ఆస్తమా ఎందుకు, ఎలా వస్తుందంటే..?

2 Mar, 2021 14:46 IST|Sakshi

చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలంలో విపరీతమైన వేడిమి, అత్యధికంగా రేగే దుమ్ము వంటివి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఆస్తమా కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉంటే ఆస్తమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాంతో ఆస్తమాతో బాధపడేవారి పరిస్థితి తీవ్రంగా తయారవడాన్ని ఆస్తమా అటాక్‌ లేదా ఆస్తమా ఎపిసోడ్‌ అంటారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది. ఆస్తమా అటాక్‌ జరిగినప్పుడు శ్వాసవ్యవస్థలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతాయి.

ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. 
వాయునాళాల చుట్టూతా కండరాలు బిగుసుకుంటాయి. దాంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా కుంచిస్తుంది. శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది
వాయునాళాల వాపు ఎక్కువై, వాయువులు ప్రయాణం చేసే దారి మరింత సన్నబారిపోతుంది.
వాయునాళాలలో వాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ మ్యూకస్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి. 

ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకు ఆస్తమా అటాక్‌ జరుగుతుంది. ఈ అటాక్‌ ప్రారంభం లో ఊపిరితిత్తులకు కొంచెం తక్కువగానైనా ఆక్సిజన్‌ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వాసకోశాలలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ నిలిచిపోయి శరీరంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సిజన్‌ తగ్గుతుంది. ఈ రకమైన ఆస్తమా అటాక్‌ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

చదవండి: కాఫీ తాగడం మంచిదా..? కాదా..?

మరిన్ని వార్తలు