తమిళనాడు గర్ల్స్‌ హైస్కూల్స్‌లో...మహిళా టీచర్లే మేలా!

13 Jun, 2021 04:37 IST|Sakshi

గర్ల్‌ హైస్కూల్స్‌లో మహిళా టీచర్ల నియామకమే లైంగిక వేధింపులకు జవాబా?

తమిళనాడు ఇప్పుడు టీచర్ల లైంగిక వేధింపులతో ఉడుకుతోంది. వరుసబెట్టి టీచర్ల లైంగిక దుశ్చర్యలను విద్యార్థినులు బయటపెడుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం చర్యలకు దిగింది.
ఇకపై గర్ల్స్‌ హైస్కూల్స్‌లో అందరూ మహిళా టీచర్లనే నియమించే ఆలోచన చేస్తోంది. అయితే అది సరైన నిర్ణయమేనా అని చర్చ జరుగుతోంది.

చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అంటారు. విద్యార్థినుల అమాయకత్వాన్ని, నిస్సహాయతను, బెదురును, భయాన్ని ఆసరాగా చేసుకుని వారిపై లైంగిక దుశ్చర్యలకు పాల్పడిన టీచర్లను ఇప్పుడా పాపం వెంటాడుతోంది. తమిళనాడులో ఇప్పటికి నలుగురు టీచర్లు అరెస్ట్‌ అయ్యారు. అయితే వీరిలో ఇద్దరు ఆ పాఠశాలల పూర్వవిద్యార్థుల ఫిర్యాదుల వల్ల కావడం గమనించాల్సిన విషయం. బ్యాచెస్‌ వెళ్లిపోయాయి... మనం బాధించిన విద్యార్థినులు ఇప్పుడు లేరు... మన పబ్బం గడిచిపోయింది అని కీచకచర్యలకు పాల్పడిన టీచర్లు ఎవరైనా అనుకుంటూ ఉంటే వారు ఇకపై మనశ్శాంతిగా ఉండే వీలులేదని, ఏ క్షణమైనా వారిపై పూర్వవిద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై వెంటనే చర్యలు ఉంటాయని తమిళనాడులో జరుగుతున్న ఉదంతాలు నిరూపిస్తున్నాయి.
 

మూడు వారాల క్రితం మొదలు
మూడు వారాల క్రితం చెన్నైలోని ప్రతిష్టాత్మక పద్మ శేషాద్రి బాలభవన్‌ స్కూల్‌ విద్యార్థినులు ఆ స్కూల్‌లో పని చేసే కామర్స్‌ టీచర్‌ రాజగోపాలన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినులతో పాటు చదివి బయటకు వెళ్లిన విద్యార్థినులు కలిసి సోషల్‌ మీడియాలో నేరుగా రాజగోపాలన్‌పై పోస్ట్‌ పెట్టడంతో దుమారం రేగింది. వెంటనే తమిళ సెలబ్రిటీలు చాలామంది విద్యార్థినుల రక్షణ గురించి, వాళ్లకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడటం మొదలెట్టారు. రాజగోపాలన్‌ తన ఆన్‌లైన్‌ క్లాసుల్లో కేవలం టవల్‌ కట్టుకుని హాజరవడం, వాట్సప్‌లో తప్పుడుగా వ్యవహరించడం ఇవన్నీ విద్యార్థినులు పెద్దలకు పోలీసులకు తెలియచేశారు. ఈ సంఘటనకు వచ్చిన మద్దతు చూశాక మెల్లగా ఇతర స్కూళ్లలో ఇలాంటి టీచర్ల వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వీటి ఫలితంగా మరో కామర్స్‌ టీచర్, ఒక పి.టి టీచర్, ఒక కేంద్రీయ విద్యాలయ టీచర్‌ అరెస్ట్‌ అయ్యారు. కేంద్రీయ విద్యాలయ టీచర్‌పై ఏకంగా 22 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

కీచక ఆలోచనలు
కీచక టీచర్లు విద్యార్థినులను వేధించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. స్కూల్‌ టైమ్‌ కంటే ముందు రమ్మని విద్యార్థినులను కోరడం, తల్లిదండ్రులు లేని సమయంలో పలకరింపుగా స్టూడెంట్‌ ఇంటికి వెళ్లడం, తండ్రి లాంటి వాణ్ణి అంటూ చనువుగా తాకడం, ఏదైనా క్యాంప్‌కు తీసుకెళ్లినప్పుడు అవకాశం తీసుకోవడం, ఫోన్లలో వీడియోకాల్స్‌లో అర్ధనగ్నంగా కనిపించడం... ఇవన్నీ విద్యార్థినులకు వేదన కలిగిస్తున్నాయి. కొందరు మాత్రమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళుతున్నారు. కొందరు స్కూలు యాజమాన్యాల దృష్టికి తీసుకువెళుతున్నారు. అయితే ఇలాంటి కీచక టీచర్లు విద్యార్థినుల వద్ద తప్ప మిగిలిన ప్రవర్తన అంతా ఆదర్శప్రాయంగా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉండటంతో మేనేజ్‌మెంట్‌లు అయోమయంలో పడటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇలాంటి ప్రవర్తన ఎదురుకాని ఇతర విద్యార్థినులు ‘సార్‌ మంచోడ’న్న కితాబు ఇస్తుండటంతో సమస్య వస్తోంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి టీచర్‌లో ఒకరికి మించి ఆరోపణలు చేస్తుండటంతో వారు ‘పోక్సో’ చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం తీవ్ర విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది.

నివారణ చర్యలు
తమిళనాడు ప్రభుత్వం జరుగుతున్న పరిణామాల పట్ల వెంటనే స్పందించింది. ప్రతి స్కూల్లో విద్యార్థినుల కోసం కమిటీలు వేయడం ఒక నిర్ణయంగా తీసుకుంది. అంతేకాదు, ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ గురించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్‌లైన్‌ క్లాసుల సమయంలో టీచర్లు కాని, విద్యార్థులు కాని స్కూళ్లలో హాజరైనట్టుగా ఫార్మల్‌ బట్టలు ధరించాలని చెప్పింది. అంతే కాదు... లైంగిక వేధింపుల నివారణకు ఇకపై అన్ని ప్రభుత్వ బాలికా పాఠశాలల్లో అందరూ మహిళా టీచర్లనే నియమించాలనే ఆలోచన కూడా చేస్తోంది. అయితే ఈ ఆలోచన చర్చకు తావిస్తోంది. అందరూ మహిళా టీచర్లనే నియమిస్తే విద్యార్థినులకు జెండర్‌కు సంబంధించిన వివేచన, స్పృహ బొత్తిగా తప్పిపోయే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ‘కేవలం మహిళలనే నియమించాలనే నియమం వల్ల మంచి టీచర్‌ కాకపోయినా స్త్రీ కాబట్టి నియమించే ప్రమాదం ఉంది’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మహిళా టీచర్లను నియమించడం కంటే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి కఠినమైన చట్టాల అమలు గురించి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది’ అని మరికొందరు అంటున్నారు.

గురువుకు సంస్కారం
సమాజంలో గురువుకు ఉన్న స్థానం మరెవరికీ లేదు. తల్లితండ్రి తర్వాత గురువునే పూజించాలని మన ధర్మాలు చెబుతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలు గడిపేది గురువుతోనే. గురువుల వ్యక్తిత్వం, ప్రవర్తన పిల్లలపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. తాము గౌరవించే గురువుల్లో ఒకరిద్దరైనా సరే తమ పట్ల మలినంగా వ్యవహరిస్తే వారి మనసులకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది. అయితే గురువుల ఎంపిక గురించి ఇప్పుడు మేనేజ్‌మెంట్లకు ఎలాంటి పట్టింపు ఉంది అనేది చర్చనీయాంశం. సబ్జెక్ట్‌లో బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కాని వారి వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంది, వారు ఏ పుస్తకాలను చదివారు, ఏ భావధారను కలిగి ఉన్నారు, ఏ విలువలు ప్రదర్శిస్తున్నారు అనేది గమనించే అవకాశం లేదు. సాహిత్య స్పర్శ, సామాజిక స్పృహ ఉన్న గురువుల సంఖ్య చాలా తక్కువ ఉంటోందని గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి చూసే వారు అంటుంటారు. విద్యార్థులకు సత్ప్రవర్తనను నూరి పోసే గురువుల సదాచారాల ఉన్నతి కోసం సంస్థాగతమైన శిబిరాలు, శిక్షణల గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంటుంది.

గురువు అనే అద్దం నుంచే ఈ సమాజం అనే ప్రతిబింబం పుడుతుందని గురువులందరూ అర్థం చేసుకుంటే విద్యార్థుల నుంచి వారికి సదా జేజేలే అందుతాయి.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు