అక్షరాలా సాహితీ స్రవంతి

21 Sep, 2020 01:32 IST|Sakshi

స్మరణ

ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను ఒకే మక్కువతో అధ్యయనం చేసి ఒంటబట్టించుకున్న సాహితీవేత్త, వాటిని అదే అనురక్తితో విద్యార్థులకు బోధించిన ఉపన్యాసకుడు, సద్విమర్శకుడు, కథకుడు, నవలాకారుడు, స్నేహశీలి, అతనే ఎమ్వీయల్‌గా సుప్రసిద్ధుడైన మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు. మచిలీపట్టణం దగ్గర చిట్టిగూడూరులో పదవ తరగతి; ప్రీయూనివర్సిటీ, డిగ్రీ బందరు హిందూ కళాశాలలో పూర్తి చేసుకుని ఎంఏ తెలుగు ప్రధానాంశంగా ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. ఇక్కడ చేరటానికి ప్రధాన హేతువు సి.నారాయణరెడ్డి మీద ఉన్న అవ్యాజమైన ఆరాధన. తన ప్రతిభతో, సృజనతో ఆయనకు ప్రియశిష్యుడయ్యాడు. సాహితీ దిగ్దంతులైన దివాకర్ల వెంకటావధాని, నిడదవోలు వెంకట్రావు ఎమ్వీయల్‌లోని పరిశోధనా నేత్రాన్ని తెరిచారు. 
ఎంఏ చదువుతున్నప్పుడే నవత పత్రిక నిర్వహణలో భాగస్వాములయ్యారు. ఉస్మానియా చేపట్టిన మహాభారతం ప్రాజెక్టులో రీసెర్చి అసిస్టెంటయ్యారు. ఆరుద్ర వాత్సల్యాన్ని పొంది ఆయన ఇంట్లో ఓ బిడ్డలా ఉండి, ఆయనకు సమగ్రాంధ్ర రచనలో సహకరించారు. 1966లో నూజివీడులోని ధర్మ అప్పరాయ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా అడుగుపెట్టారు. తనలోని సాహితీ మల్లెతీగకు కళాశాలను ఆలంబనగా చేసి సాహితీ సుగంధాలను పరివ్యాపింపజేశారు. కవులు, రచయితలు నూజివీడులాంటి చిన్న పట్టణానికి వచ్చారంటే అది ఎమ్వీయల్‌ మీద వారికున్న అభిమానమే. 

గురజాడ పుట్టిన నెల, తేదీన ఆయన జన్మించటం కాకతాళీయమే. గురజాడ సాహిత్యాంశను పుణికిపుచ్చుకున్నారనిపిస్తుంది. సుమారు ముప్పై కథలు రాశారు. హాస్య ప్రధానాంశంగా సాగినా వ్యంగ్యం అంతర్వాహినిగా ఉంటుంది. హాయిగా సాగే కథనం, అలరించే శైలి. నిన్న స్వప్నం– నేటి సత్యం, మలుపు– మెరుపు అనే రెండు నవలలు రాశారు. ముళ్లపూడి వెంకటరమణ తెలుగు భాషా విన్యాసానికి ముగ్ధుడై ఆయన జీవితాన్ని కానుక అన్న పేరుతో నవలీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ వారికి పారిజాతాపహరణం, ఆముక్త మాల్యద, మనుచరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మహాత్మ్యాలను లఘుపరిచయాలుగా రాశారు. పంచకావ్యాలను సరళమైన శైలిలో తెలియజెప్పటం వీటి ఉద్దేశం. ‘ఉడుగర’, ‘యులిసిస్‌’, ‘కవన కదనం’ అనే కవితా సంకలనాలను వెలువరించారు. నండూరి ‘ఎంకి పాటలు’, విశ్వనాథ ‘కిన్నెరసాని’, సినారె ‘కర్పూర వసంతరాయలు’, సోమరాజు ‘పొద్దు’ కావ్యాలలో సొగసును ‘కవితాహారతి’గా అందించారు. అనేక సాహిత్య వ్యాసాలను రచించి రసజ్ఞులను మెప్పించారు. ఎన్నో పత్రికలలో పుస్తక సమీక్షలు రాశారు. రేడియో ప్రసంగాలు చేశారు. ప్రతిబింబం– మిధ్యాబింబం, రాదారి బంగళా అన్న నాటకాలను రాశారు.
ఆయన సాహితీ మూర్తిమత్వంలోని ఒక పార్శ్వం సాహిత్యపు సుగంధాలను వెదజల్లింది. మరొక పార్శ్వం సినిమాలపై ఉన్న మక్కువ. అమ్మమ్మ చూపిన సినిమారుచి ఆయనను సినిమాలను అధ్యయనం చేయించింది. ‘మంచి పుస్తకంలాగే మంచి సినిమా కూడా జీవితమంతా పరిమళిస్తుంది’అని వ్యాఖ్యానించేటట్లు చేసింది. సినిమాలలోని మంచిచెడులను చక్కని ‘పదబంధాల ఫ్రేము’లలో చూపించేవారు. మాయాబజార్‌ అంటే చెప్పలేనంత పరవశం. సినిమాలకు సంభాషణలు రాశారు. కొన్ని పాటలు రాశారు. నిర్మాతగా ముత్యాలముగ్గుకు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకున్నారు. స్నేహం, గోరంత దీపం, ఓ ఇంటి బాగోతం సినిమాలను వెండితెర వెలుగులనే పేరుతో నవలలుగా రాశారు. ‘పదబంధాల కెమెరాతో’ చదువరులకు దృశ్యమానం చేశారు. మంచి సినిమాల స్క్రిప్టులను పాఠ్యాంశాలుగా పెట్టాలనేవారు.

