మహిళలకు వ్యాపార పాఠాలు

21 Dec, 2022 18:59 IST|Sakshi

బాధ్యతలను అధిగమిస్తూ.. సమాజంలో ఉన్నతిని సాధిస్తూ వేలాది మందికి ఉపాధినిచ్చే స్థితికి చేరుకోవడం నేటి మహిళ సాధికారతను తెలియజేస్తుంది. అయితే, మహిళలు వ్యాపార రంగంలో రాణించడం అంత సామాన్య విషయమేమీ కాదంటూనే ప్రపంచవ్యాప్తంగా 1990లలో మహిళా వ్యాపారుల సంఖ్య 6శాతం ఉంటే 2019లో 42 శాతానికి మించిందని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఓన్డ్‌ బిజినెస్‌ ఒక రిపోర్ట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌ టాప్‌ బిజినెస్‌ లీడర్స్‌గా పేరొందిన మహిళల అత్యంత విలువైన వ్యాపార పాఠాలను ఉమెన్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూపిఓ) మన ముందుంచింది.

మహిళల యాజమాన్యంలో ఉన్న సంస్థలు లాభదాయకంగా ఉంటున్నాయని, వ్యాపార ప్రపంచంలో ఇప్పటికే తమదైన ముద్ర వేసుకున్నాయి. మహిళలు వ్యాపారం చేసే విధానం, తమ బృందాలతో ఎలా వ్యవహరిస్తారు, తమ లక్ష్యాలను ఎలా కొనసాగిస్తారో తెలియజేసింది..

సంరక్షణ పాఠం నేర్చుకోవాల్సిందే!
బలహీనతలను దాచడానికి గతంలో మహిళపైన చాలా ఒత్తిడి ఉండేది. పని ప్రదేశం నుంచి ఇంటికి వెళ్లడానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 అనే టైమ్‌ తెరను ప్రపంచంలోని అన్ని చోట్లా కోవిడ్‌ మహమ్మారి తీసేసింది. బజ్‌బాల్జ్‌ ఫౌండర్, సీఇవో మెర్రిలీ కిక్‌  మాట్లాడుతూ ‘మన జీవితాల్లో సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన పాఠం. సంరక్షణ ఇచ్చే వ్యక్తులు మన జీవితాల నుంచి ఏదో ఒక రోజు చాలా సాధారణంగా వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత మన జీవితమేంటి?! ఈ  ప్రశ్నకు మనమే సమాధానం వెతుక్కోవాలి.

ఎప్పుడైతే మహిళలు తమ పనిని, తమ బాధ్యతను తామే చూసుకోవడం ఇష్టపడతారో అప్పుడు వారికై వారు సాధారణంగా ఉంటారు’ అని తెలియజేస్తారు. తమ బలహీనతలను సైతం బహిర్గతం చేసేటంత ధైర్యం ఉన్నవారు నాయకులు. నిజాయితీగా. ముక్కు సూటిగా వ్యవహించేవారు తమ టీమ్‌ గౌరవాన్ని పొందుతారు. తమ ఆలోచనల్లో అర్థవంతమైన మార్పు వచ్చి, సురక్షితమైన స్థలాన్ని వారే సృష్టిస్తారు. దీనివల్ల కొత్త ఆవిష్కరణ, ఉత్పాదకత, పురోగతి, విజయం కలుగుతాయి’ అంటారు.

వైవిధ్యం తప్పనిసరి
టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మహిళా సంస్థలు, బిజినెస్‌ లీడర్లను ఒకే వేదికమీదకు చేర్చుతున్నాయి. మహిళల వ్యాపారవృద్ధి నిర్ధారించడానికి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ సేవల ను అందించే మాస్‌ గ్లోబల్‌ కన్సల్టింగ్‌ హెడ్‌ మోనికా హెర్నాండెజ్‌ మాట్లాడుతూ– ‘సక్సెస్‌ సాధించిన సంస్థల ఫౌండర్లు సామాజిక బాధ్యతను కలిగి ఉంటారు.

వారిలోని అద్భుతమైన ప్రతిభకు మూలమేంటో వారికి తెలుసు. కొంతవరకు సాంకేతిక ప్రతిభను కనుక్కోవడంలో కష్టపడుతూ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వైవిధ్యం తీసుకురావడమనేది వ్యాపార పరంగా తప్పనిసరి’ సూచిస్తారు. 

సిసలైన ప్రయోజనం
‘కాలానికి తగినట్టు ప్రతిదీ మారుతుందనే మాట మన అమ్మమ్మలూ చెప్పినదే. అది నిజం కూడా. ఒక ప్రయోజనంతో నడిచే కంపెనీలు లాభాలను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి సారించే కంపెనీలను అధిగమించాయి. నాయకత్వం వహించడం నుండి నేను నేర్చుకున్న పాఠం కస్టమర్లు వారు శ్రద్ధ వహించే సమస్యలపై స్టాండ్‌ తీసుకునే నాయకులనే ఎప్పుడూ కోరుకుంటారు.

