ఎలా మోయగలిగావ్‌?

12 Jun, 2021 05:17 IST|Sakshi

ఆపద కాలం ఉంటుంది. కానీ ఆదుకోలేని కాలం ఒకటి ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాం. ఒక కోడలు.. అపస్మారక స్థితిలో ఉన్న తన మామగారిని వీపు పైన మోసుకుంటూ ఆసుపత్రులకు తిరిగిన ఫొటోలు వారం రోజులుగా నెటిజన్‌ల చేత బరువైన ఒక దీర్ఘ శ్వాసను తీయిస్తున్నాయి. ఏమైనా ఆ కోడలు నీహారిక ప్రయత్నం ఫలించలేదు. కరోనా ఆయన్ని తీసుకెళ్లిపోయింది.  ‘‘ఎలా మోయగలిగావ్‌?’’ అన్నారట.. ఆసుపత్రి బెడ్డుపై ఉండగా ఆ ఫొటోలు చూసిన ఆమె మామగారు. అవే ఆయన ఆఖరు మాటలు.

‘‘ఎవరూ సహాయానికి రాలేదు. ఎవరికీ ఇలా జరగకూడదు’’.
ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న నీహారిక ఆవేదన ఇది. ఎవరూ సహాయానికి రాలేదని ఆమె ఎవరినీ నిందించడం లేదు. ఎవరికీ ఇలా జరగకూడదని మాత్రమే ఆమె కోరుకుంటోంది. ‘ఇలా’ అంటే?! తన మామగారు తుళేశ్వరదాసుకు జరిగినట్లుగా! ఆయనకు ఈ నెల 2 న కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆసుపత్రికి ఆటో ఎక్కించడం కోసం.. స్పృహలో లేని మామగారిని వీపుపై మోసుకుంటూ వెళ్తున్న నీహారిక ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. ఆ ఫొటోలను ఆసుపత్రి సిబ్బంది ఒకరు తుళేశ్వరదాసుకు చూపించినప్పడు ఆయన అన్నమాటే.. ‘‘ఎలా మోశావ్‌?’’ అని.
∙∙
అస్సాంలో ఉంటుంది వీళ్ల కుటుంబం. నగావ్‌ జిల్లాలోని రహా పట్టణం పక్కన బటిగావ్‌ గ్రామంలో ఉంటారు. నీహారిక మామ తుళేశ్వరదాసుకు 75 ఏళ్లు. ఊళ్లోనే వక్కలు అమ్ముతుంటాడు. నీహారిక భర్తకు పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో చిన్న ఉద్యోగం. నీహారిక కొడుక్కి ఆరేళ్లు. ‘దేవుడా.. కరోనా కాదు కదా..’ అని అనుకునే లోపే మామగారి ఆరోగ్యం విషమించడంతో నీహారిక కాలూచెయ్యీ ఆడలేదు ఆ రోజు! భర్త ఊళ్లో లేడు. కొడుకు చిన్నపిల్లాడు. ఇల్లు కదలొద్దని పిల్లవాడికి జాగ్రత్తలు చెప్పి, నీహారిక ఆటో మాట్లాడుకొచ్చింది. రహా ఆరోగ్య కేంద్రం అక్కడికి 2. కి.మీ. దూరంలో ఉంది. పేషెంట్‌ని తీసుకెళ్లడానికి ఆటోని ఒప్పించ గలిగింది కానీ.. ఇంటివరకు ఆటో రావడానికే వీల్లేని విధంగా మట్టి దిబ్బల దారి. నీహారికకు మిగిలిన దారి ఒక్కటే. చీర కొంగును నడుముకు బిగించి, మామగారిని భుజాలపై ఆ ఎడుగు దిగుడు దిగుళ్లలో ఆటో వరకు మోసుకుంటూ వచ్చి భద్రంగా ఆటోలో పడుకోబెట్టింది. ఆరోగ్య కేంద్రం దగ్గర మళ్లీ మామగారిని తన వీపు మీద మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లడమే! సాయానికి వచ్చిన వారే లేరు. కరోనా అని నిర్థారణ అయింది. ‘‘ఇక్కడ లాభం లేదు, నగావ్‌లోని కోవిడ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అన్నారు. నగావ్‌ ఆసుపత్రి అక్కడికి 21 కి.మీ.! అంబులెన్స్‌ లేదు. ప్రైవేటు వ్యానులో మామగారిని నగావ్‌ తీసుకెళ్లింది. ఆ ఆసుపత్రిలోంచి, వ్యాన్‌లోకి మళ్లీ తన వీపు మీద మోస్తూనే!! ఆ సమయంలోనే ఒకరు నీహారిక పడుతున్న పాట్లను ఫొటో తీసినట్లున్నారు. తర్వాత కొద్ది గంటల్లోనే అవి సోషల్‌ మీడియాలోకి వచ్చేశాయి. నీహారికకు ఆ సంగతి తెలీదు.
∙∙
నగావ్‌లోని కోవిడ్‌ ఆసుపత్రి తీసుకెళ్లాక, అక్కడ కూడా నీహారిక తన మామగారిని వాహనం నుంచి దింపి మోసుకెళ్లవలసి వచ్చింది! పేషెంట్‌ పరిస్థితిని చూడగానే ‘‘ఇక్కడ ఎక్విప్‌మెంట్‌ లేదు. నగావ్‌ సివిల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అని వైద్యులు చెప్పారు. అక్కడ కూడా మామగారిని మోస్తూనే ఆసుపత్రి మెట్లను ఎక్కిదిగవలసి వచ్చింది నీహారికకు. ‘‘మా మామగారి బరువు నాకు కష్టం కాలేదు. కానీ ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగుతున్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోయాను’’ అని ఆ తర్వాత తనను కలిసిన పత్రికా ప్రతినిధులతో చెప్పింది నీహారిక. ‘‘బహుశా ఆ రోజు నేను కనీసం రెండు కి.మీ.ల దూరమైనా ఆయన్ని ఎత్తుకుని నడిచి ఉంటాను’’ అని 24 ఏళ్ల నీహారిక ఆనాటి ఒంటరి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. జూన్‌ 7 రాత్రి ఆయన చనిపోయారు. తర్వాత టెస్ట్‌ చేయించుకుంటే నీహారికకూ పాజిటివ్‌!
∙∙
‘‘తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, అపరిచితులే అయినా.. మనం ఒకరికొకరు సహాయం చేసుకోగల పరిస్థితులు లేకపోడం దురదృష్టం. మనిషి ఒంటరితనాన్ని ఇంకో మనిషి మాత్రమే పోగొట్టగలరు’’ అంటోంది నీహారిక. మామగారు తనను కూతురిలా చూసుకునేవారట. ‘‘అందుకేనేమో ఆయన్ని మోసేంత శక్తి నాకు వచ్చినట్లుంది’’ అంటోంది దిగులుగా.
 

ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి.. వాహనం ఎక్కి దిగిన ప్రతిసారీ తన మామగారు తుళేశ్వరదాసును వీపుపై మోసుకెళుతున్న నీహారిక.

ఆసుపత్రిలో నీహారిక, ఆమె మామ తుళేశ్వరదాసు

మరిన్ని వార్తలు