వామపక్ష రచయిత

2 Nov, 2020 01:12 IST|Sakshi
యాన్‌ మిర్డాల్‌

ఇక్కడ తటస్థ గాడిద అంటూ ఎవరూ లేరు, అని విస్పష్టంగా తన రాజకీయ దృక్పథాన్ని ప్రకటించుకున్న స్వీడిష్‌ రచయిత యాన్‌ మిర్డాల్‌(1927 – 2020) అక్టోబర్‌ 30న మరణించారు.  1950 నుంచీ ఆయనకు భారత్‌తో అనుబంధం ఉంది. ఇక్కడ పాత్రికేయుడిగా పనిచేశారు. వివిధ దేశాల మీద, తన అనుభవసారంతో సుమారు 30 పుస్తకాలు రాశారు. ఎడ్గార్‌ స్నో ‘రెడ్‌స్టార్‌ ఓవర్‌ చైనా’ స్ఫూర్తితో దండకారణ్యంలో రెండు వారాలు తిరిగి ‘రెడ్‌స్టార్‌ ఓవర్‌ ఇండియా’ రాశారు. దాన్ని ‘భారత్‌పై అరుణతార’ పేరుతో ‘మలుపు’ తెలుగులోకి తెచ్చింది. ఎన్‌.వేణుగోపాల్‌ అనువదించిన ఈ పుస్తకంలో పారిస్‌ కమ్యూన్‌ నుంచి జనతన సర్కార్‌ దాకా సాగుతున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలనూ, ప్రజా సంస్కృతి వికాసాన్నీ విశ్లేషించారు.

శ్రీశ్రీ, చెరబండరాజు మొదలుకొని అంగడి చెన్నయ్య లాంటివాళ్లు రాసిన ‘అన్న అమరుడురా మన రామనరసయ్య’ లాంటి గేయాల ఉటంకింపులు ఇందులో ఉన్నాయి. ‘వృద్ధాప్యం అనేది భారతదేశంలోనూ, స్వీడన్‌లోనూ ఒకటి కాదు. అది ఒక కొస అయితే, ఇది మరొక కొస’ అని చెబుతూ స్వీడన్‌లో ఒకప్పుడు పనికిరారని వృద్ధులను ఎలా కొండ మీదినుంచి తోసేసేవారో చెబుతారు. ‘వామపక్ష రచయితలు అనబడేవాళ్ళు’ రాయని ఎన్నో సున్నితమైన శారీరక ఇబ్బందులను సైతం ప్రస్తావించారు. అందువల్లే ‘చైనా ఇవాళ అంతర్జాతీయంగా ఆర్థిక అగ్రరాజ్యంగా మారిపోయింది. కానీ ధనికులకు, పేదలకు మధ్య అత్యంత దారుణమైన ఆర్థిక రాజకీయ విభేదాలు ఉన్నాయి’ అనగలిగారు. సరిగ్గా అదే కారణంగానే దేశీయ రచయితలకు భిన్నంగా ఒక రచయిత  తను పెరిగిన సంస్కృతికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పగలిగారు. ఆ భాగం ఇక్కడ: ‘‘మార్క్స్, ఏంగెల్స్‌ అయినా, నేనయినా చాలా సహజంగా మా సంస్కృతి సంప్రదాయంలో నుంచే మమ్మల్ని మేము వ్యక్తీకరించుకుంటాం. అయితే ఇది సాధారణ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు.

మావో సే టుంగ్‌ తన కోడలితో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఈ విషయమే ప్రస్తావించాడు. ‘వాంగ్‌ హై జుంగ్‌తో సంభాషణలు 21 డిసెంబర్‌ 1970’ అనే ఈ ప్రచురిత ప్రతిని« చైనాలో సాంస్కృతిక విప్లవ కాలంలో విస్తృతంగా పంపిణీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధ్యయన పత్రాలలో భాగంగా ఉంది.
‘‘మావో: మీరు మీ పాఠ్యాంశాలలో భాగంగా పవిత్ర బైబిల్‌నూ, బౌద్ధ సూత్రాలనూ అధ్యయనం చేయవలసి ఉంటుందా?
హై జుంగ్‌: లేదు. అవన్నీ మేమెందుకు చదవాలి?

మావో: మరి బైబిల్‌ గానీ, బౌద్ధ సూత్రాలు గానీ చదవకుండా మీరు విదేశీ పుస్తకాలను అనువదించాలన్నా, విదేశీ వ్యవహారాలు నిర్వహించాలన్నా ఎలా చేయగలరు?
అంతేకాదు, మావో ఆమెను తూఫూ రాసిన ప్రాచీన చైనా పౌరాణిక కావ్యాలను, ‘డ్రీమ్‌ ఆఫ్‌ ద రెడ్‌ చాంబర్‌’ వంటి నవలలను చదవమని ప్రోత్సహించాడు. అవి మాత్రమే కాదు, లియావో చాయి వంటి కవులను, ప్రాచీన మింగ్‌ కింగ్‌ రాజవంశాల సాహిత్యాలను, పూ సాంగ్‌ లింగ్‌ రాసిన దయ్యాల, భూతాల, నక్కల కథలు చదవమని కోరాడు. లియావో చాయి రాసిన కథల్లో నక్కల ఆత్మలు చాలా దయనీయమైనవి. అవి మానవజాతికి స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉంటాయి అని ఆయన చెప్పాడు. అదేవిధంగా ఆయన జర్మన్‌ అయివుంటే సరిగ్గా ఇదేవిధంగా గ్రిమ్మెల్‌ షాసెన్, గెథే, గ్రిమ్‌ సోదరులు వంటి రచయితలను సిఫారసు చేసి ఉండేవాడే.’’

మరిన్ని వార్తలు