Tokyo 2020: టోక్యో ఒలింపిక్స్‌.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది

15 Jul, 2021 01:53 IST|Sakshi
సిమ్రాన్‌ శర్మ : టోక్యో ప్యారా ఒలింపిక్స్‌కు ఎన్నికైన ట్రాక్‌ ఈవెంట్‌ అథ్లెట్‌

తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేలా సిమ్రాన్‌ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం.

ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్‌కి వెళుతోందని సిమ్రాన్‌ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్‌ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల ట్రాక్‌ ఈవెంట్‌కు సిమ్రాన్‌ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్‌ శర్మ!


ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్‌.ఎస్‌.) జూన్‌ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్‌ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్‌ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్‌. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్‌.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్‌’.
∙∙
సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్‌ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్‌కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్‌ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్‌.ఎస్‌.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్‌ చేశాడు! అదే గ్రౌండ్‌లో ఆమెను ఒలింపిక్స్‌కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు.

అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్‌ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్‌. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు.
∙∙
భర్త ఆమె వ్యక్తి గత కోచ్‌ అయితే, ఆంటోనియో బ్లోమ్‌ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్‌. కోచ్‌! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్‌లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్‌ దుబాయ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్‌ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్‌ మీద ఉన్నారు. సిమ్రాన్‌ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్‌ చైనా గ్రాండ్‌ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్‌లోనే జరిగిన వరల్డ్‌ పారా గ్రాండ్‌ ప్రిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్‌. టోక్యో ఒలింపిక్స్‌తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు.                                          


సిమ్రాన్‌ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు.

మరిన్ని వార్తలు