డెబ్బయ్యో దశకంలో యువజ్యోతి అనే శీర్షికను నిర్వహించారు. చిలిపి ప్రశ్నలకు చిలిపిగానూ, ఇరుకునపెట్టే ప్రశ్నలకు సమయస్ఫూర్తితోనూ, సాహితీపరమైన వాటికి సాహితీ ప్రజ్ఞతోనూ సమాధానాలిచ్చేవారు. ‘భాష ముఖ్యమా, రాయాలన్న తపన ముఖ్యమా’ అన్న అయోమయంలో ఉన్న యువకవులకు ‘భాష కన్నా భావం ముఖ్యం. రాశాక సర్దుకోవచ్చు. కాబట్టి రాయండి’ అన్న సమాధానం ఎంతో స్ఫర్తినిచ్చింది. రవ్వంత కవితాస్పృహ పోకడలున్న యువతను ప్రోత్సహించి వారి కవితలను ప్రచురించేవారు. మినీ కవితా ప్రక్రియ శక్తిని గుర్తెరిగి దానికి విశేష ప్రచారాన్ని కల్పించారు. ‘తిక్కన్న పొదుపు, పోతన్న వొడుపు, వేమన్న మెరుపు’ మినీ కవితకు త్రిదళాలని చెప్పారు. తను శవమై/ ఒకరికి వశమై/ తనువు పుండై/ ఒకరికి పండై/ ఎప్పుడూ ఎడారై/ ఎందరికో ఒయాసిస్సై అన్న అలిశెట్టి ప్రభాకర్‌ వ్యక్తీకరణకూ; కన్ను తెరిస్తే జననం/ కన్ను మూస్తే మరణం/ రెప్పపాటే ఈ ప్రయాణం అన్న చంద్రసేన్‌ వ్యక్తీకరణకు పులకించి తన ‘మాటల పల్లకి’ లో ఊరేగించారు. జ్యోతిచిత్ర వారపత్రికలో నిర్వహించిన వాణి ముత్యాలులో సినిమా పాటల్లోని సాహితీ విలువలను, మర్మాలను రమణీయంగా చెప్పారు.

స్నేహం రంగు, రుచి, రూపం తెలిసినవాడు ఎమ్వీయల్‌. ఆయనతో స్నేహం చేసిన వారందరికీ దాని మాధుర్యం, మార్దవం, చల్లదనం అనుభవంలోకి వస్తాయి. ‘కాదేదీ కవిత కనర్హం’ అని శ్రీశ్రీ అంటే, ‘కారెవరు స్నేహానికనర్హం’ అంటారు ఎమ్వీయల్‌. మహాప్రస్థానం కంఠతా వచ్చిన ఓ రిక్షానడిపే మనిషితో స్నేహం చేశారు. ఎమ్వీయల్‌ ఓ సాహితీ స్రవంతి. ప్రవహించిన చోట సాహితీ సిరులే. నది తను ప్రవహిస్తున్న ప్రాంతపు విస్తీర్ణం, వైశాల్యాన్ని బట్టి తన ప్రవాహపు తీరును, వేగాన్ని మార్చుకుంటుంది. అలా తను గ్రోలిన సాహితీ సుధను ఎందరికో పంచారు ఎమ్వీయల్‌.
బొడ్డపాటి చంద్రశేఖర్‌

మరిన్ని వార్తలు