ఈ విమానం ఎగరదు.. ‍కానీ ధర మాత్రం కోట్లు పలుకుతోంది, ఎందుకో తెలుసా!

25 Dec, 2022 14:07 IST|Sakshi

పాప్‌ ప్రపంచానికి రారాజుగా వెలుగొందిన ఎల్విస్‌ ప్రెస్లీకి సొంత జెట్‌ విమానం ఉండేది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆ విమానమే! ఈ ‘జెట్‌స్టార్‌’ విమానాన్ని ఎల్విస్‌ 1962లో 6.85 లక్షల పౌండ్లకు (రూ.6.97 కోట్లు) కొనుగోలు చేశాడు. ఎగిరేస్థితిలో లేని ఈ విమానం ముప్పయ్యేళ్లకు పైగా న్యూమెక్సికోలోని రోజ్‌వెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ బోన్‌యార్డ్‌లో పడి ఉంది. ఎరుపు రంగులో ఉన్న ఈ విమానం లోపలి భాగంలోనూ ఎరుపురంగే కనిపిస్తుంది.

ఎరుపు తివాచీ, ఎరుపురంగు వెల్వెట్‌ కుషన్లు ఉన్న ఆరు ప్రత్యేకమైన సీట్లు, బంగారు అంచులతో తీర్చిదిద్దిన ఇంటీరియర్‌ డిజైన్‌ ఈ విమానం ప్రత్యేకతలు. అంతేకాదు, ఇందులో కేసెట్‌ప్లేయర్, టెలివిజన్, వీసీఆర్, మైక్రోవేవ్‌ ఓవెన్‌ వంటి వసతులూ ఉన్నాయి.

పదిహేనేళ్లు వాడిన తర్వాత ఎల్విస్‌ దీనిని 1977లో ఒక సౌదీ అరేబియన్‌ కంపెనీకి అమ్మేశాడు. తర్వాత ఇది చేతులుమారి దాదాపు ముప్పయ్యేళ్ల కిందట రోజ్‌వెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ బోన్‌యార్డ్‌కు చేరుకుంది. ఎగిరేస్థితిలో లేకపోవడంతో దీని ఇంజన్, కాక్‌పిట్‌ వంటి భాగాలను తొలగించారు. వచ్చే జనవరిలో దీనిని వేలం వేయనున్నారు. ఎల్విస్‌ వాడిన విమానం కావడం వల్ల దీనికి భారీ ధరే పలకవచ్చని అనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు