Arya Dhayal: కాలం మారి... కోలం మారి

12 Jun, 2021 20:51 IST|Sakshi

యంగ్‌ టాలెంట్‌

ఎన్ని రోజులు చీకట్లో కూర్చుంటావు?
ఎన్ని రోజులు నీ ఒంటరి ప్రపంచంలో ఉంటావు?
కదలాలి... కదనరంగంలోకి దూకాలి
కాలంతో పోటీ పడాలి.
‘కాలం మారి... కోలం మారి’ అంటోంది ఆర్యా దయాళ్‌.
దేశీయ సంగీతానికి వెస్ట్రన్‌ ఫ్లేవర్‌ జోడించి
యుకెలేలితో అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్యా.
తన పాటకు పునాది సామాజిక స్పృహ అని చెబుతుంది...

తాను పాడిన పాటను బిగ్‌బి అమితాబ్‌కు పంపించాలనుకుంది ఆర్యా దయాళ్‌. అంతే..అప్పటికప్పుడు తన గదిలో కూర్చొని ఎడ్‌ షీరన్‌ పాపులర్‌ సాంగ్‌ ‘షెడ్‌ ఆఫ్‌ యూ’ పాడి సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి పంపించింది.

కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఆ సమయంలో ‘బిగ్‌ బి’ హాస్పిటల్‌లో ఉన్నారు. కాబట్టి అటు నుంచి స్పందన వస్తుందని అనుకోలేదు ఆర్యా.
కాని ఊహించని విధంగా పెద్దాయన నుంచి పెద్ద స్పందన వచ్చింది.


‘మీరేవరో నాకు తెలియదు. కాని నాకు బాగా తెలుసు... మీలో గొప్ప ప్రతిభ ఉందని. కర్నాటక, వెస్ట్రన్‌ మ్యూజిక్‌ను మిక్స్‌ చేయడం సులువు కాదు. కాని ఆ పని మీరు చాలా సులువుగా చేశారు. మిక్సింగ్‌లో వాటి సహజత్వం మిస్‌ కాకుండా చూశారు. ఈరోజు మీ పాట వినడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని ట్విట్టర్‌లో ఆశీర్వదించారు బిగ్‌ బి.

హరిహరన్‌లాంటి ప్రసిద్ధ గాయకుల నుంచి కూడా ఆర్యాకు ప్రశంసలు లభించాయి.
‘పెద్దల ప్రశంసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అని సంబరపడిపోతుంది ఆర్యా.


కేరళలోని కన్నూర్‌ ప్రాంతానికి చెందిన ఆర్యా దయాళ్‌ 2016లో రాసిన ఒక కవిత సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ తరువాత సాహిత్యంలోనే కాదు సంగీతంలోనూ తన టాలెంట్‌ చాటుకుంది ఆర్యా.

‘కాలం మారి–కోలమ్‌ మారి–ఎన్‌జన్‌గళుమ్‌ అంగ్‌ మారి’ (కాలం మారింది. చూసే దృష్టికోణం మారింది. కాబట్టి మనం కూడా మారాలి) పాటతో డిజిటల్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యాకు 140,000 ఫాలోవర్స్‌ ఉన్నారు. తన పాటలను ఎప్పటికప్పుడూ పోస్ట్‌ చేస్తుంటుంది.


ఆమె లెటెస్ట్‌ రిలీజ్‌ ‘అంగనే వేనమ్‌’ ట్రెండింగ్‌ అయింది. మాస్, మసాల పాటలు కాకుండా స్త్రీలను చైతన్యపరిచే పాటలు, లింగవివక్షతను ఖండించే పాటలు పాడడం అంటే ఆర్యాకు ఎంతో ఇష్టం. ఇక తనకు ఇష్టమైన సంగీతవాయిద్యం యుకెలేలి. పచ్చటి ప్రకృతి ఒడిలో, నిశ్శబ్దం దట్టంగా ఆవరించిన ఏకాంతదేశంలో యుకెలేలి స్వరాలు ఆర్యాను కొత్త లోకాల్లోకి తీసుకువెళతాయి.
 ‘రా వాయిస్‌’ ఆమె ప్రత్యేకత.

కొందరైతే ‘యుకెలేలిలాగే ఆమె స్వరం కూడా ఒక ఇన్‌స్ట్రుమెంట్‌’ అని ప్రశంసిస్తుంటారు!

మరిన్ని వార్తలు