Aparna Purohit: ‘అమ్మాయి మాకు చెప్పడం ఏమిటి!’ అనే అహం.. వివక్ష.. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ‘ఇండియన్‌ ఒరిజినల్స్‌’ హెడ్‌!

8 Dec, 2021 10:03 IST|Sakshi

స్ట్రగుల్‌ టు సక్సెస్‌

 అమెజాన్‌ సూపర్‌ ఉమన్‌

Aparna Purohit: Inspirational Journey Amazon Prime Video Originals Head: అపర్ణ పురోహిత్‌ తన స్వస్థలం దిల్లీ నుంచి ముంబైకి బయలుదేరే సమయంలో ఆమె దగ్గర మాస్‌కమ్యూనికేషన్‌ డిగ్రీ మరియు కొన్ని కలలు మాత్రమే ఉన్నాయి. అష్టకష్టాలు పడి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయింది. నసిరుద్దీన్‌ షా, భరత్‌బాలా... మొదలైన ప్రముఖుల దగ్గర పనిచేసింది.

ఆ సమయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఏ నటులకైనా సలహా, సూచనలాంటివి ఇస్తే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ‘అమ్మాయి మాకు చెప్పడం ఏమిటి!’ అనే అహం వారిలో కనిపించేది. అలా తొలిసారిగా ‘లింగవివక్ష’ అనేది చేదుగా పరిచయం అయింది. ఇలాంటివి ఇక్కడ ఎదురు కావడం సహజం అనే విషయంలో మానసికంగా ముందే సన్నద్ధం కావడం వల్ల పెద్దగా దిగులు అనిపించలేదు.

కొన్ని సంవత్సరాల తరువాత....
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, యూటీవీ మోషన్‌ పిక్చర్‌లో ఉద్యోగం  చేసినా... అవి తనకు సంతృప్తి ఇవ్వలేదు. తనను తాను నిరూపించుకునే అవకాశం అందులో కనిపించలేదు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ‘చార్‌యార్‌ ప్రొడక్షన్‌’ పేరుతో స్టోరీ టెల్లింగ్‌ బిజినెస్‌ మొదలుపెట్టింది. ఎంతో ఉన్నతం గా ఊహించుకుంది. కానీ ఒక్కటి కూడా నిజం కాలేదు. ఇలా అయితే లాభం లేదనుకొని పెద్ద నిర్మాతలను కలిసి ‘మా దగ్గర మంచికథలు ఉన్నాయి’ అని చెబితే ‘చూద్దాం’ అనేవారు. ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగింది.

అక్కడ కూడా ‘చూద్దాం’ అనే మాటే వినిపించేది. ఎన్ని రోజులు ఎదురుచూసినా... బౌండెడ్‌ స్క్రిప్ట్‌లోని కథలు నిర్మాతలు, దర్శకుల చెవి దగ్గరకు వెళ్లేవికాదు. మరోవైపు ఆర్థిక మాంద్యం...పిలవని పేరంటంలా వచ్చి పీకల మీద కూర్చుంది! ‘హాయిగా ఆ ఉద్యోగమేదో చేసుకోకుండా ఎందుకొచ్చిన కష్టాలు’ అంటూ స్నేహితుల వెక్కిరింపులు ఎదురయ్యాయి. 

‘అక్కడ ఉండలేవు. ఇంటికి వచ్చేయ్‌’ అన్నారు దిల్లీలోని తల్లితండ్రులు. భవిష్యత్‌ అగమ్యగోచరంగా కనిపించినప్పటికీ ‘ఎలాగైనా సరే ఇక్కడే ఉండాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. వెనక్కితగ్గేదే లేదు’ గట్టిగా అనుకుంది అపర్ణ. ఆ సమయంలో వాయిస్‌ వోవర్‌ నుంచి స్టోరీ డిస్కషన్‌లో పాల్గొనడం వరకు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రకరకాల పనులు చేసింది.‘ఈ పనులు జీవిక కోసం కంటే నా కలలు సజీవంగా ఉండడానికి చేశాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది అపర్ణ.

చదవండి: Bengal Woman: అర్ధరాత్రి దాటింది.. అయినా వెనుకాడలేదు.. దీదీ నీది మంచి మనసు!

కొన్ని నెలల తరువాత....
నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో కన్సల్టెంట్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తన జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎంతోమందితో మాట్లాడే అవకాశం లభించింది. వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకొని తనను తాను మెరుగుపరుచుకొనే అవకాశం దొరికింది.

ఈ క్రమంలోనే మహింద్రా గ్రూప్‌ ‘ముంబై మంత్ర మీడియా’లో క్రియేటివ్‌ హెడ్‌గా చేరింది. తరువాత...అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ‘ఇండియన్‌ ఒరిజినల్స్‌’ హెడ్‌గా బాధ్యతలు చేపట్టింది. ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ, బ్రీత్, కామిక్‌స్థాన్, ఇన్‌సైడ్‌ ఎడ్జ్, మీర్జాపూర్‌ అండ్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌’...ఇలాంటి ఇండియన్‌ కంటెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ కావడానికి ప్రధాన కారణం అయింది. ఫోర్బ్స్‌ ‘ఉమెన్‌ పవర్‌’ జాబితాలో చోటు సంపాదించింది. ‘సూపర్‌మెన్‌లు ఉంటారు. సూపర్‌ ఉమెన్‌లు ఎందుకు ఉండరు?’ అనే తమాషా ప్రశ్నకు అపర్ణ పురోహిత్‌ ఇచ్చిన జవాబు... ‘సూపర్‌ ఉమెన్‌ ప్రతిచోటా ఉంటారు’!

చదవండి: Ajay Roshan Lakra: ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటని అర్పిత... నాకోసం చంకలో బిడ్డను ఎత్తుకుని

>
మరిన్ని వార్తలు