Ankit Arora: సైకిల్‌ డైరీస్‌.. నీకు జీతం ఎంత ఇస్తారు?

7 Dec, 2021 18:57 IST|Sakshi

‘లెర్న్‌ ఫ్రమ్‌ ది మాసెస్‌...’ అనే మావో మాట అంకిత్‌ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు...

ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్‌ (రాజస్థాన్‌) కు చెందిన అంకిత్‌ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా  సైకిల్‌ కనిపించింది.
‘అవును. సైకిల్‌ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది.


‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్‌.
‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్‌పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు....
నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు.


ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్‌ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!)

‘నువ్వు సర్కార్‌ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు.
‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్‌లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్‌ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు.


ప్రఖ్యాత కవి విలియమ్‌ బట్లర్‌ ఈట్స్‌ ‘ది లేక్‌ అయాల్‌ ఆఫ్‌ ఇన్నిస్‌ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్‌ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్‌ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్‌ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..)

తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్‌.

అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా!

మరిన్ని వార్తలు