విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు..

27 Feb, 2021 00:02 IST|Sakshi

పెళ్లయిన వాళ్ల జీవితంలోని పెద్ద విషాదం.. విడాకులు. స్త్రీకి ఆ బాధ ఇంకాస్త ఎక్కువేనేమో. ‘కానీ గైస్‌.. If you take one day at a time (రేపటి గురించి కూడా ఈరోజే ఆలోచించకుండా ఉంటే) things will be better' అని యూఎస్‌ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ‘కెల్లీ క్లార్క్‌సన్‌ షో’ లో చెప్పడం ఇప్పుడు మహిళలకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అయింది. ప్రథమ మహిళగా ఆమె ఇచ్చిన ఆ తొలి ఇంటర్వూలోనే.. మొదటి భర్త నుంచి తను వేరు పడటం గురించి మాట్లాడారు! అసలు అంత పర్సనల్‌ విషయం లోకి షో ఎందుకు వెళ్లింది! షో హోస్ట్‌ కెల్లీ కూడా ఈమధ్యే భర్తకు విడాకులు ఇచ్చారు. ఇంటర్వూలో జిల్‌ బైడెన్‌ తన విడాకుల అనంతర జీవితం గురించి ఇంకా ఏం చెప్పారు? ‘నేను విడాకులు తీసుకోకుండా ఉంటే ‘జో’ ని కలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ కలగకపోయేది‘ అని ఆమె అనడానికి కారణమైన ఆనాటి పరిణామాలు ఏమిటి? అవి  మహిళలకు ఎలా ఆదర్శం?

మన తెలుగు టీవీ ఛానెళ్లలో వస్తూ ఉండే బతుకు జట్కా బండి వంటి షో లను మీరు చూసే ఉంటారు. అలా.. దాంపత్య జీవితపు ఒడిదుడుకుల ఉద్వేగాలను ఒడిసిపట్టి, వాటిని వడకట్టకుండా ప్రసారం చేస్తుండే ఒక అమెరికన్‌ షో లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ కనిపించారు! ప్రథమ మహిళ అయ్యాక ఒక టీవీ షో కు జిల్‌ బైడెన్‌ ఇంటర్వూ్య ఇవ్వడం ఇదే తొలిసారి. షో లో తొలిసారి మాట్లాడ్డంలో విశేషం ఏమీ లేదు. అయితే తన తొలి వివాహం గురించి జిల్‌ బైడెన్‌ ఆ షో లో మనసు విప్పారు.

‘ది కెల్లీ క్లార్క్‌సన్‌ షో’ అనే ఆ పగటి పూట షో గురువారం ప్రసారం అయింది. హోస్ట్‌ కెల్లీ (38). గెస్ట్‌ జిల్‌ బైడెన్‌ (69). హోస్టు, గెస్టు ఇద్దరికిద్దరూ సాధారణమైన వారేమీ కాదు. కెల్లీ గాయని. టెలివిజన్‌ పర్సనాలిటీ, నటి, రచయిత్రి. ‘ది కెల్లీ క్లార్క్‌సన్‌ షో’ను రోజూ కనీసం 10 లక్షల 80 వేల మంది టీవీ వీక్షకులు చూస్తుంటారు. ఎన్‌.బి.సి టీవీ తరఫున ఆమె ఈ డైలీ షో ను ఏడాదిగా నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో చిన్న బ్రేక్‌తో ఇటీవలే తిరిగి మొదలైంది. ఇక జిల్‌ బైడెన్‌ గురించి ఇంతే గొప్పగా చెప్పాలంటే ఆమెను ‘గృహిణి’ అని గానీ, ‘టీచర్‌’ అని గానీ చెబితే సరిపోతుంది.   


వైట్‌ హౌస్‌లోని ఈస్ట్‌ రూమ్‌లో ‘ది కెల్లీ క్లార్క్‌సన్‌ షో’ జిల్‌ బైడెన్, కెల్లీ 

ఇటువంటి షోలు ప్రసారం అవుతున్నప్పుడు సాధారణంగా ఒక ఉద్వేగ స్థితిలోకి గెస్టు చేరుకుంటారు. అప్పుడు గెస్టును హోస్టు ఓదారుస్తారు. కానీ గురువారం నాటి షోలో ఇందుకు భిన్నంగా జరిగింది. సాఫీగా సాగుతున్న సంసార నౌకను విడాకులనే ప్రతికూల గాలులు ఎంతగా అల్లకల్లోలానికి గురి చేస్తాయో చెబుతూ హోస్ట్‌ కెల్లీ గుండె తడితో మాట్లాడారు. అది ఆమె సొంత అనుభవం. ఆ అనుభవాన్ని స్క్రీన్‌పై జిల్‌ బైడెన్‌తో పంచుకున్నారు. కెల్లీ భర్త బ్రాండెన్‌ ట్యాలెంట్‌ మేనేజర్‌. అతణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కెల్లీ. అప్పటికే అతడు తన మొదటి భార్యతో విడిపోయి ఉన్నాడు. ఒక కూతురు. ఒక కొడుకు. వారిని కూడా తన పిల్లలుగా స్వీకరించారు కెల్లీ.

తర్వాత వీళ్లిద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. కూతురు వయసిప్పుడు ఆరేళ్లు. కొడుకు వయసు నాలుగేళ్లు. 2012లో డేటింగ్, 2013 పెళ్లి, 2020 నవంబరులో లో విడాకులు. భర్తే విడాకులు కావాలన్నాడు. కోర్టుకు అతడు చెప్పిన కారణం.. తమ మధ్య ‘సమసిపోయే స్వభావం లేని మనస్పర్థలు’ ఎన్నో ఉన్నాయని. విడాకులు వచ్చాక కెల్లీ ఏడ్చింది. పిల్లల్ని తీసుకుని పక్కకు వచ్చేసింది. ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులు అయినట్లయింది. తనకున్న వ్యాపకాలు ఆమెకు ఆ జ్ఞాపకాలు రాకుండా సహాయపడ్డాయి.

అయినా కష్టమే. భర్త నుంచి దూరంగా వచ్చి మూణ్ణెల్లయినా కాలేదు. భర్త విడిపోయినట్లనిపిస్తుందా! ఏదో ఊరెళ్లినట్లు అనిపిస్తుంది కానీ. షోలో కెల్లీ గుండె తడిని తుడిచే ప్రయత్నం ఏమీ చేయలేదు జిల్‌ బైడెన్‌. అది సోలో చాట్‌. వాళ్లిద్దరే మాట్లాడుకోవడం. కెల్లీ బాధను చూసి రెండు విషయాలు చెప్పారు జిల్‌. ఒకటి: విడాకులతో స్త్రీ జీవితమేమీ అంతమైపోదు. రెండు : రేపటి గురించి కూడా ఇవాళే ఆలోచించకపోతే జీవితం మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు మాటల్ని కెల్లీ ఊరికే విన్నారు తప్ప, ఆమెకేమీ ఊరటనిచ్చినట్లు లేవు!

‘‘కెల్లీ చూడు.. నేను విడాకులు తీసుకోకుండా ఉంటే ‘జో’ని కలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ కలగకపోయేది’ అన్నారు. అదేదో నవ్వుతూ అనడం కాదు. నిజంగానే అన్నారు. గతాన్ని వెనకే వదిలేసి ముందుకు సాగిపోవాలని ఆ మాటలోని అంతరార్థం. విడాకుల తర్వాత స్త్రీలందరి జీవితం ఒకేలా ఉంటుంది. పురుషుడి సంగతి వేరే. ‘తట్టుకోలేకపోవడం’ అన్నది స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. ఆ బలహీనత పైకి కనిపించి పోతుంటే మరింతగా జీవితం ఆ స్త్రీని హడలుకొడుతుంది. 

కెల్లీ జీవితంలో జరిగినట్లే జిల్‌ బైడెన్‌ జీవితంలోనూ జరిగింది. కాకపోతే, కెల్లీ తన మొదటి భర్త పిల్లలిద్దరికీ మారుతల్లి అయ్యారు. జిల్‌ తన రెండో భర్త బైడెన్‌ కొడుకులిద్దరికీ తల్లిగా ప్రేమను పంచారు. జిల్‌ 1970 ఫిబ్రవరిలో బిల్‌ స్టీవెన్‌సన్‌ని పెళ్లి చేసుకున్నారు. 1975 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ‘జో బైడెన్‌తో తన భార్య పరిచయం తమ వివాహబంధాన్ని దెబ్బతీసిందని స్టీవెన్‌సన్‌ అంటాడు. ‘అతడివన్నీ మనసును బాధించే ఆరోపణలు’ అని జిల్‌ అంటారు. అతడితో విడాకులు తీసుకున్న రెండేళ్లకు 1977లో బైడెన్‌తో జిల్‌ పెళ్లి జరిగింది.

బైడెన్‌ ఆమెకు పరిచయమైన తొలి రోజు జిల్‌ ఇంటికి వచ్చి రాగానే.. ‘మామ్, ఐ ఫైనల్లీ మెట్‌ ఎ జెంటిల్మన్‌’ అని చెప్పారట. ఆ సంగతిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు జిల్‌. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన బాధలో ఉన్నప్పుడు.. ‘రేపటి గురించి కూడా ఇవాళే ఆలోచించకపోతే జీవితం మెరుగ్గా ఉంటుంది’ అని తల్లి తనతో అన్నమాటనే ఇప్పుడు తను చెబుతున్నానని టీవీ షోలో కెల్లీతో అన్నారు జిల్‌ బైడెన్‌. షోలో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు జిల్‌. విడాకుల టాపిక్కే షోకి హైలైట్‌ అయింది. సగటు మనిషి అయినా, సెలబ్రిటీ అయినా జీవితం ఒక దశలో ప్రతి ఒక్కరికీ ఇరుగ్గా అనిపిస్తుంది. అప్పుడే ధైర్యంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేయాలి. నిజమే కదా. రేపటికి ఊపిరెలా అని అలోచిస్తామా?!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు