ఒరేయ్‌ బావా.. గుర్తుందా!

13 Sep, 2021 21:07 IST|Sakshi

ఒరేయ్‌ బావా.. గుర్తుందా!
ఇసుక బొరియలోంచి బయటకి బుర్రపెట్టి
చిన్న అలికిడైతే
తుర్రున పారిపోయే ఎండ్రపీతలా
నువ్వు క్యాంపస్‌లోకి
అడుగుపెట్టిన రోజు గుర్తుందా!

సముద్రం సీరియస్‌గా 
పాఠం చెప్పుకుపోతుంటే
ఉద్యోగాలను కలగంటూ
ఒడ్డున ఇసుకపై
బతుకు పాఠాలను రాసుకుంటున్న పీతల్లా
బుద్ధిగా క్లాసులో కూర్చున్న రోజు గుర్తుందా!

క్లాసు ఎగ్గొట్టి
క్యాంటీన్‌ దగ్గరున్న
బాదం చెట్టుకింద కూర్చొని
‘బాతాఖానీ’ టీ తాగుతుంటే
మన తలను అమ్మలా అప్యాయంగా నిమిరే
బాదం ఆకు గుర్తుందా!

మన పక్క రూమ్మేట్‌ పాడే
బాత్రూం పాటలకు విసుగెత్తి
ఎండ ఎర్రగా కాస్తుంటే
ఎఫ్‌.ఎం. పాటల ఒడిలో
పడుకున్న మధ్యాహ్నం గుర్తుందా!

సీతాకోకచిలుకలను చూడటానికి
సాయంత్రం సముద్రానికి పోయి
ఉడకపెట్టిన పల్లీలను
నాలుగు మాటలుగా నమిలి
హాస్టలకు తిరిగొస్తుంటే
నా కంట్లో పడిన ఇసుకను
ఒడుపుగా నువ్వు నాలుకతో తీసిన
సంఘటన గుర్తుందా!

ఫస్టు షో సినిమా చూసొచ్చినాక
హాస్టల్‌ మెస్‌లో మిగిలిన ఫుడ్‌ కోసం
ఖాళీ పళ్లేల్లా కొట్టుకునేవాళ్లం గుర్తుందా!

రాత్రికి టెర్రస్‌పై
చీకటి దుప్పటిని
మన వీపుల కింద పరచుకొని
చుక్కలను లెక్కపెట్టుకుంటూ
మనం మనసుపడ్డ చందమామను
ఊహించుకుంటూ నిదరపోయిన రోజు గుర్తుందా!

ఏమి రోజులరా అవి...!
సముద్రపు అలలను కట్టకట్టి
మూటగా భుజాన వేసుకొని
కలల చేపలను పట్టే రోజులవి.
ఇప్పుడు చూడు
క్షణం తీరిక లేక
ఉద్యోగాల వలకు చిక్కిన చేపలమై
కార్పొరేట్‌ గద్దల నోటికి చిక్కిన పీతలమై
గిలగిల కొట్టుకుంటున్నాం

గుప్పిట్లోంచి ఇసుకలా 
ఆ రోజులు జారిపోయినప్పటికీ
బీచ్‌ నుండి తిరిగొచ్చినాక
ప్యాంటు జేబులో మూలకు నక్కిన
ఇసుకలాంటి మిగిలిన జ్ఞాపకాలను
ఈరోజు నీతో పంచుకుంటున్నాను.

(ఏ.యు. క్యాంపస్‌ రోజులను గుర్తుకు తెచ్చుకొని....) 
ఒక రోజు     
∙ఆర్‌ యస్‌ రాజకుమార్‌
శుభోదయం...
మళ్లీ తెల్లకాగితంలా....
మనోభావాల ఆవేదనలు పెకలించి...
అక్షరంలా ఘనీభవిస్తోంది...
నిర్వేద ఘటనలు....
నవ్వులూ, కన్నీళ్లూ, కొత్త మిళాయింపులూ...
ఆకారం లేని వికారంలా...
యథాలాపంగా కరిగే రసగుళికలు...
మితంగా పరిణితైన ఓ కొత్త పేజీ...
పండుటాకులా గలగలా రాలింది.
మాయా జలతారు దారాలు....
ఈ లోయ అంచువరకూ.....
నిబిడీకృతమయ్యాయి.....
సూర్యకాంతికి తెప్పరిల్లితే....
మళ్ళీ గాల్లో తేలుతూ......
మరో తెల్ల కాగితం....
 ∙మేలిమి పద్యం

ప్రతి పాటకు; ప్రతి మాటకు
శ్రుతి యొక్కటి మంద్రమగుచు సోకును చెవులన్‌
గతి తప్పదు; మధురస సం
గతి విప్పుచు నీడవోలె కదలును వెంటన్‌.

(కొంపెల్ల రామకృష్ణమూర్తి ‘కచ్ఛపీనాదము’ 
ఖండిక నుంచి)
∙∙ 
ఆ కఠోర మృత్యంగణమా కరాళ
దేవతా శూన్యదృక్కులు, ఆ వికార
రూపిణీ మహోగ్రభయద రూక్షరేఖ
లలవి కాలేదు చూడగ, నిలువలేదు.

(సంపత్‌ ‘మృత్యంగణము’ ఖండిక నుంచి)
∙∙ 

బ్రతికి శల్యావశిష్టులై వసుధ తిరుగు
తోడి వారల కన్నెత్తి చూడకున్న,
చచ్చి బూదియౌ వారి ప్రసంగమింక
మాసిపోవునటంచు నమ్మంగ రాదొ?

(జంపన చంద్రశేఖరరావు ‘తమోగీతి’ నుంచి)

                                                                          ∙మొయిద శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు