కేరళ కోడలు

26 Nov, 2020 08:11 IST|Sakshi

కేరళలో డిసెంబర్‌ 10న స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి వార్డుల్లో జరుగుతున్న హోరాహోరీలో ఒక అస్సాం మహిళ న్యూస్‌ క్రియేట్‌ చేస్తోంది. ఆరేళ్ల క్రితం మలయాళ భర్తను పెళ్లి చేసుకుని కేరళకు చేరుకున్న ‘మున్మి షాజీ’ ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా వార్డులో పోటీ చేస్తోంది. చక్కగా మలయాళం మాట్లాడుతున్న ఈ అస్సామీని కేరళీయులు ఆదరిస్తున్నారు. ‘నేను మీ కోడలిని’ అంటే సరే అంటున్నారు. నటుడు సురేష్‌ గోపి ఆమెను చూసి సంతోషించి ఒక ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు.

కేరళలోని కన్నూరు జిల్లా ఇరిట్టీ మునిసిపాలిటీ ఇప్పుడు అక్కడ వార్తల్లో ఉంది. ఆ మునిసిపాలిటీలోని వికాస్‌ నగర్‌ వార్డులో ఒక అస్సాం మహిళ కౌన్సిలర్‌గా పోటీ చేస్తూ ఉండటమే దీనికి కారణం. అవతల వైపు ఉన్నది సిపిఎంకు చెందిన తల పండిన నాయకుడు. ఆయనప్పటికీ ‘మున్మి షాజీ’ అనే ఆ మహిళ వెరవక బీజేపీ తరపున నిలబడింది. మున్మిది అస్సాం. భర్త షాజి అక్కడ పని చేస్తూ ఉండగా ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకొని కేరళ వచ్చేసింది. మరి అస్సాం ముఖం చూళ్లేదు. బీజేపీ అభిమాని అయిన షాజీ ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భార్యను రంగంలోకి దించాడు.

స్థానికులు పాల్గొనే ఈ ఎన్నికలలో ‘నాన్‌ లోకల్‌’ అయిన మున్మి రంగంలో దిగడం అందరినీ ఆకర్షించింది. ‘నేను మీ కోడలిని’ అంటూ ఇంటింటికి తిరుగుతున్న మున్మికి మెల్లగా ఆదరణ మొదలైంది. మున్మి మలయాళం నేర్చుకుని అస్సామీ యాసతో అయితేనేమి బాగా మాట్లాడుతోంది. న్యూస్‌లో వచ్చిన ఈమె విశేషాలు బీజేపీ ఎంపి, నటుడు అయిన సురేశ్‌ గోపిని ఆకర్షించాయి. ఆమె గురించి తెలుసుకుంటే భర్యాభర్తలు ఇద్దరూ చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతారని తెలిసింది. ‘ఆమెకు నేను ఇల్లు కట్టిస్తాను’ అని సురేశ్‌ గోపి ట్వీట్‌ చేశారు. సురేశ్‌ గోపి గతంలో ఇలా చాలామందికి సాయం చేశారు కనుక అస్సాం నుంచి వచ్చిన అభ్యర్థికి కేరళలో చెదరని నీడ దొరికినట్టే. 

మరిన్ని వార్తలు