వెంటిలేటర్‌ మీదికి వెళ్తే ఇక బతకరా.. ఎంతవరకు నిజం?

9 Apr, 2021 00:09 IST|Sakshi

వెంటిలేటర్‌ మీద పెట్టిన పేషెంట్‌ ఇక బతకరనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్‌ మీద పెడతారు. ఇటీవల కరోనా ప్యాండమిక్‌ స్వైరవిహారం చేస్తున్న తరుణంలోనూ చాలామంది వెంటిలేటర్‌పైకి వెళ్తున్నారు. కోమార్బిడ్‌ కండిషన్స్‌తో ఉన్నవారు కరోనా వైరస్‌ కారణంగా వెంటిలేటర్‌ మీదికి వెళ్లాక కొందరు మృత్యువాతపడుతుండటంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం మరింత బలంగా మారింది. 

నిజానికి ఇప్పుడున్న  వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్‌ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కరోనా వ్యాధిగ్రస్తుల్లోనూ చాలామంది వెంటిలేటర్‌ మీద వెళ్లాక కూడా బతుకుతున్నారు. వెంటిలేటర్‌ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్‌ పాళ్లు తక్కువగా ఉండటం, కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాళ్లు పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్‌ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్‌ పాకే సెప్సిస్‌ వంటి కండిషన్‌లలో వెంటిలేటర్‌ పెడుతుంటారు. ఇటీవల కరోనా కారణంగా ఊపిరి అందని పరిస్థితి వచ్చిన సందర్భాల్లోనూ రోగిని వెంటిలేటర్‌పై ఉంచడం సాధారణంగా జరుగుతోంది.

ఒకసారి వెంటిలేటర్‌ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్‌ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్‌ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్‌ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. కానీ వైద్యపరమైన అంశాలలో మనలో చాలామందికి తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఆ అపోహలను తొలగించుకంటే... వెంటిలేటర్‌పైకి వెళ్లినప్పటికీ... ఆ చికిత్స తర్వాత బతికేవాళ్లే ఎక్కువనే వాస్తవం తెలిసివస్తుంది.  

మరిన్ని వార్తలు