వీథి నుంచి వెండి తెరకు

20 Nov, 2021 00:40 IST|Sakshi
నాడు : చెత్తకుప్పల్లో అముద నేడు : ఉద్యోగినిగా అముద

మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్‌ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు.

స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌..
సీన్‌ –1
సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది.

కట్‌ చేస్తే...
సీన్‌ –2
కోదాడ వ్యవసాయ మార్కెట్‌. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..!

ఎవరీ యువతి... ?!
2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్‌ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది.

మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు.

కుటుంబంలో ఒకరిగా..
మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే  ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని  భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది.  పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్‌లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది.

ముంబయ్‌కి వెళ్లిన కథ
చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్‌ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్‌ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది.

అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్‌ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు.

శాశ్వత ఆసరా!
తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్‌ అముదకు విద్యావలంటీర్‌గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్‌రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్‌ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది.

వెండి తెరపైన అముద కథ
ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్‌ ప్రారంభించారు.  తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు.
మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది.

చిత్రం షూటింగ్‌ సన్నివేశం


సంరక్షకుడు  పల్లే వెంకటేశ్వర్లుతో అముద

– అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ

మరిన్ని వార్తలు