గొంతులో ఏదైనా ఇరుక్కుపోయిందా? పొరబోయిందా?

27 Dec, 2021 18:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పలకాబలపాలతో బడికి పోయే వయసులోనూ, అంతకంటే చిన్నప్పుడు ఆడుకునే ఈడులో తెలిసీతెలియక చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు... కొందరు చిన్నారులు ముక్కులో బలపం/చిన్నచాక్‌పీస్‌/చిన్న పెన్సిల్‌ వంటివి పెట్టుకుని, అది లోనికి వెళ్లేలా పీల్చడం లాంటి పనులు చేస్తుంటారు. మరికొందరు నాణేలను నోట్లో పెట్టుకుని మింగడం వల్ల అవి గొంతులో ఇరుక్కుని బాధపడుతుంటారు. గొంతులో ఇరుక్కునే చిన్నవస్తువులు ఇంకా ఎన్నో! ఆహారం అలా ఇరుక్కుంటే పొరబోయిందంటూ మన ఇళ్లలోని పెద్దలు అంటుంటారు. అలా జరిగినప్పుడు కాసేపు బాధగా ఉండి... అది బయటకు తన్నేసినట్లుగా ఒక్కోసారి ముక్కులోంచి కూడా వస్తుంటుంది. ఇలా గొంతులో బయటి వస్తువులు ఇరుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ప్రథమచికిత్సలను తెలుసుకుందాం. 

ముక్కు... నోరు... ఈ రెండింటికీ కొంత దూరం. కానీ గొంతులో రెండిటి మార్గం కాసేపు ఒకటే. ఆ తర్వాత గాలి... విండ్‌పైప్‌ ద్వారా ఊపిరితిత్తుల్లోకీ, ఆహారం ఫుడ్‌పైప్‌ ద్వారా కడుపులోకి వెళ్తుంది. గొంతులో గ్లాటిస్‌ అనే చోట ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన విండ్‌పైప్, ఆహారం తీసుకెళ్లే ఈసోఫేగస్‌ ఈ రెండూ మార్గాలూ ఒకేచోట ఉంటాయి. అయితే... ఇక్కడే ఎపిగ్లాటిస్‌ అనే పొర ఉండి...  మనం గాలిని పీల్చుకుంటున్న సమయంలో విండ్‌పైప్‌ మాత్రమే తెరచి ఉండేలా చూసి... ఆహారనాళాన్ని మూసి ఉంచుతుంది. అలాగే ఆహారాన్ని మింగుతున్నప్పుడు ఆహారనాళమే తెరచి ఉండేలా చూసి, విండ్‌పైప్‌ను మూసేస్తుంది. (చదవండి: బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం...)

అయితే ఒక్కోసారి మనం ప్రధానంగా నీళ్లూ లేదా ద్రవాహారాలు (కొన్నిసార్లు అన్నం వంటి ఘనాహారాలు కూడా) తీసుకునే సమయంలో అవి పొరబాటున విండ్‌వైప్‌లోకి వెళ్లిపోతాయి. దాంతో ఓ రక్షణాత్మకమైన చర్యలా... ఊపిరితిత్తుల్లోంచి గాలి ఫోర్స్‌గా బయటకు చిమ్ముకొచ్చినట్లుగా వస్తూ... ఆ పదార్థాలను బలంగా బయటికి నెట్టేస్తుంది. అలాగే చిన్నపిల్లలు తమ గొంతులో ఉండే పైప్‌ కంటే పెద్ద సైజులో ఉండే వస్తువులను తీసుకున్నప్పుడు అవి గొంతులోకి ఇరుక్కుపోతాయి. అప్పుడూ బలంగా దగ్గు, గాలి వచ్చినా... ఆ ఘన పదార్థలు గట్టిగా ఉండటంతో బయటకు నెట్టలేకపోతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... 

గొంతులో ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు  
► నాలుగేళ్ల లోపు పిల్లలకు పెద్ద క్యారట్‌ ముక్కలు, పెద్దగా ఉండే నట్స్, బాగా గట్టిగా ఉండే చాక్లెట్లు, పెద్ద గింజలుండే పండ్లను పెట్టకూడదు. ఒకవేళ తినిపిస్తే... వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్‌ చేశాక మాత్రమే ఇవ్వాలి లేదా క్యారట్‌ వంటి వాటిని తురిమి ఇవ్వాలి. వాటిని మెత్తగా నమిలి తినమని పిల్లలకు చెప్పాలి. 

► చిన్నపిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని పిల్లలు విరగొట్టడం చాలా సాధారణం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి. అంటే వాటి విడిభాగాలు నోట్లోకి దూరనంత పెద్దగా ఉండాలన్నమాట. చిన్న చిన్న పూసల్లాంటి విడిభాగాలతో ఉండే బొమ్మలను పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు తప్పకుండా  పక్కనే ఉండాలి. (గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!)

► పిల్లల ఉయ్యాలపై వేలాడదీసే రంగులరాట్నం వంటి బొమ్మలు వాళ్ల చేతికి అందనంత ఎత్తులో అమర్చాలి.

► పిల్లలు బెలూన్‌ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

► చిన్నారులు తమ మెడలోని  చైన్లను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున... బాగా సన్నటి చైన్‌లను, నెక్‌లేస్‌లను పిల్లల మెడలో వేయకూడదు.

► చిన్న పిల్లలు ఆడుకోడానికి నాణేలు, కాసులు ఇవ్వడం సరికాదు. 

గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి..

► ఏదైనా వస్తువు మింగిన చిన్నారి బాగా గట్టిగా దగ్గుతున్నా / గట్టిగా ఏడుస్తున్నా / మాట్లాడగలుగుతున్నా వారికి అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్లనే మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది.

► పిల్లలు చాలా బలహీనంగా దగ్గుతున్నా / ఊపిరితీస్తున్నప్పుడు సన్నటి శబ్దం  వస్తున్నా / ఏడుపుగాని, మాటగాని, గొంతులోంచి వచ్చే శబ్దంగాని చాలా బలహీనంగా ఉన్నా... వారు మింగిన వస్తువు గొంతులో బలంగా ఇరుక్కుపోయిందని తెలుసుకోవాలి. వస్తువు మింగిన చిన్నారి వయసు ఏడాదికి పైబడి ఉన్నప్పుడు వారికి ‘హీమ్‌లిచ్‌ మెనోవర్‌’ అనే ప్రథమ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. 

ఏడాది లోపు పిల్లలకు... 
► మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టిప్పుడు చిన్నారి తల కిందివైపునకు ఉండేలా చూడాలి. చేతులతో వీపుపై అకస్మాత్తుగా, బలంగా ఒత్తిడి కలిగించాలి. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను నడుము భాగం నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలించాలి. మన కాళ్ల ఒత్తిడికీ, చేతుల ఒత్తిడికీ పిల్లల పొట్ట ముడుచుకుపోవడం వల్ల... ఇరుక్కున్న వస్తువు పైకి ఎగబాకి, బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మనం కలిగించే ఒత్తిడి పిల్లలను గాయపరచనంత మృదువుగా మాత్రమే ఉండాలి.

► చిన్నారులు ఏదైనా వస్తువు మింగినప్పుడు వాళ్ల పొట్టపై రుద్దకూడదు. దానివల్ల పొట్టలోపల గాయాలయ్యే అవకాశం ఉంది.

► ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

► మింగిన వస్తువు పిల్లల నోటి నుంచి బయటకు వచ్చే వరకు తినడానికి గాని, తాగడానికి గాని ఏమీ ఇవ్వవద్దు.

తలపై తట్టకండి... 
► గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికి వీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులోకి రాగానే ఊసేయమని చెప్పాలి. అంతే తప్ప తలపై  తట్టకూడదు.

► గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని అనుమానించినప్పుడు పిల్లలు తమ  నాలుకను బాగా చాపేలా ప్రోత్సహించి, వేళ్లను గొంతులోకి పోనిచ్చి మన స్పర్శకు ఏవైనా తగులుతున్నాయేమో చూడాలి. వేళ్లకు ఏదైనా తగులుతుంటే మునివేళ్లతో వాటిని బయటకు తీసేయాలి.

ఎలా తీస్తారు? 
► పిల్లలు సహకరిస్తే... డాక్టర్లు లారింగోస్కోప్‌తో గొంతులో ఇరుక్కున్న పదార్థాన్ని తీసివేస్తారు. ఒకవేళ సహకరించకపోతే వారికి అనస్థటిక్‌ డాక్టర్‌ సహకారంతో కొద్దిగా మత్తు ఇచ్చి తొలగివంచవచ్చు.

► లారింగోస్కోప్‌ చేసి బల్బ్‌ ఉన్న ఎండోట్రాకియల్‌ ట్యూబ్‌ అనే దాని సహాయంతోగానీ లేదా బ్రాంకోస్కోప్‌ అనే పరికరం సహాయంతగానీ ఇరుక్కున్నదాన్ని తీసివేయవచ్చు. 

హీమ్‌లిచ్‌ మెనోవర్‌ ఎలా? 

► గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు చిన్నారి వెనకవైపున మనం నిల్చోవాలి. మన రెండు చేతులను పిల్లల పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా ఠక్కున కదిలించాలి. క్రమంగా ఆ పట్టును... పొట్టపై కింది భాగం నుంచి పై వైపునకు కదల్చాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది క్రమంగా పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్నే హీమ్‌లిచ్‌ మెనోవర్‌ అంటారు.

- డాక్టర్‌ జి. గంగాధర్‌
సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్, విజయవాడ.

మరిన్ని వార్తలు