ఎంబీయే చదివి పాడి రైతుగా.. 40 ఎకరాల కౌలు భూమిలో 

16 May, 2023 14:44 IST|Sakshi
అప్పలనాయుడు మినీ డెయిరీ

కౌలు సేద్యంలో గెలిచాడు!

ఎంబీయే చదివి పాడి రైతుగా రాణిస్తున్న యువ రైతు అప్పలనాయుడు

40 ఎకరాల కౌలు భూమిలో ఆధునిక పశుగ్రాసాల సాగు

పాడికి తోడుగా సైలేజీ గడ్డి విక్రయం ద్వారా ఏడాది పొడవునా ఆదాయం

పాడి పరిశ్రమ నిర్వహణలో మేటిగా పురస్కారాలు అందుకుంటున్న ఆళ్ల అప్పలనాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంబీఏ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా పాడి పరిశ్రమనే నమ్ముకొని అభివృద్ధి సాధిస్తూ విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. శ్రద్ధగా చేస్తే పాడి పరిశ్రమ కౌలు రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుందనడానికి చక్కని ఉదాహరణ అప్పలనాయుడు సోదరుల వ్యవసాయం నిలుస్తోంది.

అనకాపల్లి జిల్లా కశింకోట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అప్పలనాయుడు ఎంబీఎ చదివారు. ఉద్యోగం పట్ల ఆసక్తి చూపలేదు. మరొకరి కింద పని చేయడం సుతరాం ఇష్టపడలేదంటారాయన. 2008లో పశు సంవర్థక శాఖ ద్వారా పశు క్రాంతి పథకం కింద (సగం రాయితీపై) రూ.75 వేల రుణం పొంది, 2 పాడి ఆవులు కొనుగోలు చేసి పాడి రైతుగా స్వయంకృషితో జీవనాన్ని ప్రారంభించారు.

ఏ పని చేసినా దీక్షగా చేసే అలవాటున్న అప్పలనాయుడు సత్ఫలితాలు సాధిస్తూ పురోగమించారు. 2012లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో 30 శాతం రాయితీపై మినీ డెయిరీ పథకానికి రూ.5 లక్షల రుణం మంజూరైంది. పది పాడి ఆవులను కొనుగోలు చేసి తన సొంత స్థలం అరెకరంలో మినీ డెయిరీ ఏర్పాటు చేశారు.

శివకృష్ణ, సత్తిబాబుల సహకారంతో పాలను  విక్రయిస్తున్నారు. క్రమేపీ అనుభవం గడిస్తూ పాడి రైతుగా సమృద్ధి సాధించారు. ఇప్పుడు ఆయన డెయిరీ ఫాంలో 52 ఆవులు  ఉన్నాయి. రోజుకు 220 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు.  

పాతర గడ్డి ఉత్పత్తి ఇలా...
పశు పోషణకు, పాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఉపయోగపడే నాణ్యమైన పాతర గడ్డి తయారీపై అప్పలనాయుడు సోదరులు దృష్టి సారించారు. 2018లో రూ. కోటి పెట్టుబడితో శిలపరశెట్టి చిట్టెమ్మ భాగస్వామ్యంతో సైలేజ్‌ యంత్రం (పాతర గడ్డి తయారీ యంత్రం) కొనుగోలు చేశారు. పశు సంవర్థక శాఖ 50% రాయితీ కల్పించింది.

మొక్కజొన్న పంట విత్తిన 75 రోజులు దాటాక పాలకంకి స్థాయి (మొక్కజొన్న పొత్తులు గోరు గిల్లితే పాలు వచ్చే దశ)లో ఉన్నప్పుడు మొక్కజొన్న కర్రలను ముక్కలుగా కట్‌ చేస్తారు. ఆధునిక పాతర గడ్డి యంత్రం ద్వారా నిల్వ కోసం  అనుమతించిన మందులు కలిపి గుండ్రటి బేళ్లుగా తయారు చేస్తారు. ఇవి 21 రోజుల తర్వాత అమ్మకానికి సిద్ధమవుతాయి. తక్కువ ధరపై కిలో 6.50కు పాడి రైతులకు అందుబాటులో ఉంచుతారు. ఈ పాతర గడ్డి ఏడాది వరకూ నిల్వ ఉంటుంది. 

వేసవి కాలంలో పచ్చిగడ్డి అందుబాటులో లేనప్పుడు, ప్రవృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గ్రాసం కొరత రాకుండా పాతర గడ్డి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క పాడి పశువుకు రోజుకి  30 కిలోల వరకు పాతర గడ్డి అవసరం అవుతుంది. ఒక పాడి గేదెకు పాతర గడ్డి మేపితే రూ.210 ఖర్చుతో సరిపోతుంది. ఇది ఉంటే దాణా కూడా వేయాల్సిన పని ఉండదు.

రోజుకు ఐదు కిలోల దాణాకు అయ్యే రూ.150 ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ గడ్డి వల్ల అధిక పాల దిగుబడి వస్తుంది. పాతర గడ్డిని అప్పలనాయుడు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి ఆదాయాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆయన డెయిరీ ఫాంలో పశుపోషణ, గడ్డి పెంపకం, పాతర గడ్డి తయారీ పనుల్లో రోజూ పది మంది వరకు ఉపాధి పొందుతున్నారు.

40 ఎకరాల్లో పశుగ్రాసం సాగు
40 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అప్పలనాయుడు మేలు రకాల పచ్చగడ్డి పెంపకాన్ని చేపట్టారు. పాతర గడ్డి తయారీ కోసం మొక్కజొన్నతోపాటు బహుళజాతి, ఆధునిక మేలు జాతి పశుగ్రాసాలు పెంచుతున్నారు.

సూపర్‌ నేపియర్, కొంబో నేపియర్, రెడ్‌ నేపియర్, 4జి బుల్లెట్‌ నేపియర్, స్మార్టు నేపియర్‌ వంటి రకాల గ్రాసం పెంచి సొంతానికి వాడుకోగా మిగిలిన గ్రాసాన్ని రైతులకు టన్ను రూ. 2500కు విక్రయిస్తున్నారు. గడ్డి రకాల పెంపకానికి రైతులకు విత్తన కర్రలు (ముచ్చులు) తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నారు. 

ఆధునిక పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా అప్పలనాయుడుకు రెండుసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వ పురస్కారాలు దక్కాయి. డా.సీకె రావు ఎండోమెంటు ట్రస్టు తరఫున గత నెలలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి చిదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఉత్తమ పాడి రైతు బంగారు పతకం, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

2019లో పద్మశ్రీ డాక్టర్‌ ఐవి సుబ్బారావు ’రైతు నేస్తం’ పురస్కారాన్ని హైదరాబాద్‌లో అప్పటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సభ్యునిగా కొనసాగుతున్నారు.
– వేగి రామచంద్రరావు, సాక్షి, కశింకోట, అనకాపల్లి జిల్లా 

కౌలు రైతుల పశుగ్రాసం సాగుకు ‘ఉపాధి’ పథకం వర్తింపజెయ్యాలి
ఎంబీఎ చదివినా వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకొని లాభదాయకమైన పాడి అభివృద్ధిపై దృష్టి పెట్టి విజయం వైపు పయనిస్తున్నాను. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి ఉంది. పాడి ఆవులతో డెయిరీ నిర్వహణ, పాతర గడ్డి తయారీ, మేలు జాతి గడ్డి రకాల పెంపకం చాలా లాభదాయకంగా ఉంది.

నెలకు వీటి ద్వారా సుమారు రూ.60 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. పురస్కారాలు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. పాడి పరిశ్రమ అభివృద్ధికి మున్ముందు మరింత కృషి చేస్తాను. కౌలు రైతుల పశుగ్రాసం సాగుకు ఉపాధి పథకం వర్తింపజేయటం ద్వారాప్రభుత్వం సహాయం అందిస్తే మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. పాడి పరిశ్రమపై మక్కువ ఉన్న యువతకు, రైతులకు శిక్షణతో పాటు ఆర్థిక సహాయం అందించి పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడాలి.
– ఆళ్ల అప్పలనాయుడు, అభ్యుదయ పాడి రైతు, కశింకోట, అనకాపల్లి జిల్లా 
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

మరిన్ని వార్తలు