వీరుడొకడు అమరుడయ్యాడు

10 Nov, 2020 07:59 IST|Sakshi

‘అమరుడు’ అనిపించుకునే అదృష్టం అందరి నుదుటునా రాసి ఉండదు. కోట్ల జనులు శాల్యూట్‌ చేసే ఘనత అందరికీ దొరకదు. చరిత్ర పుటల్లో సగర్వంగా తలుచుకునే పేరుగా నిలవడం అందరి వశం కాదు. ప్రవీణ్‌ కుమార్‌ వంటి సైనికుడికే ఆ గౌరవం సాధ్యం. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల పోరులో చిత్తూరు జిల్లా పరాక్రమవంతుడు ప్రవీణ్‌ కుమార్‌ ప్రాణాలు కోల్పోయాడు. వారితో సీమ పులిలా పోరాడి ప్రాణాలర్పించాడు. తెలుగుజాతితో పాటు దేశ ప్రజలూ అతణ్ణి గుర్తు పెట్టుకుంటారు. 

ప్రవీణ్‌ కుటుంబ నేపథ్యం.... 
చిత్తూరు జిల్లా ఐరాలమండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (37). మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్‌ 2009లో అదే మండలంలోని ఐలవారిపల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువు రామచంద్రారెడ్డి (రిటైర్ట్‌ఆర్మీ) కుమార్తె రజితతో పెళ్లి జరిగింది. వీరికి  రోహిత, లీలేష్‌లు కుమార్తె కుమారుడు. కుమార్తె రోహిత రెండవ తరగతి. దేశ సేవచేస్తానని పట్టుబట్టి పద్దెనిమిదవ ఏటే మిలటరీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని చెప్పేవాడు. చివరికి మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ప్రాణాలు కోల్పోయాడని బాధగా ఉన్నా దేశం కోసం అశువులు బాసినందుకు గర్వంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే ఫోన్‌ చేశాడు. ‘నాన్నా.. అమ్మ జాగ్రత్త. కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లొద్దు. సంక్రాంతికి వస్తున్నా. అందరం కలుద్దాం’ అని చెప్పాడు. తను చెప్పినట్టే సంక్రాంతికి వస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. దేశంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం గుమ్మం ముందు ఉండేవాడు...’’ దుఃఖంతో పూడుకుపోయింది ఆ తండ్రి గొంతు. జమ్ము కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్‌ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి సాక్షికి చెప్పిన మాటలివి. 

తన కుమారుడి గురించి ఆయన మాటల్లో...
‘నా కొడుకు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డికి చిన్నతనం నుంచి పట్టుదల ఎక్కువ. రెడ్డివారిపల్లెలో  బడికి పోయేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు. ఐరాలలో ఇంటర్‌ వరకు చదివాడు. ఆ తరువాత నాకు చేదోడు వాదోడుగా సేద్యం పనులు చేసేవాడు. మిలటరీలో పనిచేస్తున్న బంధువులను చూసి దేశానికి సేవచేయాలని పట్టుబట్టాడు. ఆర్మీలో చేరేందుకు కబురొచ్చింది. 2002 ఊటీలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌లో పాల్గొన్నాడు. ఊటీలోనే సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని కప్పూర్‌తలాలో విధుల్లో చేరాడు. రెండేళ్లు పని చేశాక అస్సాంకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణాటకలోని బెల్‌గామ్‌లో ఆరు నెలలపాటు కమాండెంట్‌గా శిక్షణ పొందాడు. 2012–2016 వరకు ఢిల్లీలోని నేషనల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌)లో విధులు నిర్వహించాడు. అక్కడినుంచి మళ్లీ 2017–18వరకు జమ్మూలోని మీరాన్‌ సాహెబ్‌ ప్రదేశంలో పనిచేశాడు.

2019 సంవత్సరంలో పాకిస్థాన్‌ సరిహద్దులో అడుగుపెట్టి ఒక సైనికుడు చేరవలసిన అసలైన చోటుకు చేరానని గర్వపడ్డాడు. దేశ సరిహద్దు ఎప్పుడూ మంచు దుప్పటితో కప్పబడి ఉండటంతో శత్రువుకు అవకాశం ఇవ్వకూడదని కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారట. కంటిపై రెప్ప వాలనివ్వకుండా దేశరక్షణకు కాపలా కాశానని చెప్పేవాడు. చివరకు జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్‌ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందటంతో ముందు మాకు నోటమాట రాలేదు. ఎంత దిగమింగుదామనుకున్నా కన్నీళ్లు  ఆగడం లేదు. అమర సైనికుడికి కడసారి వీడ్కోలు పలకటం కోసం కుటుంబ సభ్యులమైన మేము, గ్రామస్తులు, అతడి స్నేహితులు కన్నీటితో ఎదురు చూస్తున్నాం’ అన్నాడాయన.
– బాలసుందరం, సాక్షి చిత్తూరు రూరల్‌ 

మరిన్ని వార్తలు