అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్‌!

20 May, 2022 00:22 IST|Sakshi

ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్‌’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్‌’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్‌ నర్సు’గా నిలిచింది. గ్రామంలోని వారంతా తనలా ఎదగాలన్న ఆకాంక్షే ‘ఆస్టర్‌ గార్డియన్స్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డు’ను తెచ్చిపెట్టింది అన్నాకు.

అన్నా ఖబాలే దుబా కెన్యాలోని తొర్బి అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక తన కుటుంబంలో అయితే ఒక్కరు కూడా అక్షరాస్యులు లేరు. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగిన అన్నా చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. ఒకసారి వింటే ఇట్టే పట్టేసే అన్నా గ్రామంలోనే తొలి గ్రాడ్యుయేట్‌గా ఎదిగింది. నర్సింగ్‌ చదువుతోన్న సమయంలో ‘మిస్‌ టూరిజం కెన్యా’ కిరీటాన్నీ గెలుచుకుంది.

అందరూ తనలా చదవాలని...
 అన్నా స్వగ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. వీటి కారణంగా ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు చేసేవారు. ఆచారం పేరిట వారు చేసే అకృత్యాల మూలంగా అభం శుభం తెలియని ఆడపిల్లలు వైకల్యాల బారినపడేవారు. పద్నాలుగేళ్ల వయసులో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది అన్నా. వీటన్నింటిని చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన అన్నా ఈ మూఢాచారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకునేది. నర్సింగ్‌ డిగ్రీ అయిన తరువాత ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ బాల్యవివాహాలతో సహా పలు మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించేది. చదువుకోవడం కలిగే ప్రయోజనాలు స్వయంగా రుచిచూసిన అన్నా గ్రామంలోని మిగతా పిల్లలు తనలా చదువుకోవాలని బలంగా కోరుకునేది.

ఖబాలే దుబా ఫౌండేషన్‌..
 మూఢాచారాలను వ్యతిరేకించడంతోనే అన్నా ఆగిపోలేదు. గ్రామంలో ఎక్కువమందిని అక్షరాస్యుల్ని చేస్తే మూఢాచారాలను ఆపవచ్చని ... తొర్బి గ్రామంలోని పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ఖబాలే దుబా’ పేరిట పౌండేషన్‌ను స్థాపించింది. కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఆసుపత్రిలో విధులు ముగించుకున్న తరువాత మిగతా సమయాన్ని.. ఇతర టీచర్లతో కలసి తరగతులు చెప్పడానికి కేటాయించి వందలాదిమంది విద్యకు కృషిచేస్తోంది.

ప్రస్తుతం లిటరసీ కార్యక్రమంలో 150 మంది పిల్లలు, 100 మంది పెద్దవాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు లైంగిక, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పిస్తోంది. గ్రామంలోని పిల్లలకేగాక తన కుటుంబానికి చెందిన 19 మందిని కూడా చదివిస్తోంది అన్నా. 31 ఏళ్ల అన్నా డ్యూటీ, సామాజిక సేవాకార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఎపిడిమియాలజీలో మాస్టర్స్‌ చేస్తోంది.

బెస్ట్‌ నర్స్‌గా..
దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఆస్టర్‌ గార్డియన్స్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ సంస్థ గ్లోబల్‌ బెస్ట్‌ నర్స్‌ను ఎంపికచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపగా.. 24 వేలమందికిపైగా పోటీపడ్డారు. వేల మందిని వెనక్కు నెట్టి గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డుని గెలుచుకుంది అన్నా. ఈ అవార్డుకింద రెండున్నర లక్షల డాలర్లను గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

‘‘నేను ఈరోజు అవార్డును అందుకోవడానికి నా కుటుంబం, మా కమ్యునిటీల ప్రేరణే కారణం.
ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. మూఢాచారాలనుంచి భవిష్యత్‌ తరాలను కాపాడడమే నా లక్ష్యం. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదు  కెన్యాలో మరిన్ని స్కూళ్ల ఏర్పాటుకు, విస్తరణకు ఉపయోగపడుతుంది’’ అని అన్నా ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు