అర్పిత.. స్ఫూర్తి ప్రదాత

31 Aug, 2021 01:45 IST|Sakshi

మొన్నటి ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు, ఇతర పతకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతోన్న పారా ఒలింపిక్స్‌లోనూ మేమేం తక్కువ కాదన్నట్లు ... పారా ఒలింపిక్‌ క్రీడాకారులు మరింత కసితో ఆడుతూ ప్రతి ఆటలో పతకాన్ని ఖాయం చేస్తున్నారు. వైకల్యాలకు ఎదురొడ్డి పోరాడుతూ పతకాల సంఖ్యను పెంచుతున్నారు. అయితే వీళ్లలా ఆ స్థాయికి వెళ్లనప్పటికీ, రెండు కాళ్లు కోల్పోయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పితా రాయ్‌ మొక్కవోని ధైర్యంతో కృత్రిమ కాళ్లతో నడవడం నేర్చుకుని యోగా ట్రైనర్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

అది 2006 ఏప్రిల్‌ 22 కోల్‌కతాలో కొన్ని వస్తువులు కొనేందుకు తన ఫ్రెండ్‌ బైక్‌ మీద కూర్చుని వెళ్తోంది అర్పితా రాయ్‌. బ్యారక్‌పూర్‌లోని తన ఇంటి నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాక.. ఒక సెకను లో అర్పిత జీవితం అనూహ్యంగా తలకిందులైపోయింది. ఒక పెద్ద లారీ వచ్చి వారి బైక్‌ను గుద్దింది. ఆ స్పీడుకు అర్పిత కిందపడిపోవడం... ఆమె కాళ్ల మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో... ఆమె కాళ్లు నలిగిపోయాయి. ఆ దరిదాపుల్లో ఉన్న వారు వచ్చి రోడ్డుకు అవతలివైపు ఉన్న ఆసుపత్రిలో అర్పితను చేర్చారు. అక్కడ పెయిన్‌ కిల్లర్స్‌ మాత్రమే ఇచ్చి, శస్త్రచికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించమన్నారు.

వేరే ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేస్తే కాళ్లు వస్తాయని డాక్టర్లు చెప్పినప్పటికీ ... అర్పిత తల్లిదండ్రుల వద్ద ఆ సమయంలో ఆపరేషన్‌కు సరిపడా డబ్బులు లేక, వాటిని సమకూర్చుకోవడానికి 12 రోజుల సమయం పట్టింది. దీంతో కాళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకి రెండు కాళ్లను తీసేశారు. అంతేగాక ఎనభైశాతం శరీరానికి గ్యాంగ్రిన్‌ సోకడంతో నాలుగు నెలలపాటు ఆసుపత్రిలోనే ఉంది. తన కాళ్లమీద తాను నిలబడి ధైర్యంగా బతకాల్సిన 20 ఏళ్ల అమ్మాయి రెండు కాళ్లనీ కోల్పోయింది. అయినప్పటికీ కృత్రిమ కాళ్లను అమర్చుకుని తను ఎవరి మీదా ఆధారపడ కూడదని నిర్ణయించుకుంది. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ పదిహేనేళ్లు. ఇప్పుడు అర్పిత కృత్రిమ కాళ్లతో నడవడమేగాక, యోగా కూడా చేస్తుంది.

రోజూ గంట నిల్చొని...
ఆపరేషన్‌ తరువాత రోజూ గంటపాటు నిలుచోమని డాక్టర్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల శరీర ఆకృతి కరెక్టు వస్తుందని చెప్పడంతో అలా చేసేందుకు ప్రయత్నించేది. దాని వల్ల అర్పితకు చాలా నొప్పిగా అనిపించేది. అయినప్పటికీ అంతటి నొప్పిని ఓర్చుకుని, అనేక ప్రయత్నాల తరువాత తన కాళ్ల మీద తను నిలబడింది. నడవడం నేర్చుకున్న తరువాత 2007లో కాల్‌ సెంటర్‌లో ఉద్యోగంలో చేరింది. రెండున్నరేళ్లు పనిచేసి, పెళ్లి అవడంతో ఉద్యోగం మానేసింది.

యోగా ట్రైనర్‌గా...
కాల్‌ సెంటర్‌లో పనిచేసేటప్పుడు సహోద్యోగులు చూసే చూపులు తనని తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. మెట్టు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా కష్టంగా అనిపించేది. ఈ క్రమంలోనే యోగా చేయడం ద్వారా శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచడమేగాక, ఫిట్‌గా ఉండవచ్చని భావించి 2015లో యోగా చేయడం ప్రారంభించింది. తొలిదినాలలో యోగా చేయడం బాగా కష్టంగా అనిపించినప్పటికీ కఠోర శ్రమపడి నేర్చుకుంది. ఆసనాలు పర్‌ఫెక్ట్‌గా వేయడం వచ్చాక... 2019 లో తనే ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. కరోనా రాకముందు 25 మందికి ఆసనాలు వేయడం నేర్పించేది.

వీరిలో వికలాంగులు కూడా ఉన్నారు. యోగా ట్రైనర్‌గా అర్పితకు మంచి గుర్తింపు రావడంతో తన యోగా క్లాసుల వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ప్రారంభించింది.‘రాయ్‌ అర్పితా యోగా’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి తన యోగా ట్రైనింగ్‌ సెషన్స్‌తో కూడిన వీడియోలను పోస్ట్‌ చేస్తోంది. ఈ వీడియోలకు ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు వస్తుండడంతో అర్పిత మరింత ఉత్సాహంతో దాదాపు ఆరేళ్లుగా యోగా తరగతులు చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.  

మరిన్ని వార్తలు