కృష్ణాష్టమి: నేడూ, రేపూ కూడా జరుపుకోవచ్చు

30 Aug, 2021 05:26 IST|Sakshi

ఆయన రూపం నల్లనిది. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది. దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి నమ్మకంగా నిలిచాడు శ్రీ కృష్ణ భగవానుడు. అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. సచ్చిదానంద రూపం. ఆనంద స్వరూపం.  కృష్ణుడి పేరు తలుచుకుంటేనే జవసత్వాలు ఉట్టి పడతాయి. ఆయన చరితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఆయన తత్త్వాన్ని తెలుసుకుందాం.

ఆనందతత్వం... ప్రేమతత్వం... స్నేహతత్వం... ప్రకృతితత్వం... నాయకత్వం... ఇవే ఆయన లక్షణాలు. కృష్ణ తత్వం చదివిన వారికి నిజమైన ప్రేమ తత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా స్త్రీలతో పరుషంగా మాట్లాడినట్లు చూడం. ఆయన రాధాదేవి ప్రేమామృతంలో ఓలలాడాడు. గోపికల మదిలో వారి ఇష్టసఖునిగా కొలువుదీరాడు. రుక్మిణి దేవి భక్తి ఆరాధననూ ఆనందించాడు. సత్యభామ గడసరి తనం, శక్తివంతమైన మహిళగా ఆమెపట్ల కూడా అదే సున్నిత్వాన్ని కనబరిచాడు. లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే స్త్రీలు ఎప్పుడు అచలంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వాన్ని ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహా దేవుడు అయినా ఏ ప్రత్యేకత లేకుండా అందరితోటీ అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది.

శిఖి పింఛ మౌళి
నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు.

వేణు సందేశం
అలాగే మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, యుద్ధరంగాన కర్తవ్య విమూఢుడై వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...ఆయన మోము మీద చిరునవ్వు చెదరలేదు. అందుకే ఆయన పరమాత్ముడయ్యాడు. ఆ చిరునవ్వుల సమ్మోహన రూపాన్ని మనసులో నిలుపుకుంటే మనమూ ఆనందంగా ఉండగలం. 

స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే... వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు. అందువల్లే కృష్ణాష్టమి విషయంలో కొద్దిపాటి సందేహం తలెత్తుతుంటుంది. స్మార్తులను, వైష్ణవులను దృష్టిలో పెట్టుకుంటే నేడూ, రేపూ కూడా ఆ పర్వదినాన్ని జరుపుకోవచ్చు. 
– డి.వి.ఆర్‌. 


ఆత్మ ధర్మం
మార్పు చెందని గుణానికే ‘ధర్మం’ అని పేరు. అలా ప్రతి ఒక్కదానికీ మార్పుచెందని ధర్మమంటూ ఒకటుంటుంది. అలాగే ఆత్మకుండాల్సిన ధర్మాన్ని శ్రీచైతన్య మహాప్రభు ఇలా వివరించారు: ప్రతి జీవుని ధర్మం సేవించడమే. ఒక తల్లి తన బిడ్డను సేవిస్తుంది. పిల్లాడు తల్లిదండ్రులను సేవిస్తాడు. తండ్రి కుటుంబాన్ని సేవిస్తాడు, లేదా ఒక కార్యాలయంలోని యజమానిని సేవిస్తాడు. ఒక మంత్రి తన శాఖను సేవిస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రధానమంత్రి ఒక దేశాన్ని సేవిస్తూ వుంటారు. అయితే, పై సేవలేవీ శాశ్వతమైనవి కావు. కాని, భగవంతుని సేవ మాత్రం శాశ్వతమైనది. ఎందుకంటే, భగవానుడు ఒక్కడే శాశ్వతుడు గనుక. ఆ భగవానుడిని సేవించడమే నిజమైన ధర్మం. 

శ్రీ కృష్ణుడిని సేవించడం ఎలా?
భగవంతుడైన శ్రీ కృష్ణుడిని సేవించడమే ఆత్మను సంతృప్తిగావించు ధర్మం. అట్టి సేవ లౌకిక స్వలాభాపేక్ష రహితమై వుండాలి. సకల సర్వావస్థల్లోనూ శ్రీ కృష్ణుని సేవించగలగాలి. అటువంటి నిరంతరాయమైన, నిరపేక్షమైన సేవయే ఆత్మను, హృదయాన్ని పరిపూర్ణంగా సంతృప్తిపరచగలదు. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు ప్రబోధించినట్లు... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మహా మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా ప్రతిరోజూ 16 మాలలు జపించగలిగితే శారీరక, హృదయ దౌర్బల్యాలనుంచి విముక్తులమై భగవంతుని సేవలో ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని పొందగలం.
 శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభు
అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు