.. కిడ్నీలు, బ్లాడర్‌ పనితీరు..

1 Feb, 2022 10:44 IST|Sakshi

పొట్లకాయ... పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది ఈ స్నేక్‌గార్డ్‌. సాధరణంగా పొట్లకాయ అంటే చాలా మంది ముఖం చిట్లిస్తారు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... నోరూరించే రుచులు ఆస్వాదించవచ్చు. అంతేకాదు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

భారత్‌ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ పొట్లకాయలను ఆహారంలో ఉపయోగిస్తారు. మనదేశంలో వీటితో రకరకాల కూరలు వండటం పరిపాటి. అయితే, కొన్ని దేశాల్లో పొట్లకాయలు బాగా పండిన తర్వాత వాటి గుజ్జును టమాటా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా కూడా వినియోగిస్తారు. ఇక ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో వీటి మొలకలను, ఆకులను తింటారు కూడా.


పొట్లకాయలో ఉండే పోషకాలు
పొట్లకాయల్లో ఫైబర్‌ ఉంటుంది.
స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు కూడా కలిగి ఉంటుంది.
ఇక విటమిన్లలో... విటమిన్‌–ఏ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటివి పొట్లకాయలో లభిస్తాయి.
వీటితో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పొట్ల కాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. 
వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. 
జ్వరానికి పథ్యంగా పనిచేస్తాయి. 
శరీరంలోని వ్యర్థాలను బయటకు(డిటాక్సీఫై) పంపిస్తుంది.
డీ హైడ్రేషన్‌ తగ్గిస్తుంది. కిడ్నీలు, బ్లాడర్‌ పనితీరును మెరుగపరుస్తుంది.
ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పొట్లకాయలో యాంటీ బయాటిక్‌ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
శ్వాస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవాలనిపిస్తోంది కదా! అయితే, ఎప్పటిలా కూరలా కాకుండా ఇలా కట్‌లెట్‌ తయారు చేసుకుని రుచిని ఆస్వాదించండి.
పొట్లకాయ కట్‌లెట్‌ ఇలా తయారీ
కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు  కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా.

తయారీ:
పొట్లకాయను కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి
ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో కలపాలి.
స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి
బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి
ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో కూరాలి
స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి
స్టఫ్‌ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి
టొమాటో సాస్‌ లేదా చిల్లీ సాస్‌తో అందించాలి.

చదవండి: Gas Problem Solution: గ్యాస్‌ సమస్యా... పాస్తా, కేక్‌ బిస్కెట్స్, ఉల్లి, బీట్‌రూట్స్ తింటే గనుక అంతే!

మరిన్ని వార్తలు