ఒక డేటా ప్రకారం 74 శాతం మంది వినియోగదారులు వస్తువు ఎంపికచేసే సమయంలో ధర–నాణ్యతలో సారూప్యం చూపుతారు. దానికి తగినట్టుగానే ఉత్పత్తిని ఎంచుకుంటారు’ అని టెనరల్‌ సెల్లార్స్‌ కంపెనీ అధినేత జిల్‌ ఓసుర్‌ చెబుతారు. మహిళా యాజమాన్యంలో కంపెనీ వ్యాపార నమూనా పూర్తిగా నాణ్యమైన ప్రయోజనాన్ని అందించేలా లాభాపేక్ష కంపెనీలకు అనుకూలంగా మారిందనేది జిల్‌ మాట. 

టీమ్‌ భద్రత
గతంలో కంపెనీలో మహిళా లీడర్లకు తక్కువ అవకాశాలు ఉండేవి. కొత్త వ్యూహాలు, వ్యాపార విజయాన్ని తీసుకురావడానికి సహకారం, మద్దతు, భాగస్వామ్యం వంటివి దశాబ్దాలుగా మార్పు చెందుతూ వచ్చాయి. పనిలో సమానత్వంపై దృష్టి సారించిన సామాజిక ప్రభావ సంస్థ అయిన ఫెక్సబిలిటీకి చెందిన నాన్సీ గీసెన్‌ మాట్లాడుతూ ‘టీమ్‌లోని సభ్యులందరికీ తమదే అనిపించేలా పనిలో మానసిక భద్రతను సృష్టించడం వల్ల ప్రయోజన స్థాయిలు పెరుగుతాయి. విభిన్న నాయకత్వం మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుందని, పోటీదారులను అధిగమిస్తుందని పరిశోధనలూ నిరూపిస్తున్నాయి. ఈ విధానం వల్ల వాటాదారులకూ మరింత విలువ లభిస్తుంది’ అని చెబుతారు. 

వనరులు.. జాగ్రత్తలు
సమస్యను చూస్తున్నప్పుడు విభిన్న దృక్కోణాలను పరిశీలించడం ఎప్పుడూ ఉత్తమమైదే. ఉదాహరణకు ‘వీడియో గేమ్‌ల తయారీలో ఒక థీమ్‌ని సృష్టించడం కష్టమని మీరు అనుకోవచ్చు. కానీ, వీడియో గేమ్‌లలో మన జీవన విధానాలను జోడిస్తే, వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్పడం ద్వారా అవి మంచి ప్రభావాన్ని చూపుతాయి. మేం మా నిర్ణయాల కన్నా వైఫల్యాల ద్వారా నేర్చుకుంటాం. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, బృందంతో ఎలా కలిసి పనిచేయడం.. వంటివి చాలా ముఖ్యమైనవి. అప్పుడే సరైన ఉత్పత్తిని ఇవ్వగలం’ అంటారు మ్యాగ్జిమమ్‌ గేమ్స్‌ కంపెనీకి చెందిన క్రిస్టినా సిలీ. 

నచ్చిన వ్యక్తులతో కలిసి పనులు
ప్రపంచం మునుపెన్నడూ లేనంత చిన్నదిగా మారిపోయింది. సక్సెస్‌ సాధించినవారు తమ వ్యాపారాలను విస్తృతం చేసేటప్పుడు దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఫుల్‌ సర్వీస్‌ మార్కెటింగ్, కమ్యూనికేషన్‌ కంపెనీ యజమాని తారా టర్కిగ్‌టన్‌ మాట్లాడుతూ ‘మేం కంపెనీ పనుల్లో ప్రతిదానికి కేంద్రంగా ప్రజలను ఉంచుతాం. మేం ఇష్టపడే పనిని నచ్చిన వ్యక్తులతో కలిసి చేయడాన్ని ఎంచుకుంటాం’ అని తెలిపింది. 

మహిళలు యజమానులుగా ఉన్నవి 42 శాతం వ్యాపారాలు. అయితే, ఆ వ్యాపారాలలోని ఆదాయం ఇంకా పెరగాల్సి ఉంది. మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయాన్ని పొందే కంపెనీలు 20 శాతం మాత్రమే మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు మిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అడ్డంకులు ఉన్నాయి. ఈ పారిశ్రామికవేత్తల పాఠాలు, విజయాలు మహిళలు నాయకత్వం వహించడానికి, అభివృద్ధి చెందడానికి మరిన్ని అవకాశాలకోసం మార్గాన్ని సులభం చేస్తాయని డబ్ల్యూపివో వెల్లడించింది.

మరిన్ని వార్తలు