వ్యర్థాలతో విలువైన అల్లికలు!

18 Jun, 2021 05:16 IST|Sakshi
రూప్‌జ్యోతి సైకియా గొగోయ్‌

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ముఖ్యమైన సమస్యల్లో ప్లాస్టిక్‌ కాలుష్యం కూడా ఒకటి. పచ్చదనంతో కళకళలాడే పర్యాటక ప్రాంతాలకు సైతం ఈ ప్లాస్టిక్‌ భూతం పెనుసమస్యగా పరిణమిస్తోంది. ఆయా పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు.. వివిధ రకాల పనులకోసం ఉపయోగించే వస్తువుల్లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారైనవే. రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ కాలుష్యం పై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. దీనిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమస్య కు అత్యంత సులభమైన పరిష్కారం చూపడంతోపాటూ, నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు అసోంకు చెందిన రూప్‌జ్యోతి సైకియా గొగోయ్‌.

అసోంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగా జాతీయ ఉద్యానవనం కూడా ప్లాస్టిక్‌ కాలుష్య ముప్పునకు గురవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కజిరంగా పార్క్‌ను సందర్శించే పర్యాటకులు వదిలిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

ఇది గమనించిన 47 ఏళ్ల రూప్‌జ్యోతి సైకియా గోగోయ్‌ వీటికి చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. కజిరంగా పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటితో çహ్యాండ్‌ బ్యాగ్‌లు, డోర్‌ మ్యాట్లు, టేబుల్‌ మ్యాట్‌లు, ఇతర రకాల ఫర్నీషింగ్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అంతేగాక పనికిరాని ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించి పనికొచ్చే వస్తువులు ఎలా తయారు చేయాలి– అనే అంశంపై స్థానిక నిరుపేద మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న మహిళలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ద్వారా ఉపాధి పొందుతున్నారు.

కజిరంగా హట్‌..
రూప్‌జ్యోతి మరికొంతమంది మహిళలç సహకారంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి..  వాటిని శుభ్రం చేసి, కత్తిరించి దారాల సాయంతో వస్తువులుగా రూపొందిస్తారు. ఇవి చూడడానికి ఆకర్షణీయంగానే గాక, మన్నికగా కూడా ఉంటాయి. కొందరు మహిళలు వీటిని రూపొందించే పనిలో ఉంటే.. మరికొందరు ఈ వస్తువులను పర్యాటకులకు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే 2012లో రూప్‌జ్యోతి ‘కజిరంగా హట్‌’ పేరిట ఒక అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా తయారు చేసిన వస్తువులను హట్‌ లో ప్రదర్శించి విక్రయిస్తుంటారు. నాలుగువేల మందికి పైగా మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటిదాకా అసోంలోని 35 గ్రామాల్లోని మహిళలకు  ఆమె శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు దేశ విదేశీ పర్యాటకులకు వస్తువులు విక్రయించి నెలకు 25 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

మరికొన్ని రాష్ట్రాల్లోనూ..
 ముంబైకి చెందిన ఎన్జీవో ద కార్బెట్‌ ఫౌండేషన్‌.. 2013–2017 మధ్యకాలంలో కజిరంగా పరిసర ప్రాంతాల్లోని మహిళ అభివృద్ధికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమంలో రూప్‌జ్యోతి పాల్గొని దాదాపు రెండువందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. అంతేగాక  అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిబెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ  కార్యక్రమాల్లో పాల్గోని ఇప్పటిదాక 2,300 మంది మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇచ్చారు.

వెదురు పుల్లల్ని అల్లినట్లుగా...
‘‘అది 2004.. మా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ వ్యర్థాలను ఎలా రూపుమాపాలి? వీటితో పనికొచ్చేవి ఏమైనా తయారు చేయవచ్చా అని బాగా ఆలోచించాను. ఈ క్రమంలోనే కొందరు వెదురు పుల్లల అల్లికల ద్వారా రకరకాల వస్తువులు రూపొందించడం నా మదిలో మెదిలింది. వెంటనే వెదురు లాగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను కూడా అల్లవచ్చు కదా! అనుకున్నాను. వెంటనే చిన్న చిన్న టెక్నిక్‌లతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాటన్‌ దారంతో కలిపి రకరకాల వస్తువులు రూపొందించడం మొదలుపెట్టాను. వీటిని రూపొందించడానికి నేను ఎటువంటి శి„ý ణా తీసుకోలేదు. అలా ముందు నేను నేర్చుకుని తర్వాత స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చాను. మేమందరం తయారు చేసే ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తులు ఎంతో మన్నికగా ఉంటాయి’’ అని రూప్‌జ్యోతి వివరించారు.

కజిరంగా హట్‌ వద్ద సందర్శకులు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు