కృత్రిమ మేధ: మన నట్టిళ్లల్లోకి..

13 Dec, 2020 10:18 IST|Sakshi

కృత్రిమ మేధ అంటే ఒకప్పుడు అదేదో శాస్త్ర సాంకేతిక నిపుణుల వ్యవహారంగా ఉండేది. ఇప్పుడు కృత్రిమ మేధ మన నట్టిళ్లల్లోకి, మన వంటిళ్లల్లోకి కూడా వచ్చేసింది. కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు పిల్లలను ఆడిస్తున్నాయి. ఇళ్లను శుభ్రంగా ఉంచడంలో సాయపడుతున్నాయి. వంటింటి పనుల్లోనూ తమవంతు సాయం చేస్తున్నాయి. మొత్తానికి కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు ఇంటి పనులను మరింతగా సులభతరం చేస్తున్నాయి.

మనిషి మేధస్సులోని కొన్ని లక్షణాలతో రూపొందినదే కృత్రిమ మేధ. మనుషుల మాటలను, వారి హావభావాలను అర్థం చేసుకోవడం, ఆదేశాలకు అనుగుణంగా స్పందించడం, స్వయంచాలకత వంటి లక్షణాలతో కూడిన కృత్రిమ మేధ– అదే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సృష్టి కోసం గత శతాబ్దిలోనే పునాదులు పడ్డాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌– 1955 నాటికి ఒక అకాడెమిక్‌ డిసిప్లిన్‌గా రూపొందింది. తొలినాళ్లలో దీనిపై జరిపిన ప్రయోగాలు విఫలమవడంతో దీనికి నిధులు నిలిచిపోయాయి. కొన్నేళ్ల స్తబ్దత తర్వాత జరిపిన ప్రయోగాలు కొన్ని విజయవంతం కావడంతో మళ్లీ దీని కోసం నిధులు రావడం మొదలైంది. ప్రస్తుత శతాబ్ది నాటికి కృత్రిమ మేధ మానవ మేధతో పోటీ పడే స్థాయికి చేరుకుంది.

కృత్రిమ మేధతో రూపొందిన ‘ఆల్ఫాగో’ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్, 2015లో ‘గో’ అనే స్ట్రాటజీ బోర్డ్‌గేమ్‌లో ఆరితేరిన ఆటగాడిని ఓడించింది. ఈ ఘనవిజయం కృత్రిమ మేధకు ఊపునివ్వడంతో, ఇది వివిధ రంగాలకు శరవేగంగా విస్తరించడం మొదలైంది. చివరకు ఇళ్లలోని రోజువారీ పనిపాటల్లోకీ ఇప్పుడిది దూసుకొస్తోంది. ఇప్పటి వరకు ఇళ్లలో ఉపయోగపడే సర్వసాధారణమైన ఎలక్ట్రిక్‌ వస్తువులకు దీటుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి సంపన్నుల ఇళ్లకే పరిమితంగా కనిపిస్తున్నా, సమీప భవిష్యత్తులోనే ఇవి సామాన్యులకూ అందుబాటులోకి రానున్నాయనే అంచనాలు ఉన్న నేపథ్యంలో కృత్రిమ మేధతో పనిచేసే ఇంటి వస్తువులు కొన్నింటి గురించి పరిచయం.

క్లీనింగ్‌ రోబోలు
ఇంటిని రోజూ చీపురుతో ఊడ్చడం, నేల మీద చెత్తా చెదారం లేకుండా శుభ్రపరచడం, నేలను తడిగుడ్డతో లేదా మాప్‌తో తుడవడం వంటివన్నీ శ్రమతో, కొంత చికాకుతో కూడుకున్న పనులే. చెత్తను శుభ్రం చేయడానికి ఎలక్ట్రిక్‌ వాక్యూమ్‌ క్లీనర్లు కొన్నాళ్లుగా వాడుకలోకి వచ్చాయి. అయితే, ఎవరో ఒకరు దగ్గర ఉండి చూసుకుంటే తప్ప ఇవి పనిచేయలేవు. ఆ సమస్యను కూడా దూరం చేసేలా ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబో వాక్యూమ్‌ క్లీనర్లు, మాప్‌లు వచ్చేశాయి. ఉదాహరణకు ‘ఐరోబోస్‌’ తయారు చేసిన ‘రూంబా’ రోబో వాక్యూమ్‌ క్లీనర్, ఇదే సంస్థ తయారు చేసిన ‘బ్రావా’ మాప్‌ ఇలాంటివే. ‘రూంబా’లోని మల్టీసర్ఫేస్‌ బ్రష్‌లు నేల మీద, కార్పెట్ల మీద ఉన్న అతిచిన్న చెత్తకణాలను కూడా సమర్థంగా ఏరివేస్తాయి. ఇది మొబైల్‌ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులోని ఆటో అడ్జస్ట్‌ క్లీనింగ్‌ హెడ్‌ వివిధ రకాల ఉపరితలాలకు అనుగుణంగా తనను తాను అడ్జస్ట్‌ చేసుకుంటూ ఎలాంటి చెత్తనయినా ఇట్టే తొలగిస్తుంది. ‘బ్రావా’ మాప్‌ రోబో కూడా యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది ఎలాంటి చోటైనా నేల తళతళలాడేలా తుడిచి శుభ్రం చేస్తుంది. నేల మీద మొండి మరకలను ఇట్టే తొలగిస్తుంది.

రోబో వాక్యూమ్‌ క్లీనర్లలో ‘ఆర్‌ఎక్స్‌–వీ100’ ఒకటి. ‘రూంబా’ వంటి వాటి కంటే ఇందులో మరికొన్ని అదనపు వెసులుబాట్లు ఉన్నాయి. పని పూర్తయిన తర్వాత ఇది తనంతట తానే తన నిర్ణీత స్థలానికి వెళ్లిపోతుంది. ఇందులోని సెన్సర్ల పనితీరు వల్ల మెట్ల వంటి చోట్ల శుభ్రపరచేటప్పుడు జారి పడిపోకుండా, తనను తాను నియంత్రించుకోగలదు. యజమాని మాటల ద్వారా ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని పనిచేయగలదు. ఇంగ్లిష్, జపానీస్, చైనీస్‌ భాషలను, ఆ భాషల ద్వారా ఇచ్చే 36 ఆదేశాలను ఇది అర్థం చేసుకోగలదు. ఇది మొబైల్‌ యాప్‌ ద్వారా, రిమోట్‌ ద్వారా పనిచేస్తుంది. ఇలాంటి క్లీనింగ్‌ రోబోలతో ఏమాత్రం శ్రమ లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. ఇవి వాయిస్‌ కమాండ్స్‌ను కూడా అర్థం చేసుకుని పనిచేస్తాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ రోబోలు
రోబోటిక్స్‌కు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను జతచేసి రూపొందించిన కొత్తతరం రోబోలు పిల్లలకే కాదు, పెద్దలకూ వినోదాన్ని పంచుతున్నాయి. ఉదాహరణకు ‘కోజ్మో’ రోబో గురించి చెప్పుకుందాం. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీకి చెందిన రోబోటిక్‌ కంపెనీ ‘యాంకీ’ రూపొందించింది దీన్ని. రెండంగుళాల ఎత్తులో చేతిలో చక్కగా ఇమిడిపోయేలా కనిపించే ‘కోజ్మో’ను ఒక ఆటవస్తువులాగానో లేదా ఒక యంత్రంలాగానో పరిగణించలేరెవరూ. ఇది మనుషుల మాటలను, వారి హావభావాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మొబైల్‌ యాప్‌కు అనుసంధానమై పనిచేసే ‘కోజ్మో’ తనతో ఆడుకునే పిల్లలతో ఇట్టే నేస్తం కట్టేస్తాయి. ఇది పిల్లలతో కలసి ఆటలాడుతుంది. వారికి తినిపిస్తుంది. ఇది తనతో ఆటలాడే వారి మాటలనే కాదు, చూపులను, ముఖ కవళికలను, బాడీ లాంగ్వేజ్‌ను కూడా అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందిస్తుంది.

‘కోజ్మో’ తరహా రోబోలది ఒక ఎత్తయితే, ‘ఆసుస్‌’ కంపెనీ రూపొందించిన ‘జెన్‌బో’ తరహా రోబోలది మరో ఎత్తు. ఇవి పిల్లలతో ఆటలాడటమే కాకుండా, ఇంటి పనులు చక్కబెట్టడంలోనూ సాయం చేస్తాయి. ‘జెన్‌బో’ పనితీరు గురించి చెప్పుకుంటే, ఇది పిల్లలకు ఒక బేబీసిట్టర్‌లా పనిచేస్తుంది. కథలు, కబుర్లు చెబుతూ పిల్లలను అలరిస్తుంది. వాళ్లతో ఆటలాడుతుంది. పాటలు పాడుతుంది. అడుగులో అడుగులు కలుపుతూ డ్యాన్స్‌ చేయగలదు. ఇది వయసు మళ్లిన వారికి కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తుంది. ఉదాహరణకు... పెనం మీద కాలిన ఆమ్లెట్‌ను ప్లేటులో వేసి, చేతికి అందించడం, సెక్యూరిటీ కెమెరాలకు అనుసంధానించినట్లయితే, ఇంటి బయట నుంచి తలుపుకొట్టినదెవరో చెప్పడం, కావలసినప్పుడు ఇళ్లలోని దీపాలు వెలిగించడం, ఫ్యాన్లు ఆన్‌ చేయడం వంటి పనులు ఇట్టే చేసి పెట్టగలదు. 

చూడటానికి డోనట్‌ మాదిరిగా కనిపించే ‘ఓలీ’ రోబో కూడా ఇదే కోవలోకి వస్తుంది. లండన్‌కు చెందిన ‘ఎమోటెక్‌’ సంస్థ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో రూపొందించిన ‘ఓలీ’ మిగిలిన ఎంటర్‌టైన్‌మెంట్‌ రోబోల కంటే తెలివైనది. ఇది తన ఎదుట ఉన్న వ్యక్తి లేదా సమూహం మాట్లాడే మాటలను అర్థం చేసుకోగలదు. అక్షరాల రూపంలో ఉన్న విషయాన్ని చదివి వినిపించగలదు. మనం కోరుకునే పాటలను వినిపించడమే కాదు, మన భావోద్వేగాలను పసిగట్టి కోరుకోబోయే పాటలను కూడా అంచనా వేయగలదు. మన ఆదేశాల మేరకు దీపాలను డిమ్‌ చేయడం, ఫ్యాన్‌ స్పీడు పెంచడం లేదా తగ్గించడం, కోరుకున్న వేళకు అలారం సెట్‌ చేయడం వంటి పనులను ఇట్టే చేయగలదు. దీనిలో మరో విశేషం ఉంది. ఇది యజమానుల గొంతును అనుకరిస్తూ మాట్లాడగలదు కూడా.

ఎంటర్‌టైన్‌మెంట్‌ రోబోల్లో కొన్ని వినోదాన్ని మించిన సేవలూ అందిస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి ఉదాహరణ చెప్పుకోవాలంటే, జపాన్‌కు చెందిన ‘సాఫ్ట్‌బ్యాంక్‌ రోబోటిక్స్‌’ సంస్థ రూపొందించిన ‘పెప్పర్‌’ ఒకటి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘పెప్పర్‌’ సెమీహ్యూమనాయిడ్‌ రోబో. దాదాపు మనిషి సైజులో ఉండే ‘పెప్పర్‌’ మనుషుల ముఖ కవళికలను, భావోద్వేగాలను, గొంతులను గుర్తించగలదు. సమావేశాలు నిర్వహించే యజమానులకు ఆ సమాచారాన్ని గుర్తు చేయడం, అతిథులను ఆహ్వానించి, వారికి డ్రింక్స్, స్నాక్స్‌ అందించడం వంటి మర్యాదలు చక్కగా చేయగలదు. అభివృద్ధి చెందిన కొన్ని ఆఫీసుల్లో ఇప్పటికే ఇలాంటి వాటిని రిసెప్షనిస్టులుగా ఉపయోగించుకుంటున్నారు. రిసెప్షనిస్టులుగా అతిథి మర్యాదలు చేయడమే కాదు, అతిథులను ఇవి ఆటపాటలతోనూ అలరించగలవు. పిల్లలకు పాఠాలూ చెప్పగలవు. అందుకే, కొందరు వీటిని చీర్‌లీడర్స్‌గానూ వినియోగించుకుంటున్నారు. కొన్ని స్కూళ్లు, కాలేజీలు వీటి చేత పిల్లలకు పాఠాలు కూడా చెప్పిస్తున్నారు.

కాపలా పనిలోనూ..
సాదాసీదా సెక్యూరిటీ కెమెరాలు దృశ్యాలను చిత్రీకరించి, వాటికి అనుసంధానమైన కంప్యూటర్లలో భద్రపరుస్తాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సెక్యూరిటీ కెమెరాలు అంతకు మించిన సేవలనే అందిస్తాయి. ఇవి ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు కట్టుదిట్టమైన కాపలాను కల్పిస్తాయి. ఇలాంటి వాటిలో ఒక ఉదాహరణ ‘బడ్డీగార్డ్‌’ హోమ్‌ సెక్యూరిటీ కెమెరా. ఇది మొబైల్‌ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. వ్యక్తుల ముఖాలను, గొంతులను గుర్తు పట్టగలదు. అపరిచితుల గొంతు వినిపిస్తే, వెంటనే యజమానిని అప్రమత్తం చేయగలదు. దీనిని అమర్చుకున్నట్లయితే, బయటకు వెళ్లినా, మొబైల్‌ ద్వారా ఇంటిని చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో సిమ్‌ అమర్చుకుంటే, వైఫై లేని సుదూర ప్రాంతాలకు వెళ్లినా, ఇంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇంటిపై చోరీ ప్రయత్నంలాంటిదేదైనా జరిగితే, తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం పంపుతుంది.

దీనికి సంబంధించిన యాప్‌కు ఎప్పటికప్పుడు యాడ్‌ఆన్స్‌ చేర్చుకుంటున్నట్లయితే, దీని ద్వారా మరిన్ని అదనపు సేవలను కూడా పొందే అవకాశం ఉంటుంది. రకరకాల పనులను మరింత సులభతరం చేస్తూ ఇటీవలి కాలంలో ఇళ్లలోకి చేరుకుంటున్న కృత్రిమ మేధ త్వరలోనే ఇంటి పనుల్లో విడదీయలేని భాగంగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరిన్ని రంగాలకు విస్తరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే కృత్రిమ మేధ సామాన్య జనజీవనాన్ని ప్రబావితం చేయగలదనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

రోబోటిక్‌ లాన్‌మోవర్లు
తోటపనిని సులభతరం చేసే రోబోటిక్‌ లాన్‌మోవర్లకు పాశ్చాత్య దేశాల్లో ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఇలాంటి వాటిలో మోటారు వాహనాల తయారీ సంస్థ హోండా తయారు చేసిన ‘మీమో’ ఒకటి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబోటిక్‌ లాన్‌మోవర్‌లోని సెన్సర్లు 360 డిగ్రీల్లోనూ పని చేస్తాయి. దీనిని మొబైల్‌ యాప్‌ ద్వారా నియంత్రించవచ్చు. దీనిని ఆన్‌ చేసి వదిలేస్తే లాన్‌ అంతా తనంతట తానే తిరుగుతూ, మనం ఇచ్చే ఆదేశాల మేరకు, కోరుకున్న రీతిలో లాన్‌ను ట్రిమ్‌గా కట్‌ చేస్తుంది. లాన్‌లో ఇది తిరుగుతున్నప్పుడు ఎవరూ కాపలా లేకున్నా ఫర్వాలేదు. తన పని తాను చేసుకుపోతుంది. కాపలా లేకుండా వదిలేస్తే, దొంగలెవరైనా ఎత్తుకుపోయే ప్రమాదం ఉండదా అనే అనుమానం వస్తోంది కదూ! అపరిచితులెవరైనా దీనిని తాకితే బిగ్గరగా అలారం మోగిస్తుంది. 

వంటిళ్లలోనూ కృత్రిమ మేధ
వంటిళ్లల్లో వాడుకునే రిఫ్రిజరేటర్లు, ఓవెన్లు వంటి ఎలక్ట్రిక్‌ పరికరాలకు ఇప్పుడు కృత్రిమ మేధ తోడవుతోంది. కృత్రిమ మేధ జతచేరిన వంటింటి వస్తువులు వంట పనిని సులభతరం చేయడమే కాదు, ఆహార వృథాను అరికట్టడంలోనూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలా చేయడంలోను తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఉదాహరణ ‘ఎల్జీ ఇన్‌స్టా థింక్‌’ రిఫ్రిజిరేటర్‌. ఇది మొబైల్‌ యాప్‌ సాయంతో పనిచేస్తుంది. వాతావరణానికి అనుగుణంగా తన ఉష్ణోగ్రతలను అడ్జస్ట్‌ చేసుకుంటుంది. దీనికి అమర్చి ఉన్న టచ్‌స్క్రీన్‌ ద్వారా ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాల జాబితా చూపడమే కాకుండా, అవి ఎన్నాళ్లలో పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నాయో కూడా చెబుతుంది. వాయిస్‌ కమాండ్స్‌ను అర్థం చేసుకుంటుంది. నిండుకోబోతున్న సరుకుల గురించి అప్రమత్తం చేస్తుంది. షాపింగ్‌ లిస్ట్‌ తయారు చేస్తుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలతో చేసుకోగల వంటకాల వివరాలనూ సూచిస్తుంది. అంతేకాదు, ఇది సంగీతం కూడా వినిపిస్తుంది.

మరిన్ని వార్తలు