చల్లని ‘రాజా’ ఓ చందమామ

16 Dec, 2020 10:27 IST|Sakshi

ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అంటారు.ఈ చిత్రాన్ని చూడండి...పదాలు మాత్రమే కాదు కల, పట్టుదల కలిసికట్టుగా కనిపిస్తాయి. చంద్రుడి పైకి పంపడానికి ‘నాసా’ ఎంపిక చేసిన బృందంలో ఒకరైన రాజాచారి పదకొండు సంవత్సరాల వయసులో తయారుచేసిన పోస్టర్‌ ఇది..

రాజాచారి పదకొండు ఏళ్ల వయసులో, ప్రస్తుతం..

నిన్న అనేది  నేటి జ్ఞాపకంరేపు అనేది నేటి కల.
–ఖలీల్‌ జిబ్రాన్‌
చిన్న వయసులో పిల్లలు కనే కలలు పెద్దలకు మురిపెంగా ఉంటాయి. చాలామంది పిల్లల్లో ఆ కలలు వయసు పెరుగుతున్నకొద్దీ కరిగిపోతుంటాయి. కొందరు దీనికి మినహాయింపు. వారిలో కలలు కరిగిపోవు. బలపడతాయి. రాజాచారి ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘రాజాచారి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన పేరు. ‘నాసా’ చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో ఇండియన్‌–అమెరికన్‌ రాజాచారి ఒకరు.

పదకొండు సంవత్సరాల వయసులో ఆస్ట్రోనాట్‌  కావాలని కలలు కన్నాడు రాజా. ‘ఇది పిల్లకల’ అని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోలేదు. ఆ కలల సౌధానికి దగ్గర కావడానికి ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ఉన్నత చదువు, సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ కోసం శ్రీనివాస్‌చారి(రాజా తండ్రి) ఇంజనీరింగ్‌ డిగ్రీతో  హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడ అమెరికన్‌ పెగ్గి ఎగ్బర్ట్‌ను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే రాజాచారి.

రాజా చిన్నప్పుడు కాగితాలు, మెటల్‌ హుక్‌లతో బొమ్మ విమానాలు తయారుచేసి మురిసిపోయేవాడు. పక్కింటి పిల్లలు ఈ బొమ్మల కోసం పరుగులు తీస్తూవచ్చేవారు. తన భుజాలకు రెక్కలు తగిలించుకొని ఊహాల్లో ఆకాశంలోకి వెళ్లి వచ్చేవాడు రాజా. ‘ఫాంటసీ ప్రపంచం’లో వీరవిహారం చేసేవాడు. తల్లి టీచర్‌ కావడంతో ‘చందమామ పాఠాలు’ ఆసక్తికరంగా చెప్పేది. ఎన్నో సందేహాలను ఓపిగ్గా తీర్చేది.

సైన్స్‌ మాత్రమే కాదు సంగీతం అంటే కూడా రాజాకు బాగా ఇష్టం. రెండేళ్ల వయసులోనే సుజుకి మెథడ్‌ వయోలిన్‌ పాఠాలు నేర్చుకున్నాడు. ఆరేళ్ల వయసులో ఫ్రెంచ్‌ హార్న్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యం సంపాదించాడు.‘నీ బ్రెయిన్‌లో కుడి,ఎడమ భాగాలు సమానంగా వృద్ధి చేయడానికి ప్రయత్నించు’ అని రాజాకు పదేపదే చెప్పేది తల్లి. మెదడులోని ఎడమభాగం విశ్లేషణ, కుడిభాగం సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది.

స్ఫూర్తి కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. స్ఫూర్తిని ఇచ్చే వాళ్లు పెద్దల రూపంలో మన చేరువలోనే ఉంటారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌చారి అలాంటి వారే. చేతిలో ఇంజనీరింగ్‌ పట్ట, గుండెలో ధైర్యం...అంతే...అమెరికాకు వచ్చేశాడు. దేశం కాని దేశం. తెలియని మనుషులు. తెలియని కష్టాలు..కాని ఇవేమీ ఆయన ఆలోచించలేదు. అర్జునుడి చూపు పిట్టకన్ను మీదే ఉన్నట్లు శ్రీనివాస్‌ కన్ను కూడా ఒకే లక్ష్యాన్ని చూసింది. సాధించాలి....ఎలాగైనా సాధించాలి! ఆయన తన ప్రయాణంలో విజయాన్ని సాధించాడు. ఆ స్ఫూర్తిని కుమారుడికి అందించాడు.‘బాగా కష్టపడి చదివితే ఎన్నో ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి కష్టాన్ని ఇష్టపడాలి’ అని రాజాచారితో చెబుతుండేవారు శ్రీనివాస్‌.‘‘ఇతరులు ఏమైనా అనుకుంటారని, హేళన చేస్తారనే భయం నాలో ఎప్పుడూ లేదు. నేను ఒకటి ఇష్టపడ్డాను అంటే. ఇక అంతే...చాలా కష్టపడతాను’ అంటాడు రాజాచారి.

ఆ కష్టమే అతడిని యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చేసేలా, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్‌డిగ్రీ చేసేలా చేసింది. టెస్ట్‌ పైలట్‌గా మార్చింది. ఆతరువాత తన ఆస్ట్రోనాట్‌ కల గుర్తుకు వచ్చింది. అదేమీ ఆషామాషీ కల కాదు. అలా అని వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ‘నాసా’లో పనిచేసే వ్యక్తులను కలవడం మొదలైంది. వారు తనలో ఎంతో స్ఫూర్తి నింపారు. కమాండర్‌ ఆఫ్‌ ది 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్క్వాడ్రన్, డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఎఫ్‌–35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ఫోర్స్‌గా తన టాలెంట్‌ చాటుకున్న చారి 2017లో నాసా ‘ఆస్ట్రోనాట్‌ క్యాండిడెట్‌ క్లాస్‌’కు ఎంపికయ్యాడు. టెస్ట్‌ పైలట్‌గా రోజువారీ సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెదికే ధైర్యం ‘నాసా కమ్యూనిటీ’లో ఉపయోగపడింది. ‘నిరంతర పఠనం, నిరంతరం మెరుగుపరుచుకోవడం ఇదే నా జీవనతత్వం’ అని చెబుతున్న రాజాచారికి జయహో చెబుదాం.

 

>
మరిన్ని వార్తలు