ఎన్నికల బరిలో తొలి ట్రాన్స్‌జెండర్‌

25 Mar, 2021 23:12 IST|Sakshi
అనన్య

కేరళలో ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థిగా అనన్య పోటీకి దిగింది. అయితే అక్కడ పోటీలో ఉన్నది అత్యంత బలమైన అభ్యర్థి. ‘అతను స్త్రీలు ఇంటిపట్టునే ఉంటే చాలనుకునే భావజాలం ఉన్న అభ్యర్థి. అతనికి స్త్రీ గురించి ట్రాన్స్‌జెండర్‌ల గురించి కూడా గౌరవం నేర్పడానికి రంగంలో దిగాను’ అని అనన్య అందరినీ ఆకట్టుకుంటోంది. పి.కె.కున్హాలి కుట్టి అంటే మలప్పురంలో చాలా సీనియర్‌. ఎం.పి.గా ఎం.ఎల్‌.ఏగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి. మంత్రిగా పని చేశాడు. 

‘కుంజప్ప’గా ముద్దు పేరు కలిగినవాడు. ఔట్‌లుక్‌ పత్రిక వ్యాఖ్యానం ప్రకారం కేరళలో ‘ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌’ (ఐ.యు.ఎం.ఎల్‌) పార్టీకి వెన్నుముకలాంటివాడు. ఇప్పుడు ఆ కొండను ఢీకొనడానికి ఒక శివంగి రంగంలో దిగింది. ఆ శివంగి పేరు అనన్య కుమారి. ఏప్రిల్‌ జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ‘వెంగర్‌’ నియోజక వర్గం నుంచి కున్హాలి కుట్టి నిలబడితే ‘డెమొక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ’ తరఫున ప్రత్యర్థిగా నిలిచింది. టెలివిజన్‌ సెట్‌ను ఆమె ఎన్నికల గుర్తుగా కేటాయించారు.‘ఇది మొదలు. నాది తొలి అడుగు.

నేను సఫలం అయితే దేశంలోని ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ చట్టసభల్లో పోటీకి నిలవడానికి మరింత ముందుకు వస్తారు’ అని 28 ఏళ్ల అనన్య కుమారి అంది. కేరళలో ఇది వరకే ‘తొలి ఎఫ్‌.ఎమ్‌ ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ’గా అనన్య గుర్తింపు పొందింది.‘కున్హాలి కుట్టి ప్రాతినిధ్యం వహించే పార్టీ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యేక్ష ఎన్నికలలో అనుమతించలేదు. కున్హాలి భావజాలం కూడా అదే. స్త్రీలు, టాన్స్‌జెండర్‌లు మంచిపాలన అందిస్తారని నిస్వార్థంగా పని చేస్తారని నేను నిరూపించదలుచుకున్నాను’ అంటుంది అనన్య. 

కొళ్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్‌ వరకూ చదువుకుంది. అనన్య అభ్యర్థిత్వం వెలువడగానే కేరళలోని ట్రాన్స్‌జెండర్ల సమూహం హర్షం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా ఉత్సాహం కలిగించే వార్త’ అని రియా ఇషా అనే ట్రాన్స్‌జెండర్‌ మోడల్‌ అంది. ఎలక్షన్లు ఎంత ఖర్చుతో కూడుకున్నవో ఎన్ని మతలబుల వ్యవహారమో సామాన్యులకు తెలుసు. కాని వివక్షకు గురయ్యే సమూహం నుంచి ఒక అభ్యర్థి వచ్చి పోటీకి నిలవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు