Haut Monde Mrs India Worldwide: ప్రతిభా షా

30 Oct, 2021 04:13 IST|Sakshi

ఉద్యోగం చేసి అలసిపోయి..అబ్బా చాలా కష్టపడ్డాం... అనుకునే వాళ్లు కొందరైతే...ఈ ఉద్యోగం ఇంకెన్నాళ్లు చేస్తాం? ఇక చాలు విసుగొస్తుంది. ఇంకేదైనా కొత్తగా నేర్చుకుందాం! అని సరికొత్త ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకుపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన వ్యక్తే అమిషా సేథీ. రచయితగా... వెల్‌నెస్‌ కోచ్‌గా... గ్లోబల్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌గా విజయవంతంగా రాణిస్తూనే.. తాజాగా ప్రతిష్టాత్మక ‘హౌట్‌ మొండే మిసెస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌– 2021’ పదో సీజన్‌ విన్నర్‌గా నిలిచి, కిరీటాన్ని కైవసం చేసుకుంది.

అమిషా రాజ్‌కోట్‌లో పుట్టినప్పటికీ పెరిగిందంతా ఢిల్లీలోనే. బాల్యంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్‌షోలు చూడడం. థ్రిల్లర్, రొమాంటిక్‌ నవలలు చదువుతూ... సినిమాలు చూస్తూనే చదువులో మంచి గ్రేడ్‌లు తెచ్చుకునేది. తను చూసిన డ్యాన్స్‌షోల ప్రభావంతో చిన్ననాటి నుంచి కొరియోగ్రాఫర్‌ అవ్వాలని కలలను కనేది. కానీ వివిధ కారణాలతో కొరియోగ్రఫీ చేయలేకపోయింది. దీంతో ఇంటర్మీడియట్‌ అయ్యాక నోయిడాలోని బిజినెస్‌ స్కూల్‌లో ఎమ్‌బీఏ చదివింది. తరవాత చికాగోలోని‘ కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎగ్జిక్యూటివ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌ చేసింది.  
 
బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా..
అమిషా చదువు పూర్తయిన వెంటనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసాక, బ్లాక్‌బెర్రీ కంపెనీకి మారింది. ఈ రెండు కంపెనీలలో వివిధ హోదాల్లో పనిచేసింది. బ్లాక్‌బెర్రీలో బ్రాండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా, ఎయిర్‌ ఏసియాలో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌గా, జఫీన్‌లో గ్లోబల్‌ సీఎమ్‌వోగా అత్యుతమ సేవలందించింది. అనేక బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా అమిషా అందించిన సేవలకుగాను.. వరల్డ్‌ ఉమెన్‌ లీడర్‌షిప్‌ కాంగ్రెస్‌ ఇచ్చే ‘యంగ్‌ ఉమెన్‌ రైజింగ్‌ స్టార్‌’, ద ఏసియా పసిఫిక్‌ యంగ్‌ ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డు, సీఎన్‌బీసీ యూత్‌ అచీవర్స్‌ అవార్డు, మార్కెటింగ్‌ ఎక్స్‌లెన్స్‌ లాంటి ఎన్నో అవార్డులు వరించాయి.

రచయిత నుంచి మోటివేషనల్‌ స్పీకర్‌ వరకు...
కన్సల్టెంట్‌గా విజయవంతంగా దూసుకుపోతూ, అనేక ఉన్నతస్థాయి పదవుల్లో తనని తాను నిరూపించుకున్న అమిషాకు గ్రంథాలు, శిల్పాల మీదకు ఆసక్తి మళ్లింది. దీంతో వివిధ గ్రంథాలను చదువుతూ అనేక విషయాలు తెలుసుకునేది. గ్రంథాలను చదివేటప్పుడు తనకు వచ్చిన ఆలోచనలను కాగితం మీద పెట్టేది. అలాగే వివిధ భాషల్లో తను చదివిన గ్రంథాలను అందరూ చదివేందుకు వీలుగా అనువాదాలు చేసింది. ఇలా అమిషా రాసి పుస్తకం ‘ఇట్‌ డజంట్‌ హర్ట్‌ టు బి నైస్‌’ బెస్ట్‌సెల్లర్‌ బుక్‌గా నిలిచింది.

పుస్తకాల ప్రమోషన్‌లో భాగంగా అమిషా మాటతీరు ఆసక్తికరంగా ఉండడంతో, ‘‘అంతా ఇంకా మాట్లాడండి’’ అంటూ ప్రోత్సహించడంతో అమిషా మోటివేషనల్‌ స్పీకర్‌గా మారింది. ప్రతి సెషన్‌కు ఏం మాట్లాడాలి? ఆరోజు ఏం సందేశం ఇవ్వాలి... అని బాగా సన్నద్ధమయ్యేది. ఏన్షియంట్‌ టైమ్‌లెస్‌ టెక్నిక్స్, మెడిటేషన్, ఫన్‌ గేమ్స్, న్యూరోసైన్స్, సైకలాజికల్‌ టెస్టులను వివిధ వర్క్‌షాప్స్‌లో అందిస్తూ తన కంటెంట్‌ను మెరుగుపరుచుకుంది. ఇవేగాక క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్స్, ఆసుపత్రులు, సపోర్ట్‌ సెంటర్‌లలో తరచూ హ్యాపీనెస్‌ సెషన్లను నిర్వహిస్తుండేది.  

వెల్‌నెస్‌కోచ్‌..
ఫిట్‌నెస్‌కు బాగా ప్రాముఖ్యతనిచ్చే అమిషా ‘ఏజ్‌ రివర్సల్‌ థెరపీస్‌’, యోగా, మెడిటేషన్, ఆధునిక వ్యాయామాలపై ఆసక్తితో వాటి గురించి లోతుగా తెలుసుకుని తను ఆచరించడంతోపాటు.. ఫిట్‌గా ఎలా ఉండాలో తోటి వాళ్లకు నేర్పించేంత ప్రావీణ్యాన్ని సంపాదించింది. తన ఫిటెనెస్, ఆకర్షించే రూపం, తెలివితేటలతో బెంగళూరు తరపున పాల్గొని ప్రతిష్టాత్మక హౌట్‌ మొండే మిసెస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌–2021 సీజన్‌–10 విజేతగా నిలిచింది. యూఏఈలో జరిగిన ఈ పోటీలో 21 దేశాల నుంచి అతివలు పాల్గొనగా, అందులో 96 మంది ఫైనలిస్టులలో గ్లామర్, గుడ్‌లుక్స్, తెలివితేటల ప్రతిభ ఆధారంగా అమిషా సేథీ టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. ‘‘జీవితంలో విజయం, ఓటమి రెండూ లేవు. జీవితమంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేయడమే. ఈ సూత్రం నమ్మే నేను ఈ స్థాయికి ఎదిగాను.’’ అంటూ అమిషా నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు